ఢిల్లీకి పట్నా పంచ్
ప్రొ కబడ్డీ లీగ్
న్యూఢిల్లీ: చివరి క్షణాల వరకు సమాన పాయింట్లతో ఉన్న దశలో పట్నా పైరేట్స్ అద్భుతం చేసింది. మ్యాచ్ చివరి రైడ్‌కు వెళ్లిన దబాంగ్ ఢిల్లీ స్టార్ ఆటగాడు కాశిలింగ్ అడిగేను పట్టేసిన పట్నా 32-31 తేడాతో నెగ్గింది. ఢిల్లీ తరఫున కాశిలింగ్ 9, మెరాజ్ షేక్ 8 రైడింగ్ పాయింట్లు సాధించారు. పట్నాకు పర్దీప్ నర్వాల్ 9 పాయింట్లు అందించాడు. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్ ప్రారంభం నుంచే హోరాహోరీగా సాగింది. సొంత గడ్డపై మెరుగ్గా రాణిస్తోన్న ఢిల్లీ ఆటగాళ్లు పట్నానూ వణికించారు. దీంతో ప్రథమార్ధం 16-14 ఆధిక్యంతో ముగించారు.
ఆ తర్వాత రెండు జట్ల మధ్య ఒకటి రెండు పాయింట్ల తేడాతో ఆధిక్యం మారుతూ వచ్చింది. ఇది చివరి సెకన్ వరకు కొనసాగినా ఢిల్లీని ఆఖర్లో పట్నా దెబ్బతీసింది.
ఫైనల్లో ఫైర్ బర్డ్స్
మహిళల కబడ్డీ చాలెంజ్‌లో ఫైర్ బర్డ్స్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం ఐస్ డివాతో జరిగిన మ్యాచ్‌లో 22-13 తేడాతో నెగ్గింది. ఆరంభంలో గట్టిపోటీనిచ్చిన ఐస్ డివాస్ చివర్లో ఒత్తిడికి లోనయ్యింది. ఇక ఈనెల 31న హైదరాబాద్‌లో జరిగే ఫైనల్లో స్టార్మ్ క్వీన్‌తో ఫైర్ బర్డ్స్ తలపడుతుంది.
ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు
పట్నా పైరేట్స్ X తెలుగు టైటాన్స్
రాత్రి 8 గంటల నుంచి
దబాంగ్ ఢిల్లీ కేసీ X పుణెరి పల్టన్
రాత్రి 9 గంటల నుంచి
స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం