ఉత్కంఠ పోరు 38–38తో ‘టై’
ప్రొ కబడ్డీ లీగ్
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో హోరాహోరీ సమరాలు కొనసాగుతున్నాయి. మంగళవారం దబంగ్ ఢిల్లీ–పుణేరి పల్టన్ మధ్య జరిగిన పోరు 38–38 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. దబంగ్ ఢిల్లీ తరఫున అషు మాలిక్ 17 పాయింట్లతో సత్తాచాటగా... మోహిత్ దేశ్వాల్ (6 పాయింట్లు) అతడికి సహకరించాడు.
ఇతర ఆటగాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... తన సూపర్ రెయిడ్‌లతో అషు పాయింట్లు సాధించడంతో ఢిల్లీ జట్టు పోటీలో నిలిచింది. మరోవైపు పల్టన్ తరఫున ఆకాశ్ షిండే (8 పాయింట్లు), మోహిత్ గోయత్ (6 పాయింట్లు), అమన్ (6 పాయింట్లు) రాణించారు. ఓవరాల్‌గా దబంగ్ ఢిల్లీ మ్యాచ్‌లో 24 రెయిడ్ పాయింట్లు సాధిస్తే... పుణేరి పల్టన్ 18 పాయింట్లకే పరిమితమైంది.
ట్యాకిలింగ్‌లో ఢిల్లీ 9 పాయింట్లు సాధిస్తే... పల్టన్ 13 పాయింట్లతో సత్తాచాటింది. ఇరు జట్లు రెండేసి సార్లు ఆలౌట్ కాగా... దంబగ్ ఢిల్లీ జట్టుకు ఒక సూపర్ రెయిడ్ పాయింట్ దక్కింది. ఈ ఫలితంతో తాజా సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన పుణేరి పల్టన్ 5 విజయలు, 2 పరాజయాలు, 2 ‘టై’లతో 33 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’ప్లేస్‌లో కొనసాగుతోంది. 10 మ్యాచ్‌లాడిన దబంగ్ ఢిల్లీ 4 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 27 పాయింట్లు సాధించి పట్టిక ఐదో స్థానంలో ఉంది.
అర్జున్ అదరహో..
పీకేఎల్‌లో భాగంగా మంగళవారమే జరిగిన మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ ఘనవిజయం సాధించింది. షహీద్ విజయ్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన పోరులో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు 39–32 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్‌వాల్ 19 పాయింట్లతో దుమ్మురేపాడు. రెండుసార్లు పీకేఎల్ టైటిల్ సాధించిన జైపూర్ జట్టను అర్జున్ ఒంటి చేత్తో విజయం సాధించి పెట్టాడు.
రెయిండింగ్‌లో అర్జున్ దూకుడు కనబరిస్తే... డిఫెన్స్‌లో లక్కీ శర్మ 6 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ప్రదీప్ నర్వాల్ గైర్హాజరీలో బరిలోకి దిగిన బెంగళూరు బుల్స్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రధాన ఆటగాడు దూరం కావడంతో... ఆ జట్టు పింక్ పాంథర్స్‌కు పోటీనివ్వలేకపోయింది. అజింక్యా పవార్ (9 పాయింట్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 21 రెయిడ్ పాయింట్లు సాధిస్తే... పింక్ పాంథర్స్ 19 పాయింట్లు సాధించింది.
ట్యాకిలింగ్‌లో బుల్స్ 8 పాయింట్లకు పరిమితం కాగా... జైపూర్ 14 పాయింట్లతో సత్తాచాటింది. జైపూర్ పింక్ పాంథర్స్‌కు 8 మ్యాచ్‌ల్లో ఇది నాలుగో విజయం కాగా... 3 పరాజయాలు, ఒక ‘టై’తో 25 పాయింట్లు సాధించి పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఆడిన తమ్మిది మ్యాచ్‌ల్లో ఏడో పరాజయం మూటగట్టుకున్న బెంగళూరు బుల్స్ పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment