ఐపీఎల్ 9 నుంచి ముంబై నిష్క్రమణ
► ప్లేఆఫ్‌కు గుజరాత్
► డ్వేన్ స్మిత్ ఆల్‌రౌండ్ షో
► సురేశ్ రైనా మెరుపులు
ఆఖరి మ్యాచ్‌కు ముందు చేతిలో 16 పాయింట్లు ఉన్నా గెలవకపోతే ఇంటికెళ్లే ప్రమాదంతో ఉన్న గుజరాత్ లయన్స్ జట్టు కీలక మ్యాచ్‌లో చెలరేగిపోయింది. డ్వేన్ స్మిత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన... రైనా, మెకల్లమ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ప్లేఆఫ్‌కు చేరడంతో పాటు టాప్-2లో స్థానాన్ని ఖరారు చేసుకుంది. అటు డిఫెండింగ్ చాంపియన్ ముంబై చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో ఇంటిముఖం పట్టింది. ఇక ఏదైనా అత్యద్భుతం జరిగితే తప్ప రోహిత్ సేనకు ప్లేఆఫ్ అవకాశం లేదు.
కాన్పూర్: సురేశ్ రైనా (36 బంతుల్లో 58; 8 ఫోర్లు; 2 సిక్సర్లు), మెకల్లమ్ (27 బంతుల్లో 48; 8 ఫోర్లు; 1 సిక్స్), డ్వేన్ స్మిత్ (23 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) దుమ్ము రేపే ఆటతీరుతో చెలరేగడంతో గుజరాత్ లయన్స్ ప్లే ఆఫ్‌కు చేరింది. శనివారం గ్రీన్‌పార్క్‌లో జరిగిన మ్యాచ్‌లో లయన్స్ 6 వికెట్ల తేడాతోముంబై ఇండియన్స్‌పై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 172 పరుగులు చేసింది. నితీష్ రాణా (36 బంతుల్లో 70; 7 ఫోర్లు; 4 సిక్సర్లు) ఒక్కడే పోరాడాడు. బట్లర్ (31 బంతుల్లో 33; 3 ఫోర్లు), రోహిత్ (17 బంతుల్లో 30; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రవీణ్, ధావల్, స్మిత్, బ్రేవోలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసి నెగ్గింది. జడేజా (15 బంతుల్లో 21 నాటౌట్; 4 ఫోర్లు) రాణించాడు. వినయ్‌కు రెండు వికెట్లు దక్కాయి.
రాణా జోరు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రోహిత్ ధాటిగా ఆరంభించాడు. వేగంగా పరుగులు తీసే క్రమంలో ధావల్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్స్ బాదిన అనంతరం క్యాచ్ అవుటయ్యాడు. మరసటి ఓవర్‌లోనే గప్టిల్ (7), కృనాల్ (4)ను డ్వేన్ స్మిత్ పెవిలియన్‌కు పంపి ముంబైని గట్టి దెబ్బే తీశాడు. ఈ దశలో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన నితీష్ రాణా ముంబైకి ఆపద్భాందవుడయ్యాడు. బట్లర్‌తో కలిసి కొద్దిసేపు నిదానంగానే ఆడినా అనంతరం ఇరువురూ విజృంభించారు. 11వ ఓవర్‌లో రాణా ఓ సిక్స్, ఫోర్‌తో వేగం పెంచాడు. తర్వాతి ఓవర్‌లోనూ 4,6తో జట్టును వంద పరుగులు దాటించాడు. అయితే బ్రేవో అద్భుత రిటర్న్ క్యాచ్‌తో బట్లర్ అవుట్ కావడంతో నాలుగో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
అయినా దూకుడు తగ్గించని రాణా స్పిన్నర్ జకాతి బౌలింగ్‌లో మూడు ఫోర్లు బాదాడు. ఈక్రమంలో 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మరో 8 బంతుల్లోనే 20 పరుగులు చేసిన తను బ్రేవో బౌలింగ్‌లో డీప్ స్క్వేర్ లెగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్ పూర్తిగా నిరాశపరిచారు. పొలార్డ్ (9) తోపాటు హార్దిక్ (7), హర్భజన్ (3)ను వెంటవెంటనే అవుట్ చేసిన లయన్స్ ముంబైని నిలువరించింది. చివరి నాలుగు ఓవర్లలో 27 పరుగులు మాత్రమే చేసిన ముంబై నాలుగు వికెట్లను కోల్పోయింది. వీరి ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
రైనా, మెకల్లమ్ మెరుపులు: ఓపెనర్‌గా దిగిన ఆరోన్ ఫించ్‌ను రెండో బంతికే వినయ్ కుమార్ ఎల్బీగా పంపడంతో లయన్స్‌కు షాక్ తగిలింది. తొలి రెండు ఓవర్లు ఎనిమిది పరుగులే వచ్చినా ఆ తర్వాత రైనా, మెకల్లమ్ బ్యాట్ ఝళిపించారు. మెక్లీనగర్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో రైనా మూడు ఫోర్లు, సిక్స్‌తో 18 పరుగులు రాబట్టగా ఐదో ఓవర్‌లో మెకల్లమ్ రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో దూకుడు కనబరిచాడు. ఆరో ఓవర్‌లో 4,6తో జోరు మీదున్న రైనా ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను బుమ్రా అందుకోలేకపోయాడు. ఇదే ఓవర్‌లో మరో రెండు ఫోర్లు బాదగా 19 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో లయన్స్ 70/1 స్కోరు చేసింది. అయితే పదో ఓవర్‌లో జోరు మీదున్న మెకల్లమ్‌ను హర్భజన్ బౌల్డ్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రైనా ఓ ఫోర్‌తో 30 బంతుల్లో వరుసగా రెండో అర్ధ సెంచరీ చేశాడు. అయితే దినేశ్ కార్తీక్ (3) అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలి కాగా ఆ వెంటనే రైనా వికెట్‌ను బుమ్రా తీయడంతో జట్టు ఒత్తిడిలో పడింది. కానీ డ్వేన్ స్మిత్ బౌండరీలతో చెలరేగి పరుగుల వరద పారించాడు. తనకు జడేజా సహకరించడంతో జట్టు ఎలాంటి ఇబ్బంది పడకుండా మ్యాచ్‌ను ముగించింది.
స్కోరు వివరాలు: ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) జకాతి (బి) ధావల్ కులకర్ణి 30; గప్టిల్ (సి) బ్రేవో (బి) స్మిత్ 7; రాణా (సి) ధావల్ కులకర్ణి (బి) బ్రేవో 70; కృనాల్ పాండ్య (సి) ఫించ్ (బి) స్మిత్ 4; బట్లర్ (సి అండ్ బి) బ్రేవో 33; పొలార్డ్ (సి) స్మిత్ (బి) ధావల్ కులకర్ణి 9; హార్దిక్ పాండ్య (సి) జడేజా (సి) ప్రవీణ్ కుమార్ 7; హర్భజన్ (సి) రైనా (బి) ప్రవీణ్ కుమార్ 3; వినయ్ కుమార్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172.
వికెట్ల పతనం: 1-33, 2-41, 3-45, 4-120, 5-153, 6-160, 7-166, 8-172.
బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 4-0-24-2; ధావల్ కులకర్ణి 4-0-41-2; స్మిత్ 4-0-37-2; జకాతి 3-0-30-0; బ్రేవో 4-0-22-2; జడేజా 1-0-15-0.
గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: ఫించ్ ఎల్బీడబ్ల్యు (బి) వినయ్ 0; మెకల్లమ్ (బి) హర్భజన్ 48; రైనా (సి) బట్లర్ (బి) బుమ్రా 58; దినేశ్ కార్తీక్ (సి) బట్లర్ (బి) వినయ్ 3; స్మిత్ నాటౌట్ 37 జడేజా నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (17.5 ఓవర్లలో 4 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1-0, 2-96, 3-111, 4-122.
బౌలింగ్: వినయ్ 3-1-17-2; బుమ్రా 4-0-42-1; మెక్లీనగన్ 3.5-0-38-0; కృనాల్ పాండ్య 2-0-28-0; హర్భజన్ 4-0-36-1; హార్ధిక్ 1-0-10-0.