చివర్లో టైటాన్స్ తడబాటు
సోనెపట్: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా తెలుగు టైటాన్స్ జట్టు ప్రదర్శన ఓ విజయం... అంతలోనే పరాజయం అన్నట్టుగా సాగుతోంది. మంగళవారం బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖర్లో తడబాటుకు గురై తగిన మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ మరో ఏడు నిమిషాల్లో ముగుస్తుందనగా టైటాన్స్ జట్టు 30–20 పాయింట్ల తేడాతో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అయితే ఆ తర్వాత ఆటతీరు ఒక్కసారిగా గతి తప్పడంతో మరో ఐదు నిమిషాల వరకు కూడా ఒక్క పాయింట్ సాధించలేకపోయింది.
అటు బెంగాల్ ఒక్కసారిగా జోరు పెంచడంతో చివరికి టైటాన్స్ 31–32 తేడాతో ఓడాల్సి వచ్చింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (4 పాయింట్లు) విఫలం కాగా... నీలేశ్ సలుంకే అత్యధికంగా 10 రైడింగ్ పాయింట్లు సాధించాడు. బెంగాల్ వారియర్స్ విజయంలో జంగ్ కున్ లీ (9 పాయింట్లు) కీలక పాత్ర పోషించాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 27–24 తేడాతో దబంగ్ ఢిల్లీని ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో యూపీ యోధ; హరియాణా స్టీలర్స్‌తో పుణేరి పల్టన్ తలపడతాయి.