ఇప్పటి వరకు ప్రొ కబడ్డీ లీగ్‌లు ఐదు జరిగాయి. ఇందులో ఏకంగా మూడు టైటిళ్లను పట్నా పైరేట్సే గెలుచుకుంది. అది కూడా వరుసగా! ఇకపై పీకేఎల్ అంటేనే పైరేట్స్ దోపిడి గుర్తొస్తుందేమో! ‘హ్యాట్రిక్’తో ఈ లీగ్ ఫేవరేట్‌గా మారిపోయింది పట్నా. కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ జట్టును అన్నీ తానై నడిపించాడు. మళ్లీ జట్టును గెలిపించాడు.
చెన్నై: రైడింగ్‌లో ప్రదీప్ నర్వాల్ మెరిస్తే... టైటిల్స్‌లో పట్నా పైరేట్స్ గర్జించింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఐదో సీజన్‌లోనూ గెలిచిన పైరేట్స్ ‘హ్యాట్రిక్’ ధమాకా సృష్టించింది. రెండేళ్ల వ్యవధిలోనే పట్నా సాధించిన మూడో టైటిల్ ఇది. గతేడాది రెండు ఈవెంట్లు జరిగాయి. ఆ రెండు సార్లు పట్నానే గెలిచింది. శనివారం ఇక్కడి జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులో పట్నా పైరేట్స్ 55–38 స్కోరుతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌పై జయభేరి మోగించింది. అరంగేట్రం చేసిన సీజన్‌లోనే టైటిల్ నెగ్గాలనుకున్న గుజరాత్ ఆశలపై పైరేట్స్ ఆటగాళ్లు నీళ్లు చల్లారు.
ప్రదీప్ కూత... పట్నా కేక...
మ్యాచ్ జరుగుతున్న కొద్దీ అత్యంత ప్రమాదకారిగా మారే ప్రదీప్ ఫైనల్లోనూ సరిగ్గా అదే పని చేశాడు. పట్నా 45... గుజరాత్ 36. మ్యాచ్ ఇంకా 4 నిమిషాల్లో ముగియనుంది. పైరేట్స్‌ది ఆధిక్యమే కానీ ఆలౌట్‌కు చేరువైంది. కోర్టులో ప్రదీప్‌కు జతగా ఒక్కరే మిగిలారు. వీళ్లిద్దరిని గుజరాత్ ఔట్ చేస్తే ఆలౌట్ పాయింట్లతో స్కోరు 40కి చేరుతుంది. కానీ ప్రదీప్ ఈ కీలక సమయంలో రైడింగ్‌లో జూలు విదిల్చాడు. రెండు పాయింట్లు తెచ్చాడు. అక్కడి నుంచి ఆలౌట్ రూటు గుజరాత్‌కు మారింది. ఆధిక్యం అంతకంతకూ పెంచుకున్న పట్నా దుర్భేద్యమైన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రదీప్ 19, మోను గోయట్ 9, విజయ్ 7 పాయింట్లు చేయగా... గుజరాత్ తరఫున సచిన్ 11, మహేంద్ర 5, చంద్రన్ 4 పాయింట్లు సాధించారు. మొత్తానికి మూడు నెలలపాటు జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ పట్నా పైరేట్స్ ముచ్చటైన విజయంతో ముగిసింది.
ప్రదీప్... ప్రదీప్...
అవార్డులు, క్యాష్ రివార్డులు అన్నీ స్టార్ రైడర్ ప్రదీప్ చేతికే చిక్కాయి. బహుమతులిచ్చే వారే మారారు కానీ అతను మాత్రం మారలేదు. పర్‌ఫెక్ట్ రైడర్ (రూ. 50 వేలు) మొదలు... బెస్ట్ డూ ఆర్ డై రైడర్ (రూ.50వేలు), స్టార్ స్పోర్ట్స్ మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ (రూ. 50 వేలు), ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ (రూ. 50 వేలు), లీగ్ టాప్ స్కోరర్ (రూ.10 లక్షలు), రైడర్ ఆఫ్ ద టోర్నీ (రూ. 10 లక్షలు), మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (రూ. 15 లక్షలు) అవార్డులు ప్రదీప్ నర్వాల్‌ను ముంచెత్తాయి. వీటితో పాటు రెండు ‘టీవీఎస్’ జూపిటర్ స్కూటర్లనూ గెలుచుకున్నాడు. ఉత్తమ అరంగేట్ర ఆటగాడు అవార్డు సచిన్ (గుజరాత్; రూ. 10 లక్షలు)కు, డిఫెండర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు సురేందర్ నాడా (హరియాణా; రూ. 10 లక్షలు)కు లభించాయి.
ఎవరికి ఎంతంటే...
►విజేత పట్నాకు రూ. 3 కోట్లు
►రన్నరప్ గుజరాత్‌కు రూ. 1.80 కోట్లు
►అత్యంత విలువైన ఆటగాడు ప్రదీప్‌కు రూ. 15 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment