ఆఖరి క్షణాల్లో ఆలౌట్‌తో ఓడిన పట్నా పైరేట్స్
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో యు ముంబా ఉత్కంఠ విజయం అందుకుంది. ఆధిపత్యం చేతులూ మారుతూ సాగిన పోరులో ఆఖరి క్షణాల్లో పట్నాను ఆలౌట్ చేసిన ముంబా పైచేయి సాధించింది. అజిత్ చవాన్ 19 పాయింట్లతో విజృంభించడంతో బుధవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన పీకెఎల్ 11 లీగ్ దశ మ్యాచ్‌లో యు ముంబా 42–40 తేడాతో పట్నాను ఓడించింది. ముంబా తరఫున రెయిడర్ అజిత్ చవాన్ తో పాటు మంజీత్ (5) ఆకట్టుకున్నాడు. పట్నా జట్టులో దేవాంక్ 15 పాయింట్లు, అయాన్ 8 పాయింట్లతో సత్తా చాటినా ఫలితం లేకపోయింది. ఏడు మ్యాచ్‌ల్లో ముంబాకు ఇది నాలుగో విజయం కాగా.. ఆరు మ్యాచ్‌ల్లో పట్నా మూడోసారి ఓడిపోయింది.
హోరాహోరీలో ముంబా పైచేయి
తొలి అర్ధభాగంలో ఆరంభం నుంచి చివరి వరకు ఇరు జట్లూ నువ్వా నేనా అన్నట్టు పోరాడాయి. పట్నా తరఫున రెయిడర్ దేవాంక్, అయాన్ అదరగొట్టగా.. అటు యు ముంబా రెయిడర్ అజిత్ చవాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. సోంబీర్ పట్టు నుంచి తప్పించుకొని దేవాంక్ పట్నా పైరేట్స్ జట్టు ఖాతా తెరవగా.. మంజీత్ ముంబాకు తొలి పాయింట్ అందించాడు. దేవాంక్ జోరుతో పట్నా 9–6తో ముందంజ వేసింది. కానీ, డిఫెన్స్‌లో మెరుగైన ముంబా వరుసగా రెండు సూపర్ ట్యాకిల్స్‌తో 11–11తో స్కోరు సమం చేసింది.
డూ ఆర్ డై రైడ్‌లో సందీప్ ఓ పాయింట్ రాబట్టగా.. కోర్టులో మిగిలిన సునీల్, మంజీత్‌ను అయాన్ ఔట్ చేశాడు. దాంతో ముంబైని ఆలౌట్ చేసిన పట్నా 16–12తో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో అజిత్ తన రెయిడింగ్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. వరుసగా రెండు సూపర్ రెయిడ్స్‌తో ఐదుగురిని కోర్టు బయటకు పంపించాడు. దాంతో పైరేట్స్‌ను ఆలౌట్ చేసి ప్రతీకారం తీర్చుకున్న ముంబా 21–17తో ఆధిక్యంలోకి వచ్చింది. అదే జోరుతో 24–-21తో మూడు పాయింట్ల ఆధిక్యంతో తొలి అర్ధభాగం ముగించింది.
దేవాంక్ దూకుడు.. చివర్లో ముంబా మ్యాజిక్
విరామం నుంచి వచ్చిన వెంటనే పట్నా పైరేట్స్ జట్టు పుంజుకుంది. అటువైపు అజిత్ రెయిండింగ్ జోరు కొనసాగించినా.. పైరేట్స్ ఆటగాడు దేవాంక్ ముంబా డిఫెండర్లను ఏమార్చాడు. సోంబీర్ పట్టు నుంచి తప్పించుకొని వస్తూ ఒకే రెయిడ్‌లో మూడు పాయింట్లు రాబట్టాడు. దాంతో పైరేట్స్ 30–28తో మళ్లీ ఆధిక్యం అందుకుంది. పట్నా డిఫెండర్లు కూడా పుంజుకొని ముంబా రెయిడర్లను నిలువరించారు. ఈ క్రమంలో జఫర్దానేష్‌ను ట్యాకిల్ చేసిన పట్నా జట్టు ముంబాను రెండోసారి ఆలౌట్ చేసి తన ఆధిక్యాన్ని 33–29కి పెంచుకుంది.
దేవాంక్ మరో రెండు టచ్ పాయింట్లు రాబట్టడంతో పైరేట్స్ ఆరు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా అజిత్‌కు తోడు ఆల్‌రౌండర రోహిత్ వెంటవెంటనే రెండు పాయింట్లు రాబట్టడంతో ముంబా 36–37తో ప్రత్యర్థికి చేరువై మ్యాచ్‌ను మరింత రసవత్తరంగా మార్చింది. ఆపై డూ ఆర్ డై రైడ్‌లో అజిత్ విజయం సాధిచడంతో స్కోరు 37–37తో సమం అయింది. చివరి నిమిషంలో పైరేట్స్ కోర్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగలగా.. దీన్ని ముంబా సద్వినియోగం చేసుకుంది. పట్నా ఆటగాడు సందీప్ ఓ పాయింట్ తెచ్చి జట్టును కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ, చివరి క్షణాల్లో అతడిని ట్యాకిల్ చేసిన ముంబా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి రెండు పాయింట్లతో ఉత్కంఠ విజయం అందుకుంది
Comments
Please login to add a commentAdd a comment