41–37తో గెలిచిన ఢిల్లీ
ప్రొ కబడ్డీ లీగ్
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌ను విజయంతో మొదలుపెట్టిన తెలుగు టైటాన్స్ తర్వాత వరుసగా ఓడిపోతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 37–41 స్కోరు తేడాతో దబంగ్ ఢిల్లీ చేతిలో కంగుతింది. తెలుగు టైటాన్స్‌కు వరుసగా ఇది మూడో ఓటమి. కెప్టెన్ పవన్ సెహ్రావత్ జట్టును గెలిపించేందుకు చక్కని పోరాటమే చేశాడు. 17 సార్లు కూతకెళ్లిన పవన్ 12 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చిపెట్టాడు.
6 బోనస్ పాయింట్లు సహా మొత్తం 18 పాయింట్లు సాధించాడు. మరో రెయిడర్ ఆశిష్ నర్వాల్ (9) కూడా రాణించాడు. మిగతా వారిలో ఆల్‌రౌండర్ విజయ్ మాలిక్ 3, డిఫెండర్ సాగర్ 2 పాయింట్లు తెచ్చారు. అయితే ప్రత్యర్థి దబంగ్ ఢిల్లీ జట్టు తరఫున రెయిడర్లు కెపె్టన్ నవీన్ కుమార్, అశు మాలిక్ చెలరేగారు. ఇద్దరు చెరో 15 పాయింట్లతో జట్టు విజయానికి బాట వేశారు.
వీళ్లిద్దరు క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టడంతో తెలుగు టైటాన్స్ ఆఖరిదాకా పోరాడిన ఫలితం లేకపోయింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లాడిన టైటాన్స్ ఒక్క మ్యాచ్‌లో గెలిచి మూడింట ఓడింది. మూడు మ్యాచ్‌లాడిన ఢిల్లీ రెండో విజయం సాధించింది. ఆదివారం జరిగే పోటీల్లో జైపూర్ పింక్‌పాంథర్స్‌తో తమిళ్ తలైవాస్ పోటీపడుతుంది. యూపీ యోధాస్‌ను గుజరాత్ జెయింట్స్ ఢీకొంటుంది.
బెంగాల్, యూ ముంబా మ్యాచ్ టై
అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో యూ ముంబా, బెంగాల్ వారియర్స్ హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో ఈ మ్యాచ్ 31–31 స్కోరు వద్ద టై అయ్యింది. వారియర్స్ జట్టులో రెయిడర్ మణిందర్ సింగ్ (8 పాయింట్లు), డిఫెండర్ మయూర్ కదం (6) అదరగొట్టారు.
ఒకరు కూతకెల్లి పాయింట్లు తెస్తుంటే మరొకరు ప్రత్యర్థి రెయిడర్లను టాకిల్ చేసి పాయింట్లు సాధించారు. మిగిలిన వారిలో నితీశ్ కుమార్ (4), సుశీల్ కాంబ్రేకర్ (3), నితిన్ ధన్కర్ (3), కెప్టెన్ ఫజల్ అత్రాచలి (3) మెరుగ్గా ఆడారు. యూ ముంబా జట్టులో రెయిడర్ మన్‌జీత్ (7 పాయింట్లు) ఆకట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment