
చెన్నై: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు ఓ చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ జట్టు 58–37 స్కోరుతో తమిళ్ తలైవాస్‌పై జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టును ఏకంగా నాలుగు సార్లు ఆలౌట్ చేయడం విశేషం. రైడర్లు రాహుల్ చౌదరి (16), మోసిన్ (12), నీలేశ్ సాలుంకే (11) చెలరేగారు. దీంతో రైడింగ్‌లోనే జట్టు 36 పాయింట్లు సంపాదించింది. టాకిల్‌లో మరో 11 పాయింట్లు వచ్చాయి. తమిళ్ తలైవాస్ తరఫున అజయ్ ఠాకూర్ (20) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారిలో డాంగ్ జియోన్ లీ 5, ప్రపంజన్ 4 పాయింట్లు చేశారు. జోన్ ‘బి’లో 20 మ్యాచ్‌లాడిన టైటాన్స్‌కు ఇది ఏడో గెలుపు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అంతకుముందు జరిగిన తొలి పోరులో గుజరాత్ ఫార్చూన్‌జెయింట్స్ 42–22 స్కోరుతో దబంగ్ ఢిల్లీపై ఘనవిజయం సాధించింది. గుజరాత్ రైడర్లు సచిన్ (11), చంద్రన్ రంజీత్ (9) రాణించారు. వరుసగా పాయింట్లు తెచ్చిపెట్టారు. రాకేశ్ నర్వాల్, సునీల్ కుమార్ చెరో 6 పాయింట్లు సాధించారు. ఢిల్లీ జట్టు తరఫున అబొల్ ఫజల్ 7, శ్రీరామ్ 6 పాయింట్లు చేశారు. మొత్తం 11 విజయాలతో గుజరాత్ జోన్ ‘ఎ’లో అగ్రస్థానంలో నిలిచింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో హరియాణా స్టీలర్స్, తమిళ్ తలైవాస్‌తో యూపీ యోధ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment