కోహ్లి 'శత' క్కొట్టినా... | Kohli's ton in vain, Gujarat Lions beat RCB by 6 wickets | Sakshi
Sakshi News home page

కోహ్లి 'శత' క్కొట్టినా...

Published Sun, Apr 24 2016 11:29 PM | Last Updated on Tue, Aug 21 2018 2:53 PM

కోహ్లి 'శత' క్కొట్టినా... - Sakshi

కోహ్లి 'శత' క్కొట్టినా...

బెంగళూరుకు తప్పని ఓటమి
బౌలింగ్ వైఫల్యంతో మూల్యం 
పరుగుల వేటలో లయన్స్‌కు నాలుగో విజయం

 
బౌలర్ల సహకారం లేకపోవడంతో... భారీస్కోర్లు చేస్తున్నా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును మూడోసారి పరాజయం పలుకరించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి తొలిసారి టి20లో సెంచరీ సాధించినా బౌలర్ల వైఫల్యంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. మరోవైపు గుజరాత్ లయన్స్ ఛేదనలో గర్జిస్తోంది. బెంగళూరు తమ ముందుంచిన కొండంత లక్ష్యాన్ని అలవోకగా అధిగమించింది. లయన్స్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌ల్ని ఛేదించే గెలిచింది. ఒక్క మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసి ఓడింది.
 

రాజ్‌కోట్: ఈ ఐపీఎల్ సీజన్‌లో బౌలింగ్ సమస్య బెంగళూరు జట్టు కొంపముంచుతోంది. విరాట్ కోహ్లి మెరుపు శతకంతో భారీస్కోరు చేసినా ఆ జట్టును ఓటమి వీడలేదు. ఈ సీజన్‌లోనే కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్ లయన్స్ విజయాలతో దూసుకెళ్తోంది. బ్యాట్స్‌మెన్ సమష్టి కృషితో రాణించడంతో భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఆదివారం సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌పై జయభేరి మోగించింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్లకు 180 పరుగులు చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి (63 బంతుల్లో 100 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. లోకేశ్ రాహుల్ (35 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. తర్వాత లయన్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి గెలిచింది. దినేశ్ కార్తీక్ (39 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు), మెకల్లమ్ (24 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించారు.


 విరాట్ వీరవిహారం...
అంతకుముందు టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో విజయవంతమైన ఓపెనర్ కోహ్లి ఈ మ్యాచ్‌లో వాట్సన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే ఈ జోడీ విఫలమైంది. జట్టు స్కోరు 8 పరుగుల వద్ద వాట్సన్ (6) వెనుదిరిగాడు. దీంతో డివిలియర్స్ జతయ్యాడు. ఇద్దరూ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. గత మ్యాచ్‌కు రీప్లేగా సాగుతుందనుకుంటున్న దశలో డివిలియర్స్ (16 బంతుల్లో 20; 2 ఫోర్లు)ను స్పిన్నర్ ప్రవీణ్ తాంబే పెవిలియన్‌కు పంపాడు. దీంతో 51 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. గత మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా విఫలమైన లోకేశ్ సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగాడు.

కెప్టెన్ కోహ్లి కంటే ధాటిగా ఆడి ఇన్నింగ్స్ ఆసాంతం అండగా నిలిచాడు. ఈ క్రమంలో మొదట విరాట్ 40 బంతుల్లో, తర్వాత రాహుల్ 34 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇద్దరు లయన్స్ బౌలర్లకు మరో వికెట్‌కు అవకాశం ఇవ్వలేదు. అజేయమైన మూడో వికెట్‌కు 121 పరుగులు జతచేశారు. బ్రేవో వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కోహ్లి సిక్స్, రెండు ఫోర్లతో కలిపి 15 పరుగులు చేసి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా 193 టి20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి ఈ ఫార్మాట్‌లో తొలిసారి సెంచరీ సాధించడం విశేషం. ఐపీఎల్-9లో ఇది రెండో సెంచరీ. ఇంతకుముందు ఢిల్లీ బ్యాట్స్‌మన్ డికాక్ బెంగళూరు జట్టుపై సెంచరీ చేశాడు.

 గెలిపించిన బ్యాట్స్‌మెన్
ఓపెనర్ల శుభారంభం మొదలు... క్రీజ్‌లోకి వచ్చిన ప్రతీ బ్యాట్స్‌మెన్ మెరుగ్గా ఆడటంతో కొండంత లక్ష్యం కూడా లయన్స్ జట్టు ముందు చిన్నబోయింది. మెకల్లమ్, డ్వేన్ స్మిత్ (21 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు వేగంతో ఇన్నింగ్స్ ఆరంభించారు. దీంతో ఓవర్‌కు సగటున 9 పరుగులతో జోరు కొనసాగింది. తొలి వికెట్‌కు ఇద్దరు కలిసి 47 పరుగులు జతచేశారు. ఆరో ఓవర్లో అదే స్కోరు వద్ద స్మిత్, 9వ ఓవర్లలో 87 పరుగుల వద్ద మెకల్లమ్ నిష్ర్కమించినా... బెంగళూరుకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇక తర్వాతైన పట్టుబిగిద్దామనుకున్న ఆర్‌సీబీకి కెప్టెన్ రైనా (24 బంతుల్లో 28; 3 ఫోర్లు), కార్తీక్ ఆ అవకాశాన్నివ్వలేదు. దీంతో కడదాకా చెయ్యాల్సిన రన్‌రేట్‌ను కాపాడుకుంటూ వచ్చిన లయన్స్‌దే పైచేయి అయ్యింది. బౌలింగ్ వైఫల్యంతో బెంగళూరు మళ్లీ మూల్యం చెల్లించుకుంది. ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ తొలుత బ్యాటింగ్‌కు దిగి 170 కంటే ఎక్కువ స్కోరు చేసిన బెంగళూరుకిది మూడో పరాజయం కావడం గమనార్హం.


 స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి నాటౌట్ 100; వాట్సన్ (సి) జడేజా (బి) ధవళ్ కులకర్ణి 6; డివిలియర్స్ (సి) రైనా (బి) తాంబే 20; రాహుల్ నాటౌట్ 51; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి) 180.
 వికెట్ల పతనం: 1-8, 2-59.

బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 3-0-28-0, కులకర్ణి 4-0-39-1, తాంబే 3-0-24-1, జకాతి 3-0-28-0, జడేజా 3-0-17-0, డ్వేన్ బ్రేవో 4-0-43-0.

గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) డివిలియర్స్ (బి) రిచర్డ్‌సన్ 32; మెకల్లమ్ (సి అండ్ బి) షమ్మీ 42; రైనా (సి) అబ్దుల్లా (బి) చాహల్ 28; దినేశ్ కార్తీక్ నాటౌట్ 50; జడేజా (సి) రాహుల్ (బి) వాట్సన్ 12; బ్రేవో నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 182.

 వికెట్ల పతనం: 1-47, 2-87, 3-140, 4-178.
బౌలింగ్: చాహల్ 4-0-33-1, రిచర్డ్‌సన్ 4-0-53-1, ఇక్బాల్ అబ్దుల్లా 4-0-41-0, వాట్సన్ 3.3-0-31-1, తబ్రేజ్ షమ్సీ 4-0-21-1.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement