తెలుగు టైటాన్స్ తడాఖా
* బెంగళూరు బుల్స్‌పై విజయం
* ప్రొ కబడ్డీ లీగ్
బెంగళూరు: రైడింగ్‌తోపాటు డిఫెన్స్‌లోనూ రాణించిన తెలుగు టైటాన్స్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్‌లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు బుల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు 32-24 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రాహుల్ చౌదరి తొమ్మిది రైడింగ్ పాయింట్లు సంపాదించగా... సందీప్ నర్వాల్ ఐదు ట్యాకిల్ పాయింట్లు సాధించి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
హైదరాబాద్‌లో జరిగిన పోటీలో బెంగళూరు చేతిలో ఓడిన టైటాన్స్ జట్టు... బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును ఓడించి లెక్క సరిచేసింది. ప్రస్తుతం టైటాన్స్ జట్టు 24 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మ్యాచ్ రెండో నిమిషంలో రాహుల్ చౌదరీ రైడింగ్‌కు వెళ్లి విజయవంతంగా తిరిగి రావడంతో టైటాన్స్ పాయింట్ల బోణీ చేసింది. నాలుగో నిమిషంలో తాడోపేడో తేల్చుకోవాల్సిన రైడింగ్‌లో నీలేశ్ సాలూంకే సఫలం కావడంతో టైటాన్స్ 4-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఏడు నిమిషాలు పూర్తయ్యే సమయానికి బెంగళూరు జట్టులో ఒక్కరే కోర్టులో నిలిచాడు. ఆ వెంటనే టైటాన్స్ ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంతో 10-1తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత టైటాన్స్ తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ నిలకడగా పాయింట్లు సాధించింది. విరామ సమయానికి టైటాన్స్ 16-10తో ముందంజలో ఉంది. రెండో అర్ధభాగంలోనూ టైటాన్స్ ఆటగాళ్ల జోరు కొనసాగడంతో బెంగళూరు బుల్స్ తేరుకోలేకపోయింది.
బెంగాల్ వారియర్స్, పుణెరి పల్టన్‌ల మధ్య జరిగిన మ్యాచ్ 34-34 పాయింట్ల వద్ద టైగా ముగిసింది. బుధవారం జరిగే ఏకైక మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడుతుంది.