Patna Pirates
-
యు ముంబా ఉత్కంఠ విజయం
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో యు ముంబా ఉత్కంఠ విజయం అందుకుంది. ఆధిపత్యం చేతులూ మారుతూ సాగిన పోరులో ఆఖరి క్షణాల్లో పట్నాను ఆలౌట్ చేసిన ముంబా పైచేయి సాధించింది. అజిత్ చవాన్ 19 పాయింట్లతో విజృంభించడంతో బుధవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన పీకెఎల్ 11 లీగ్ దశ మ్యాచ్‌లో యు ముంబా 42–40 తేడాతో పట్నాను ఓడించింది. ముంబా తరఫున రెయిడర్ అజిత్ చవాన్ తో పాటు మంజీత్ (5) ఆకట్టుకున్నాడు. పట్నా జట్టులో దేవాంక్ 15 పాయింట్లు, అయాన్ 8 పాయింట్లతో సత్తా చాటినా ఫలితం లేకపోయింది. ఏడు మ్యాచ్‌ల్లో ముంబాకు ఇది నాలుగో విజయం కాగా.. ఆరు మ్యాచ్‌ల్లో పట్నా మూడోసారి ఓడిపోయింది.హోరాహోరీలో ముంబా పైచేయితొలి అర్ధభాగంలో ఆరంభం నుంచి చివరి వరకు ఇరు జట్లూ నువ్వా నేనా అన్నట్టు పోరాడాయి. పట్నా తరఫున రెయిడర్ దేవాంక్, అయాన్ అదరగొట్టగా.. అటు యు ముంబా రెయిడర్ అజిత్ చవాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. సోంబీర్ పట్టు నుంచి తప్పించుకొని దేవాంక్ పట్నా పైరేట్స్ జట్టు ఖాతా తెరవగా.. మంజీత్ ముంబాకు తొలి పాయింట్ అందించాడు. దేవాంక్ జోరుతో పట్నా 9–6తో ముందంజ వేసింది. కానీ, డిఫెన్స్‌లో మెరుగైన ముంబా వరుసగా రెండు సూపర్ ట్యాకిల్స్‌తో 11–11తో స్కోరు సమం చేసింది.డూ ఆర్ డై రైడ్‌లో సందీప్ ఓ పాయింట్ రాబట్టగా.. కోర్టులో మిగిలిన సునీల్, మంజీత్‌ను అయాన్ ఔట్ చేశాడు. దాంతో ముంబైని ఆలౌట్ చేసిన పట్నా 16–12తో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో అజిత్ తన రెయిడింగ్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. వరుసగా రెండు సూపర్ రెయిడ్స్‌తో ఐదుగురిని కోర్టు బయటకు పంపించాడు. దాంతో పైరేట్స్‌ను ఆలౌట్ చేసి ప్రతీకారం తీర్చుకున్న ముంబా 21–17తో ఆధిక్యంలోకి వచ్చింది. అదే జోరుతో 24–-21తో మూడు పాయింట్ల ఆధిక్యంతో తొలి అర్ధభాగం ముగించింది. దేవాంక్ దూకుడు.. చివర్లో ముంబా మ్యాజిక్విరామం నుంచి వచ్చిన వెంటనే పట్నా పైరేట్స్ జట్టు పుంజుకుంది. అటువైపు అజిత్ రెయిండింగ్ జోరు కొనసాగించినా.. పైరేట్స్ ఆటగాడు దేవాంక్ ముంబా డిఫెండర్లను ఏమార్చాడు. సోంబీర్ పట్టు నుంచి తప్పించుకొని వస్తూ ఒకే రెయిడ్‌లో మూడు పాయింట్లు రాబట్టాడు. దాంతో పైరేట్స్ 30–28తో మళ్లీ ఆధిక్యం అందుకుంది. పట్నా డిఫెండర్లు కూడా పుంజుకొని ముంబా రెయిడర్లను నిలువరించారు. ఈ క్రమంలో జఫర్దానేష్ను ట్యాకిల్ చేసిన పట్నా జట్టు ముంబాను రెండోసారి ఆలౌట్ చేసి తన ఆధిక్యాన్ని 33–29కి పెంచుకుంది.దేవాంక్ మరో రెండు టచ్ పాయింట్లు రాబట్టడంతో పైరేట్స్ ఆరు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా అజిత్‌కు తోడు ఆల్‌రౌండర రోహిత్ వెంటవెంటనే రెండు పాయింట్లు రాబట్టడంతో ముంబా 36–37తో ప్రత్యర్థికి చేరువై మ్యాచ్‌ను మరింత రసవత్తరంగా మార్చింది. ఆపై డూ ఆర్ డై రైడ్‌లో అజిత్ విజయం సాధిచడంతో స్కోరు 37–37తో సమం అయింది. చివరి నిమిషంలో పైరేట్స్ కోర్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగలగా.. దీన్ని ముంబా సద్వినియోగం చేసుకుంది. పట్నా ఆటగాడు సందీప్ ఓ పాయింట్ తెచ్చి జట్టును కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ, చివరి క్షణాల్లో అతడిని ట్యాకిల్ చేసిన ముంబా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి రెండు పాయింట్లతో ఉత్కంఠ విజయం అందుకుంది -
పట్నా పైరేట్స్కే పట్టం
ఇప్పటి వరకు ప్రొ కబడ్డీ లీగ్‌లు ఐదు జరిగాయి. ఇందులో ఏకంగా మూడు టైటిళ్లను పట్నా పైరేట్సే గెలుచుకుంది. అది కూడా వరుసగా! ఇకపై పీకేఎల్ అంటేనే పైరేట్స్ దోపిడి గుర్తొస్తుందేమో! ‘హ్యాట్రిక్’తో ఈ లీగ్ ఫేవరేట్‌గా మారిపోయింది పట్నా. కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ జట్టును అన్నీ తానై నడిపించాడు. మళ్లీ జట్టును గెలిపించాడు. చెన్నై: రైడింగ్‌లో ప్రదీప్ నర్వాల్ మెరిస్తే... టైటిల్స్‌లో పట్నా పైరేట్స్ గర్జించింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఐదో సీజన్లోనూ గెలిచిన పైరేట్స్ ‘హ్యాట్రిక్’ ధమాకా సృష్టించింది. రెండేళ్ల వ్యవధిలోనే పట్నా సాధించిన మూడో టైటిల్ ఇది. గతేడాది రెండు ఈవెంట్లు జరిగాయి. ఆ రెండు సార్లు పట్నానే గెలిచింది. శనివారం ఇక్కడి జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులో పట్నా పైరేట్స్ 55–38 స్కోరుతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌పై జయభేరి మోగించింది. అరంగేట్రం చేసిన సీజన్లోనే టైటిల్ నెగ్గాలనుకున్న గుజరాత్ ఆశలపై పైరేట్స్ ఆటగాళ్లు నీళ్లు చల్లారు. ప్రదీప్ కూత... పట్నా కేక... మ్యాచ్ జరుగుతున్న కొద్దీ అత్యంత ప్రమాదకారిగా మారే ప్రదీప్ ఫైనల్లోనూ సరిగ్గా అదే పని చేశాడు. పట్నా 45... గుజరాత్ 36. మ్యాచ్ ఇంకా 4 నిమిషాల్లో ముగియనుంది. పైరేట్స్ది ఆధిక్యమే కానీ ఆలౌట్‌కు చేరువైంది. కోర్టులో ప్రదీప్‌కు జతగా ఒక్కరే మిగిలారు. వీళ్లిద్దరిని గుజరాత్ ఔట్ చేస్తే ఆలౌట్ పాయింట్లతో స్కోరు 40కి చేరుతుంది. కానీ ప్రదీప్ ఈ కీలక సమయంలో రైడింగ్‌లో జూలు విదిల్చాడు. రెండు పాయింట్లు తెచ్చాడు. అక్కడి నుంచి ఆలౌట్ రూటు గుజరాత్‌కు మారింది. ఆధిక్యం అంతకంతకూ పెంచుకున్న పట్నా దుర్భేద్యమైన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రదీప్ 19, మోను గోయట్ 9, విజయ్ 7 పాయింట్లు చేయగా... గుజరాత్ తరఫున సచిన్ 11, మహేంద్ర 5, చంద్రన్ 4 పాయింట్లు సాధించారు. మొత్తానికి మూడు నెలలపాటు జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ పట్నా పైరేట్స్ ముచ్చటైన విజయంతో ముగిసింది. ప్రదీప్... ప్రదీప్... అవార్డులు, క్యాష్ రివార్డులు అన్నీ స్టార్ రైడర్ ప్రదీప్ చేతికే చిక్కాయి. బహుమతులిచ్చే వారే మారారు కానీ అతను మాత్రం మారలేదు. పర్ఫెక్ట్ రైడర్ (రూ. 50 వేలు) మొదలు... బెస్ట్ డూ ఆర్ డై రైడర్ (రూ.50వేలు), స్టార్ స్పోర్ట్స్ మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ (రూ. 50 వేలు), ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ (రూ. 50 వేలు), లీగ్ టాప్ స్కోరర్ (రూ.10 లక్షలు), రైడర్ ఆఫ్ ద టోర్నీ (రూ. 10 లక్షలు), మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (రూ. 15 లక్షలు) అవార్డులు ప్రదీప్ నర్వాల్‌ను ముంచెత్తాయి. వీటితో పాటు రెండు ‘టీవీఎస్’ జూపిటర్ స్కూటర్లనూ గెలుచుకున్నాడు. ఉత్తమ అరంగేట్ర ఆటగాడు అవార్డు సచిన్ (గుజరాత్; రూ. 10 లక్షలు)కు, డిఫెండర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు సురేందర్ నాడా (హరియాణా; రూ. 10 లక్షలు)కు లభించాయి. ఎవరికి ఎంతంటే... ►విజేత పట్నాకు రూ. 3 కోట్లు ►రన్నరప్ గుజరాత్‌కు రూ. 1.80 కోట్లు ►అత్యంత విలువైన ఆటగాడు ప్రదీప్‌కు రూ. 15 లక్షలు -
ప్రొకబడ్డీ సీజన్-5 టైటిల్ విజేత పట్నా పైరేట్స్
సాక్షి, చెన్నై: ప్రొకబడ్డీ ఐదో సీజన్ విజేతగా డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ నిలిచింది. వరుసగా మూడో సారి టైటిల్ గెలిచి హ్యాట్రిక్ సాధించడంతో టోర్నీ చరిత్రలో తిరుగులేని రికార్డు సృష్టించింది. పట్నా కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ 19 రైడ్ పాయింట్లతో మరోసారి తన దూకుడైన ఆటతో ఆ జట్టుకు 55-38 తేడాతో చిరస్మరణీయ విజయం అందించాడు. అత్యంత డిఫెన్స్ బలం ఉన్న గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను అంతిమ సమరంలో నిలువరించాడు. అతడి దూకుడుకు తోడు స్వీయ తప్పిదాలు, ఒత్తిడి గుజరాత్‌ను చిత్తుచేసింది. తొలుత గుజరాతే 9-3తో ఆధిక్యంలో ఉంది. పట్నాను ఆలౌట్ చేసి 15-10తో దూసుకుపోయింది. ఈ స్థితిలో ప్రదీప్ నర్వాల్ అద్భుత రీతిలో ఐదు పాయింట్లు తెచ్చి 15-15తో స్కోర్ సమం చేశాడు. రెండు జట్లు పోటాపోటీగా ఆడటంతో తొలి భాగంలో పట్నా 21-18తో నిలిచింది. రెండవ భాగంలో డిఫెండింగ్ చాంపియన్ మరింత చెలరేగి 29-23 తో ఆధిక్యం కనబరిచింది. అప్పుడు గుజరాత్ కాస్త పుంజుకుంది. పట్నా ఆధిక్యాన్ని 26-30కి తగ్గించింది. ఐతే మోను గోయత్ కూతకెళ్లి పాయింట్లు తేవడంతో మళ్లీ ఒత్తిడిలో పడిపోయింది. స్కోరు 34- 40తో ఉండగా పట్నా మళ్లీ దెబ్బకొట్టింది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న డిఫెండర్లు ప్రత్యర్థి రైడర్లను పట్టేయడంలో పొరపాట్లు చేశారు. ప్రదీప్ మరోసారి వరుస సూపర్రైడ్లు చేయడంతో పట్నా 50-36తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. చివరికి 55- 38తో విజయం సాధించి హ్యాట్రిక్ విజేతగా ఆవిర్భవించింది. పట్నాలో విజయ్ 7, జైదీప్ 5 పాయింట్లు సాధించారు. గుజరాత్లో సచిన్ 11, మహేంద్ర రాజ్‌పుత్ 5, చంద్రన్ రంజిత్ 4 పాయింట్లు సాధించారు. -
హ్యాట్రిక్‌పై కన్నేసిన పైరేట్స్
చెన్నై: డబుల్ చాంపియన్ పట్నా పైరేట్స్ ‘హ్యాట్రిక్’పై కన్నేసింది. ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్లో శనివారం జరిగే ఫైనల్లో కొత్త జట్టు గుజరాత్‌పై గెలిచి ముచ్చటగా మూడో టైటిల్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఈ ఏడాదే బరిలోకి దిగినప్పటికీ గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకుంది. అరంగేట్రంలోనే ఫైనల్ చేరిన గుజరాత్ ఇప్పుడు ఏకంగా టైటిల్‌తో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌ను ముగించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇక పట్నా బలమంతా కెప్టెన్ ప్రదీప్ నర్వాలే. సూపర్ రైడ్లతో మ్యాచ్‌లనే మలుపు తిప్పుతున్న ఈ రైడర్ తన ‘సూపర్’ ప్రదర్శనను ఫైనల్లోనూ కొనసాగించాలని భావిస్తున్నాడు. మొత్తానికి మేటి జట్లే ఫైనల్ చేరడంతో పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. రాత్రి 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
పట్నా ఫైనల్‌కు...
చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ మళ్లీ ఫైనల్ కూతకు సిద్ధమైంది. టైటిల్ నిలబెట్టుకునేందుకు శనివారం గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో అమీతుమీకి సై అంటోంది. గురువారం జరిగిన రెండో క్వాలిఫయర్‌లో కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ ప్రతాపంతో బెంగాల్ వారియర్స్‌ను కంగుతింది. రెండు సార్లు చాంపియన్ అయిన పట్నా ఈ మ్యాచ్‌లో 47–44 స్కోరుతో బెంగాల్ వారియర్స్‌పై విజయం సాధించింది. చివర్లో నాటకీయ పరిణామాలు పైరేట్స్ శిబిరాన్ని కలవరపెట్టినా... చివరకు విజయం మాత్రం పట్నానే వరించింది. మ్యాచ్ ముగిసేందుకు ఇంకా ఐదు నిమిషాలే మిగిలున్న దశలో పట్నా 41–27తో విజయబావుటాకు సిద్ధమైపోయింది. కానీ చివరి క్షణాల్లో వారియర్స్ ఆటగాళ్లు అనూహ్యంగా పోరాడారు. ఇటు రైడింగ్‌లో... అటు టాకిల్‌లో వరుసబెట్టి పాయింట్లు సాధించారు. చూస్తుండగానే 46–43తో బెంగాల్ రేసులోకి వచ్చింది. ఇక 60 సెకన్ల ఆటే మిగిలింది. ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పట్నా తెలివైన గేమ్ ప్లాన్‌తో ప్రత్యర్థి రైడర్‌కు ఒకరినే సమర్పించుకుంది. తద్వారా ఒక పాయింట్‌నే కోల్పో యింది. చివరి క్షణాల్లో ప్రదీప్ రైడింగ్‌కు వెళ్లి టైమ్‌పాస్ చేసి ఓ పాయింట్ తెచ్చాడు. అంతే మ్యాచ్ ముగిసింది. పైరేట్స్ ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ విజయ సారథి ప్రదీప్ 23 పాయిం ట్లు సాధించాడు. విజయ్, మోనూ గోయట్ చెరో 4 పాయింట్లు చేశారు. బెంగాల్ వారియర్స్ తరఫున మణిందర్ సింగ్ 17, దీపక్ నర్వాల్ 10, రాణ్ సింగ్ 5 పాయింట్లు చేశారు. -
ఢిల్లీకి పట్నా పంచ్
ప్రొ కబడ్డీ లీగ్ న్యూఢిల్లీ: చివరి క్షణాల వరకు సమాన పాయింట్లతో ఉన్న దశలో పట్నా పైరేట్స్ అద్భుతం చేసింది. మ్యాచ్ చివరి రైడ్‌కు వెళ్లిన దబాంగ్ ఢిల్లీ స్టార్ ఆటగాడు కాశిలింగ్ అడిగేను పట్టేసిన పట్నా 32-31 తేడాతో నెగ్గింది. ఢిల్లీ తరఫున కాశిలింగ్ 9, మెరాజ్ షేక్ 8 రైడింగ్ పాయింట్లు సాధించారు. పట్నాకు పర్దీప్ నర్వాల్ 9 పాయింట్లు అందించాడు. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్ ప్రారంభం నుంచే హోరాహోరీగా సాగింది. సొంత గడ్డపై మెరుగ్గా రాణిస్తోన్న ఢిల్లీ ఆటగాళ్లు పట్నానూ వణికించారు. దీంతో ప్రథమార్ధం 16-14 ఆధిక్యంతో ముగించారు. ఆ తర్వాత రెండు జట్ల మధ్య ఒకటి రెండు పాయింట్ల తేడాతో ఆధిక్యం మారుతూ వచ్చింది. ఇది చివరి సెకన్ వరకు కొనసాగినా ఢిల్లీని ఆఖర్లో పట్నా దెబ్బతీసింది. ఫైనల్లో ఫైర్ బర్డ్స్ మహిళల కబడ్డీ చాలెంజ్‌లో ఫైర్ బర్డ్స్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం ఐస్ డివాతో జరిగిన మ్యాచ్‌లో 22-13 తేడాతో నెగ్గింది. ఆరంభంలో గట్టిపోటీనిచ్చిన ఐస్ డివాస్ చివర్లో ఒత్తిడికి లోనయ్యింది. ఇక ఈనెల 31న హైదరాబాద్‌లో జరిగే ఫైనల్లో స్టార్మ్ క్వీన్‌తో ఫైర్ బర్డ్స్ తలపడుతుంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు పట్నా పైరేట్స్ X తెలుగు టైటాన్స్ రాత్రి 8 గంటల నుంచి దబాంగ్ ఢిల్లీ కేసీ X పుణెరి పల్టన్ రాత్రి 9 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం