
బెంగళూరులో తొక్కిసలాటకు ఆర్సీబీదే బాధ్యత
కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ స్పష్టీకరణ
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో గత నెల 4న జరిగిన తొక్కిసలాటకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) క్రికెట్ జట్టు బాధ్యత వహించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్) పేర్కొంది. ఈ తొక్కిసలాటలో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఐపీఎస్ అధికారి వికాశ్ కుమార్‌తోపాటు పలువురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తనను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ వికాశ్ కుమార్ ‘క్యాట్’ను ఆశ్రయించారు. సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు.
ఆయన విజ్ఞప్తిపై క్యాట్ విచారణ జరిపింది. విజయోత్సవాలకు దాదాపు 5 లక్షల మంది తరలివచ్చారని, ఇందుకు ఆర్సీబీదే బాధ్యత అని స్పష్టంచేసింది. పోలీసుల నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోలేదని తప్పుపట్టింది. ఐపీఎల్‌లో ఆర్సీబీ గెలిచిన తర్వాత బెంగళూరులో విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జట్టు యాజమాన్యం హఠాత్తుగా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో లక్షల మంది తరలివచ్చారని, వారిని అదుపులో చేయడం పోలీసులకు సాధ్యం కాలేదని వెల్లడించింది.
తగినంత సమయం లేకపోవడంతో వారు ఏర్పాట్లు చేయలేకపోయారని తెలిపింది. ‘పోలీసులు కూడా మామూలు మనుషులే. వారు దేవుళ్లు కాదు. ఇంద్రజాలికులు కూడా కాదు. వారు మాయలు మహిమలు ప్రదర్శించలేరు. పోలీసుల వద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు’’అని క్యాట్ తేలి్చచెప్పింది. వికాశ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేసింది.