Gujarat Lions
-
పట్నా పైరేట్స్కే పట్టం
ఇప్పటి వరకు ప్రొ కబడ్డీ లీగ్‌లు ఐదు జరిగాయి. ఇందులో ఏకంగా మూడు టైటిళ్లను పట్నా పైరేట్సే గెలుచుకుంది. అది కూడా వరుసగా! ఇకపై పీకేఎల్ అంటేనే పైరేట్స్ దోపిడి గుర్తొస్తుందేమో! ‘హ్యాట్రిక్’తో ఈ లీగ్ ఫేవరేట్‌గా మారిపోయింది పట్నా. కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ జట్టును అన్నీ తానై నడిపించాడు. మళ్లీ జట్టును గెలిపించాడు. చెన్నై: రైడింగ్‌లో ప్రదీప్ నర్వాల్ మెరిస్తే... టైటిల్స్‌లో పట్నా పైరేట్స్ గర్జించింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఐదో సీజన్లోనూ గెలిచిన పైరేట్స్ ‘హ్యాట్రిక్’ ధమాకా సృష్టించింది. రెండేళ్ల వ్యవధిలోనే పట్నా సాధించిన మూడో టైటిల్ ఇది. గతేడాది రెండు ఈవెంట్లు జరిగాయి. ఆ రెండు సార్లు పట్నానే గెలిచింది. శనివారం ఇక్కడి జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులో పట్నా పైరేట్స్ 55–38 స్కోరుతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌పై జయభేరి మోగించింది. అరంగేట్రం చేసిన సీజన్లోనే టైటిల్ నెగ్గాలనుకున్న గుజరాత్ ఆశలపై పైరేట్స్ ఆటగాళ్లు నీళ్లు చల్లారు. ప్రదీప్ కూత... పట్నా కేక... మ్యాచ్ జరుగుతున్న కొద్దీ అత్యంత ప్రమాదకారిగా మారే ప్రదీప్ ఫైనల్లోనూ సరిగ్గా అదే పని చేశాడు. పట్నా 45... గుజరాత్ 36. మ్యాచ్ ఇంకా 4 నిమిషాల్లో ముగియనుంది. పైరేట్స్ది ఆధిక్యమే కానీ ఆలౌట్‌కు చేరువైంది. కోర్టులో ప్రదీప్‌కు జతగా ఒక్కరే మిగిలారు. వీళ్లిద్దరిని గుజరాత్ ఔట్ చేస్తే ఆలౌట్ పాయింట్లతో స్కోరు 40కి చేరుతుంది. కానీ ప్రదీప్ ఈ కీలక సమయంలో రైడింగ్‌లో జూలు విదిల్చాడు. రెండు పాయింట్లు తెచ్చాడు. అక్కడి నుంచి ఆలౌట్ రూటు గుజరాత్‌కు మారింది. ఆధిక్యం అంతకంతకూ పెంచుకున్న పట్నా దుర్భేద్యమైన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రదీప్ 19, మోను గోయట్ 9, విజయ్ 7 పాయింట్లు చేయగా... గుజరాత్ తరఫున సచిన్ 11, మహేంద్ర 5, చంద్రన్ 4 పాయింట్లు సాధించారు. మొత్తానికి మూడు నెలలపాటు జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ పట్నా పైరేట్స్ ముచ్చటైన విజయంతో ముగిసింది. ప్రదీప్... ప్రదీప్... అవార్డులు, క్యాష్ రివార్డులు అన్నీ స్టార్ రైడర్ ప్రదీప్ చేతికే చిక్కాయి. బహుమతులిచ్చే వారే మారారు కానీ అతను మాత్రం మారలేదు. పర్ఫెక్ట్ రైడర్ (రూ. 50 వేలు) మొదలు... బెస్ట్ డూ ఆర్ డై రైడర్ (రూ.50వేలు), స్టార్ స్పోర్ట్స్ మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ (రూ. 50 వేలు), ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ (రూ. 50 వేలు), లీగ్ టాప్ స్కోరర్ (రూ.10 లక్షలు), రైడర్ ఆఫ్ ద టోర్నీ (రూ. 10 లక్షలు), మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (రూ. 15 లక్షలు) అవార్డులు ప్రదీప్ నర్వాల్‌ను ముంచెత్తాయి. వీటితో పాటు రెండు ‘టీవీఎస్’ జూపిటర్ స్కూటర్లనూ గెలుచుకున్నాడు. ఉత్తమ అరంగేట్ర ఆటగాడు అవార్డు సచిన్ (గుజరాత్; రూ. 10 లక్షలు)కు, డిఫెండర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు సురేందర్ నాడా (హరియాణా; రూ. 10 లక్షలు)కు లభించాయి. ఎవరికి ఎంతంటే... ►విజేత పట్నాకు రూ. 3 కోట్లు ►రన్నరప్ గుజరాత్‌కు రూ. 1.80 కోట్లు ►అత్యంత విలువైన ఆటగాడు ప్రదీప్‌కు రూ. 15 లక్షలు -
హ్యాట్రిక్‌పై కన్నేసిన పైరేట్స్
చెన్నై: డబుల్ చాంపియన్ పట్నా పైరేట్స్ ‘హ్యాట్రిక్’పై కన్నేసింది. ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్లో శనివారం జరిగే ఫైనల్లో కొత్త జట్టు గుజరాత్‌పై గెలిచి ముచ్చటగా మూడో టైటిల్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఈ ఏడాదే బరిలోకి దిగినప్పటికీ గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకుంది. అరంగేట్రంలోనే ఫైనల్ చేరిన గుజరాత్ ఇప్పుడు ఏకంగా టైటిల్‌తో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌ను ముగించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇక పట్నా బలమంతా కెప్టెన్ ప్రదీప్ నర్వాలే. సూపర్ రైడ్లతో మ్యాచ్‌లనే మలుపు తిప్పుతున్న ఈ రైడర్ తన ‘సూపర్’ ప్రదర్శనను ఫైనల్లోనూ కొనసాగించాలని భావిస్తున్నాడు. మొత్తానికి మేటి జట్లే ఫైనల్ చేరడంతో పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. రాత్రి 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
పట్నా ఫైనల్‌కు...
చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ మళ్లీ ఫైనల్ కూతకు సిద్ధమైంది. టైటిల్ నిలబెట్టుకునేందుకు శనివారం గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో అమీతుమీకి సై అంటోంది. గురువారం జరిగిన రెండో క్వాలిఫయర్‌లో కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ ప్రతాపంతో బెంగాల్ వారియర్స్‌ను కంగుతింది. రెండు సార్లు చాంపియన్ అయిన పట్నా ఈ మ్యాచ్‌లో 47–44 స్కోరుతో బెంగాల్ వారియర్స్‌పై విజయం సాధించింది. చివర్లో నాటకీయ పరిణామాలు పైరేట్స్ శిబిరాన్ని కలవరపెట్టినా... చివరకు విజయం మాత్రం పట్నానే వరించింది. మ్యాచ్ ముగిసేందుకు ఇంకా ఐదు నిమిషాలే మిగిలున్న దశలో పట్నా 41–27తో విజయబావుటాకు సిద్ధమైపోయింది. కానీ చివరి క్షణాల్లో వారియర్స్ ఆటగాళ్లు అనూహ్యంగా పోరాడారు. ఇటు రైడింగ్‌లో... అటు టాకిల్‌లో వరుసబెట్టి పాయింట్లు సాధించారు. చూస్తుండగానే 46–43తో బెంగాల్ రేసులోకి వచ్చింది. ఇక 60 సెకన్ల ఆటే మిగిలింది. ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పట్నా తెలివైన గేమ్ ప్లాన్‌తో ప్రత్యర్థి రైడర్‌కు ఒకరినే సమర్పించుకుంది. తద్వారా ఒక పాయింట్‌నే కోల్పో యింది. చివరి క్షణాల్లో ప్రదీప్ రైడింగ్‌కు వెళ్లి టైమ్‌పాస్ చేసి ఓ పాయింట్ తెచ్చాడు. అంతే మ్యాచ్ ముగిసింది. పైరేట్స్ ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ విజయ సారథి ప్రదీప్ 23 పాయిం ట్లు సాధించాడు. విజయ్, మోనూ గోయట్ చెరో 4 పాయింట్లు చేశారు. బెంగాల్ వారియర్స్ తరఫున మణిందర్ సింగ్ 17, దీపక్ నర్వాల్ 10, రాణ్ సింగ్ 5 పాయింట్లు చేశారు. -
ఐపీఎల్లో మళ్లీ మ్యాచ్ ఫిక్సింగ్?
► ఇద్దరు గుజరాత్ ఆటగాళ్ల పాత్ర ? ► ముగ్గురిని అరెస్టు చేసిన కాన్పూర్ పోలీసులు ► రూ.41 లక్షలు స్వాధీనం న్యూఢిల్లీ: ఐపీఎల్ దేశంలో అత్యంత ఆదరణ ఉన్న ఆట. ప్రపంచ దేశాల ఆటగాళ్లు ఒకచొట చేరి ఆడే ఆట. ఇది ప్రపంచంలో క్రికెట్ ప్రేమికులకు అసలైన వినోదాన్ని అందిస్తనటంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ ఐపీల్‌కు ఓ మచ్చ ఉంది. అది మ్యాచ్ ఫిక్సింగ్. 2013లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఆటగాళ్లు ఆరోపణలు ఎదర్కున్న సంగతి తెలిసిందే. దీంతో రెండు జట్లు ఐపీఎల్ నుంచి తప్పించారు. అయితే తాజాగా మరో ఫిక్సింగ్ ఉదంతం వెలుగుచూసింది. ఐపీఎల్‌పై ఫిక్సింగ్ , చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఫిక్సింగ్ ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులను కాన్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు గుజరాత్ లయన్స్ ఆటగాళ్ల పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి బీసీసీఐ, ఐపీఎల్ అవినీతి నిరోధక శాఖకు గురువారం సమాచారం అందించిన సమాచారంతో రమేష్ నయన్ షా, రమేష్ కుమార్, వికాష్ కుమార్ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. ఉత్తర ప్రదేశ్ క్రైం బ్రాంచ్ పోలీసుల సహకారంతో ఐపీఎల్ అవినీతి నిరోధక శాఖ వీరిని అరెస్టు చేసింది. వీరి వద్ద పోలీసులు నుంచి రూ.41 నగదు స్వాధీనం చేసుకున్నారు. రమేష్‌కుమార్ గ్రీన్ పార్క్ స్టేడియంలో హోర్డింగుల కాంట్రాక్టర్. ఇతడు క్రికెట్ బెట్టింగులు పెట్టే అజ్మీర్‌కు చెందిన బంటి పేరుమీద గుజరాత్, ఢిల్లీ ఆటగాళ్లు ఉండే హోటల్లో రూమ్ బుక్ చేసుకొని ఆటగాళ్లతో కలిసినట్లు పోలీసులు భావిస్తునారు. ప్రస్తుతం బంటి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ ఇద్దరు గుజరాత్ ఆటగాళ్ల మీద నిఘా ఉందని, వారితో రమేష్ నయన్ షా తరచుగా వారితో కాంటాక్టులో ఉన్నట్లు భావిస్తున్నామని తెలిపారు. అయితే ఇంకా ఇది నిర్ధారణ కాలేదన్నారు. -
ఐపీఎల్ 9 నుంచి ముంబై నిష్క్రమణ
► ప్లేఆఫ్‌కు గుజరాత్ ► డ్వేన్ స్మిత్ ఆల్‌రౌండ్ షో ► సురేశ్ రైనా మెరుపులు ఆఖరి మ్యాచ్‌కు ముందు చేతిలో 16 పాయింట్లు ఉన్నా గెలవకపోతే ఇంటికెళ్లే ప్రమాదంతో ఉన్న గుజరాత్ లయన్స్ జట్టు కీలక మ్యాచ్‌లో చెలరేగిపోయింది. డ్వేన్ స్మిత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన... రైనా, మెకల్లమ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ప్లేఆఫ్‌కు చేరడంతో పాటు టాప్-2లో స్థానాన్ని ఖరారు చేసుకుంది. అటు డిఫెండింగ్ చాంపియన్ ముంబై చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో ఇంటిముఖం పట్టింది. ఇక ఏదైనా అత్యద్భుతం జరిగితే తప్ప రోహిత్ సేనకు ప్లేఆఫ్ అవకాశం లేదు. కాన్పూర్: సురేశ్ రైనా (36 బంతుల్లో 58; 8 ఫోర్లు; 2 సిక్సర్లు), మెకల్లమ్ (27 బంతుల్లో 48; 8 ఫోర్లు; 1 సిక్స్), డ్వేన్ స్మిత్ (23 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) దుమ్ము రేపే ఆటతీరుతో చెలరేగడంతో గుజరాత్ లయన్స్ ప్లే ఆఫ్‌కు చేరింది. శనివారం గ్రీన్‌పార్క్‌లో జరిగిన మ్యాచ్‌లో లయన్స్ 6 వికెట్ల తేడాతోముంబై ఇండియన్స్‌పై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 172 పరుగులు చేసింది. నితీష్ రాణా (36 బంతుల్లో 70; 7 ఫోర్లు; 4 సిక్సర్లు) ఒక్కడే పోరాడాడు. బట్లర్ (31 బంతుల్లో 33; 3 ఫోర్లు), రోహిత్ (17 బంతుల్లో 30; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రవీణ్, ధావల్, స్మిత్, బ్రేవోలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసి నెగ్గింది. జడేజా (15 బంతుల్లో 21 నాటౌట్; 4 ఫోర్లు) రాణించాడు. వినయ్‌కు రెండు వికెట్లు దక్కాయి. రాణా జోరు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రోహిత్ ధాటిగా ఆరంభించాడు. వేగంగా పరుగులు తీసే క్రమంలో ధావల్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్స్ బాదిన అనంతరం క్యాచ్ అవుటయ్యాడు. మరసటి ఓవర్లోనే గప్టిల్ (7), కృనాల్ (4)ను డ్వేన్ స్మిత్ పెవిలియన్‌కు పంపి ముంబైని గట్టి దెబ్బే తీశాడు. ఈ దశలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన నితీష్ రాణా ముంబైకి ఆపద్భాందవుడయ్యాడు. బట్లర్‌తో కలిసి కొద్దిసేపు నిదానంగానే ఆడినా అనంతరం ఇరువురూ విజృంభించారు. 11వ ఓవర్లో రాణా ఓ సిక్స్, ఫోర్‌తో వేగం పెంచాడు. తర్వాతి ఓవర్లోనూ 4,6తో జట్టును వంద పరుగులు దాటించాడు. అయితే బ్రేవో అద్భుత రిటర్న్ క్యాచ్‌తో బట్లర్ అవుట్ కావడంతో నాలుగో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయినా దూకుడు తగ్గించని రాణా స్పిన్నర్ జకాతి బౌలింగ్‌లో మూడు ఫోర్లు బాదాడు. ఈక్రమంలో 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మరో 8 బంతుల్లోనే 20 పరుగులు చేసిన తను బ్రేవో బౌలింగ్‌లో డీప్ స్క్వేర్ లెగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్ పూర్తిగా నిరాశపరిచారు. పొలార్డ్ (9) తోపాటు హార్దిక్ (7), హర్భజన్ (3)ను వెంటవెంటనే అవుట్ చేసిన లయన్స్ ముంబైని నిలువరించింది. చివరి నాలుగు ఓవర్లలో 27 పరుగులు మాత్రమే చేసిన ముంబై నాలుగు వికెట్లను కోల్పోయింది. వీరి ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. రైనా, మెకల్లమ్ మెరుపులు: ఓపెనర్‌గా దిగిన ఆరోన్ ఫించ్‌ను రెండో బంతికే వినయ్ కుమార్ ఎల్బీగా పంపడంతో లయన్స్‌కు షాక్ తగిలింది. తొలి రెండు ఓవర్లు ఎనిమిది పరుగులే వచ్చినా ఆ తర్వాత రైనా, మెకల్లమ్ బ్యాట్ ఝళిపించారు. మెక్లీనగర్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రైనా మూడు ఫోర్లు, సిక్స్‌తో 18 పరుగులు రాబట్టగా ఐదో ఓవర్లో మెకల్లమ్ రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో దూకుడు కనబరిచాడు. ఆరో ఓవర్లో 4,6తో జోరు మీదున్న రైనా ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను బుమ్రా అందుకోలేకపోయాడు. ఇదే ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదగా 19 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో లయన్స్ 70/1 స్కోరు చేసింది. అయితే పదో ఓవర్లో జోరు మీదున్న మెకల్లమ్‌ను హర్భజన్ బౌల్డ్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రైనా ఓ ఫోర్‌తో 30 బంతుల్లో వరుసగా రెండో అర్ధ సెంచరీ చేశాడు. అయితే దినేశ్ కార్తీక్ (3) అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలి కాగా ఆ వెంటనే రైనా వికెట్‌ను బుమ్రా తీయడంతో జట్టు ఒత్తిడిలో పడింది. కానీ డ్వేన్ స్మిత్ బౌండరీలతో చెలరేగి పరుగుల వరద పారించాడు. తనకు జడేజా సహకరించడంతో జట్టు ఎలాంటి ఇబ్బంది పడకుండా మ్యాచ్‌ను ముగించింది. స్కోరు వివరాలు: ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) జకాతి (బి) ధావల్ కులకర్ణి 30; గప్టిల్ (సి) బ్రేవో (బి) స్మిత్ 7; రాణా (సి) ధావల్ కులకర్ణి (బి) బ్రేవో 70; కృనాల్ పాండ్య (సి) ఫించ్ (బి) స్మిత్ 4; బట్లర్ (సి అండ్ బి) బ్రేవో 33; పొలార్డ్ (సి) స్మిత్ (బి) ధావల్ కులకర్ణి 9; హార్దిక్ పాండ్య (సి) జడేజా (సి) ప్రవీణ్ కుమార్ 7; హర్భజన్ (సి) రైనా (బి) ప్రవీణ్ కుమార్ 3; వినయ్ కుమార్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1-33, 2-41, 3-45, 4-120, 5-153, 6-160, 7-166, 8-172. బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 4-0-24-2; ధావల్ కులకర్ణి 4-0-41-2; స్మిత్ 4-0-37-2; జకాతి 3-0-30-0; బ్రేవో 4-0-22-2; జడేజా 1-0-15-0. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: ఫించ్ ఎల్బీడబ్ల్యు (బి) వినయ్ 0; మెకల్లమ్ (బి) హర్భజన్ 48; రైనా (సి) బట్లర్ (బి) బుమ్రా 58; దినేశ్ కార్తీక్ (సి) బట్లర్ (బి) వినయ్ 3; స్మిత్ నాటౌట్ 37 జడేజా నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (17.5 ఓవర్లలో 4 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1-0, 2-96, 3-111, 4-122. బౌలింగ్: వినయ్ 3-1-17-2; బుమ్రా 4-0-42-1; మెక్లీనగన్ 3.5-0-38-0; కృనాల్ పాండ్య 2-0-28-0; హర్భజన్ 4-0-36-1; హార్ధిక్ 1-0-10-0. -
కోహ్లి 'శత' క్కొట్టినా...
► బెంగళూరుకు తప్పని ఓటమి ► బౌలింగ్ వైఫల్యంతో మూల్యం ► పరుగుల వేటలో లయన్స్‌కు నాలుగో విజయం బౌలర్ల సహకారం లేకపోవడంతో... భారీస్కోర్లు చేస్తున్నా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును మూడోసారి పరాజయం పలుకరించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి తొలిసారి టి20లో సెంచరీ సాధించినా బౌలర్ల వైఫల్యంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. మరోవైపు గుజరాత్ లయన్స్ ఛేదనలో గర్జిస్తోంది. బెంగళూరు తమ ముందుంచిన కొండంత లక్ష్యాన్ని అలవోకగా అధిగమించింది. లయన్స్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌ల్ని ఛేదించే గెలిచింది. ఒక్క మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసి ఓడింది. రాజ్‌కోట్: ఈ ఐపీఎల్ సీజన్లో బౌలింగ్ సమస్య బెంగళూరు జట్టు కొంపముంచుతోంది. విరాట్ కోహ్లి మెరుపు శతకంతో భారీస్కోరు చేసినా ఆ జట్టును ఓటమి వీడలేదు. ఈ సీజన్లోనే కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్ లయన్స్ విజయాలతో దూసుకెళ్తోంది. బ్యాట్స్‌మెన్ సమష్టి కృషితో రాణించడంతో భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఆదివారం సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌పై జయభేరి మోగించింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్లకు 180 పరుగులు చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి (63 బంతుల్లో 100 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. లోకేశ్ రాహుల్ (35 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. తర్వాత లయన్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి గెలిచింది. దినేశ్ కార్తీక్ (39 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు), మెకల్లమ్ (24 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. విరాట్ వీరవిహారం... అంతకుముందు టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో విజయవంతమైన ఓపెనర్ కోహ్లి ఈ మ్యాచ్‌లో వాట్సన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే ఈ జోడీ విఫలమైంది. జట్టు స్కోరు 8 పరుగుల వద్ద వాట్సన్ (6) వెనుదిరిగాడు. దీంతో డివిలియర్స్ జతయ్యాడు. ఇద్దరూ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. గత మ్యాచ్‌కు రీప్లేగా సాగుతుందనుకుంటున్న దశలో డివిలియర్స్ (16 బంతుల్లో 20; 2 ఫోర్లు)ను స్పిన్నర్ ప్రవీణ్ తాంబే పెవిలియన్‌కు పంపాడు. దీంతో 51 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. గత మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా విఫలమైన లోకేశ్ సెకండ్ డౌన్లో బ్యాటింగ్‌కు దిగాడు. కెప్టెన్ కోహ్లి కంటే ధాటిగా ఆడి ఇన్నింగ్స్ ఆసాంతం అండగా నిలిచాడు. ఈ క్రమంలో మొదట విరాట్ 40 బంతుల్లో, తర్వాత రాహుల్ 34 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇద్దరు లయన్స్ బౌలర్లకు మరో వికెట్‌కు అవకాశం ఇవ్వలేదు. అజేయమైన మూడో వికెట్‌కు 121 పరుగులు జతచేశారు. బ్రేవో వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కోహ్లి సిక్స్, రెండు ఫోర్లతో కలిపి 15 పరుగులు చేసి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా 193 టి20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి ఈ ఫార్మాట్లో తొలిసారి సెంచరీ సాధించడం విశేషం. ఐపీఎల్-9లో ఇది రెండో సెంచరీ. ఇంతకుముందు ఢిల్లీ బ్యాట్స్‌మన్ డికాక్ బెంగళూరు జట్టుపై సెంచరీ చేశాడు. గెలిపించిన బ్యాట్స్‌మెన్ ఓపెనర్ల శుభారంభం మొదలు... క్రీజ్‌లోకి వచ్చిన ప్రతీ బ్యాట్స్‌మెన్ మెరుగ్గా ఆడటంతో కొండంత లక్ష్యం కూడా లయన్స్ జట్టు ముందు చిన్నబోయింది. మెకల్లమ్, డ్వేన్ స్మిత్ (21 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు వేగంతో ఇన్నింగ్స్ ఆరంభించారు. దీంతో ఓవర్‌కు సగటున 9 పరుగులతో జోరు కొనసాగింది. తొలి వికెట్‌కు ఇద్దరు కలిసి 47 పరుగులు జతచేశారు. ఆరో ఓవర్లో అదే స్కోరు వద్ద స్మిత్, 9వ ఓవర్లలో 87 పరుగుల వద్ద మెకల్లమ్ నిష్ర్కమించినా... బెంగళూరుకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక తర్వాతైన పట్టుబిగిద్దామనుకున్న ఆర్సీబీకి కెప్టెన్ రైనా (24 బంతుల్లో 28; 3 ఫోర్లు), కార్తీక్ ఆ అవకాశాన్నివ్వలేదు. దీంతో కడదాకా చెయ్యాల్సిన రన్‌రేట్‌ను కాపాడుకుంటూ వచ్చిన లయన్స్దే పైచేయి అయ్యింది. బౌలింగ్ వైఫల్యంతో బెంగళూరు మళ్లీ మూల్యం చెల్లించుకుంది. ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ తొలుత బ్యాటింగ్‌కు దిగి 170 కంటే ఎక్కువ స్కోరు చేసిన బెంగళూరుకిది మూడో పరాజయం కావడం గమనార్హం. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి నాటౌట్ 100; వాట్సన్ (సి) జడేజా (బి) ధవళ్ కులకర్ణి 6; డివిలియర్స్ (సి) రైనా (బి) తాంబే 20; రాహుల్ నాటౌట్ 51; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి) 180. వికెట్ల పతనం: 1-8, 2-59. బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 3-0-28-0, కులకర్ణి 4-0-39-1, తాంబే 3-0-24-1, జకాతి 3-0-28-0, జడేజా 3-0-17-0, డ్వేన్ బ్రేవో 4-0-43-0. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) డివిలియర్స్ (బి) రిచర్డ్సన్ 32; మెకల్లమ్ (సి అండ్ బి) షమ్మీ 42; రైనా (సి) అబ్దుల్లా (బి) చాహల్ 28; దినేశ్ కార్తీక్ నాటౌట్ 50; జడేజా (సి) రాహుల్ (బి) వాట్సన్ 12; బ్రేవో నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 182. వికెట్ల పతనం: 1-47, 2-87, 3-140, 4-178. బౌలింగ్: చాహల్ 4-0-33-1, రిచర్డ్సన్ 4-0-53-1, ఇక్బాల్ అబ్దుల్లా 4-0-41-0, వాట్సన్ 3.3-0-31-1, తబ్రేజ్ షమ్సీ 4-0-21-1.