సాక్షి, చెన్నై: ప్రొకబడ్డీ ఐదో సీజన్ విజేతగా డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ నిలిచింది. వరుసగా మూడో సారి టైటిల్ గెలిచి హ్యాట్రిక్ సాధించడంతో టోర్నీ చరిత్రలో తిరుగులేని రికార్డు సృష్టించింది. పట్నా కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ 19 రైడ్ పాయింట్లతో మరోసారి తన దూకుడైన ఆటతో ఆ జట్టుకు 55-38 తేడాతో చిరస్మరణీయ విజయం అందించాడు. అత్యంత డిఫెన్స్ బలం ఉన్న గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను అంతిమ సమరంలో నిలువరించాడు. అతడి దూకుడుకు తోడు స్వీయ తప్పిదాలు, ఒత్తిడి గుజరాత్‌ను చిత్తుచేసింది.
తొలుత గుజరాతే 9-3తో ఆధిక్యంలో ఉంది. పట్నాను ఆలౌట్ చేసి 15-10తో దూసుకుపోయింది. ఈ స్థితిలో ప్రదీప్ నర్వాల్ అద్భుత రీతిలో ఐదు పాయింట్లు తెచ్చి 15-15తో స్కోర్ సమం చేశాడు. రెండు జట్లు పోటాపోటీగా ఆడటంతో తొలి భాగంలో పట్నా 21-18తో నిలిచింది. రెండవ భాగంలో డిఫెండింగ్ చాంపియన్ మరింత చెలరేగి 29-23 తో ఆధిక్యం కనబరిచింది. అప్పుడు గుజరాత్ కాస్త పుంజుకుంది. పట్నా ఆధిక్యాన్ని 26-30కి తగ్గించింది.
ఐతే మోను గోయత్ కూతకెళ్లి పాయింట్లు తేవడంతో మళ్లీ ఒత్తిడిలో పడిపోయింది. స్కోరు 34- 40తో ఉండగా పట్నా మళ్లీ దెబ్బకొట్టింది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న డిఫెండర్లు ప్రత్యర్థి రైడర్లను పట్టేయడంలో పొరపాట్లు చేశారు. ప్రదీప్ మరోసారి వరుస సూపర్‌రైడ్లు చేయడంతో పట్నా 50-36తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. చివరికి 55- 38తో విజయం సాధించి హ్యాట్రిక్ విజేతగా ఆవిర్భవించింది. పట్నాలో విజయ్ 7, జైదీప్ 5 పాయింట్లు సాధించారు. గుజరాత్‌లో సచిన్ 11, మహేంద్ర రాజ్‌పుత్ 5, చంద్రన్ రంజిత్ 4 పాయింట్లు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment