Rahul Choudhary
-
కబడ్డీమే సవాల్!
►ప్రొ కబడ్డీ లీగ్‌కు రంగం సిద్ధం ►నేటి నుంచి ఐదో సీజన్ ►బరిలో 12 జట్లు ►తొలి మ్యాచ్‌లో తలైవాస్‌తో టైటాన్స్ ఢీ 12 జట్లు...13 వారాలు...138 మ్యాచ్‌లు... అభిమానులను అలరించేందుకు ప్రొ కబడ్డీ లీగ్ మళ్లీ వచ్చేసింది. నాలుగు సీజన్ల పాటు విజయవంతంగా వినిపించిన ఈ కూత మరోసారి వినిపించేం దుకు రంగం సిద్ధమైంది. కొన్ని స్వల్ప మార్పులు, కొత్త హంగులతో కబడ్డీ ఐదో సీజన్‌కు నగారా మోగింది. హైదరాబాద్‌లోనే నేడు జరిగే ఆరంభోత్సవం తర్వాత దాదాపు మూడు నెలల పాటు కబడ్డీ అభిమానులకు ఫుల్ వినోదం లభించడం ఖాయం. మరోవైపు తెలుగు ఆటగాడు ఒక్కడైనా లేని తెలుగు టైటాన్స్ జట్టును ఈసారైనా విజయం వరిస్తుందా చూడాలి. హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్ నేడు ప్రారంభం కానుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు తమిళ్ తలైవాస్‌తో తలపడుతుంది. గత నాలుగు సీజన్ల వరకు టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు ఉండగా ఈ సారి అదనంగా మరో నాలుగు జట్లను చేర్చారు. గతంతో పోలిస్తే ఫార్మాట్లో స్వల్ప మార్పులు చేశారు. జట్లను ఎ, బి జోన్లుగా విభజించి ఇంటర్ జోనల్ మ్యాచ్‌లు కూడా నిర్వహిస్తున్నారు. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు జోన్ల నుంచి ఆరు జట్లు సూపర్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 28న చెన్నైలో ఫైనల్ జరుగుతుంది. గురువారం నగరంలో జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో 12 జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. ‘కబడ్డీ లీగ్ ఇప్పటికే బాగా ఆదరణ పొందింది. మరింత ఎక్కువ మందికి చేరువ చేసేందుకు జట్లు, మ్యాచ్‌ల సంఖ్యను పెంచారు. మూడు నెలల షెడ్యూల్ సుదీర్ఘంగా అనిపించవచ్చు. కానీ మేం ఆడేది 40 నిమిషాల మ్యాచ్ మాత్రమే. కాబట్టి అభిమానులకు బోర్ కొడుతుందనే ఆలోచన అనవసరం. ఎక్కువ మ్యాచ్‌ల నిర్వహణ కబడ్డీకి మరింత మేలు చేసేదే తప్ప నష్టపరచదు’ అని ఈ సందర్భంగా టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి అభిప్రాయపడ్డాడు. నేడు జరిగే ఆరంభ వేడుకలకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతాడు. ఒక్కరూ లేరు... తెలుగు టైటాన్స్ జట్టులోనే కాదు ఈ సారి ప్రొ కబడ్డీ లీగ్ మొత్తంలోనే ఒక్క తెలుగు ఆటగాడు కూడా లేడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీ కూడా తీసుకోలేదు. వివిధ రాష్ట్ర జట్ల తరఫున జాతీయ స్థాయిలో ప్రదర్శనను బట్టి భారత కబడ్డీ ఫెడరేషన్ ఆటగాళ్ల పూల్‌ను సిద్ధం చేసి ఉంచుతుంది. అందులోనుంచే 12 జట్లు తమ ఆటగాళ్లను ఎంచుకున్నాయి. మన టీమ్‌ల ప్రదర్శన అంతంత మాత్రమే కావడంతో ఎవరూ లీగ్ యజమానులను ఆకట్టుకోలేకపోయారు. జట్ల వివరాలు జోన్ ‘ఎ’: దబంగ్ ఢిల్లీ, గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్, హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరీ పల్టన్, యు ముంబా. జోన్ ‘బి’: బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్, తెలుగు టైటాన్స్, యూపీ యోధ. ►మ్యాచ్ టికెట్లుeventsnow.com లో లభిస్తాయి. టికెట్ల ధరను రూ. 450, 800, 3000గా నిర్ణయించారు. తొలి రోజు మ్యాచ్‌ల టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ►తొలి మ్యాచ్ రా. గం. 8 నుంచి, రెండో మ్యాచ్ గం. 9 నుంచి జరుగుతాయి ►మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
భారత కబడ్డీ సారథి అనూప్
ముంబై: ప్రపంచకప్‌లో భారత కబడ్డీ జట్టుకు హరియాణా స్టార్ రైడర్ అనూప్ కుమార్ సారథ్యం వహించనున్నాడు. 14 మంది సభ్యులుగల ఈ జట్టుకు బల్వన్ సింగ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. భారత్ ఆతిథ్యమిచ్చే ఈ ప్రపంచకప్ కబడ్డీ టోర్నీ వచ్చే నెల 7 నుంచి అహ్మదాబాద్‌లో జరుగనుంది. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జట్టు వివరాలను వెల్లడించారు. మొత్తం 12 దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటాయి. భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కబడ్డీ జట్టు జెర్సీని ఆవిష్కరించారు. ప్రపంచకప్‌కు భారత కబడ్డీ జట్టు: అనూప్ (కెప్టెన్), మన్జీత్ చిల్లర్ (వైస్ కెప్టెన్), అజయ్ ఠాకూర్, దీపక్ హుడా, ధర్మరాజ్, జస్వీర్ సింగ్, కిరణ్ పర్మార్, మోహిత్, నితిన్, పర్దీప్ నర్వాల్, రాహుల్ చౌదరి, సందీప్, సురేందర్, సుర్జీత్. పాక్‌ను ఆడించమంటారా..? కపిల్ ఆగ్రహం కబడ్డీ జట్టు ప్రకటన కార్యక్రమంలో ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నతో క్రికెట్ దిగ్గజం కపిల్ ఆగ్రహానికి లోనయ్యారు. ‘ఈ టోర్నీలో పాకిస్తాన్‌ను ఎందుకు ఆహ్వానించలేదు’ అని ఓ విలేకరి ప్రశ్నించగా... వెంటనే సహనం కోల్పోరుున కపిల్ ‘నువ్వో భారతీయుడవైవుండి ఈ ప్రశ్నను అడుగుతావా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రశ్నను అడుగుతారా..? పాక్‌ను పిలిచి ఆడించమంటారా?’ అని కస్సుమన్నాడు. యురీ ఘటనలో పాక్ ఉగ్రవాదుల దాడిలో 18 మంది భారత జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
టైటాన్స్ జోరు కొనసాగేనా?
సెమీస్‌లో నేడు జైపూర్‌తో అమీతుమీ ప్రొ కబడ్డీ లీగ్ హైదరాబాద్: వరుస విజయాలతో ఊపు మీదున్న తెలుగు టైటాన్స్ సొంత గడ్డపై నాకౌట్ సమరానికి సిద్ధమయింది. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరి జట్టులోనే ఉన్నా టైటాన్స్ ఇప్పటిదాకా ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. దీంతో ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలనే కసితో ఉన్న ఈ జట్టు నేటి (శుక్రవారం) రెండో సెమీఫైనల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో తలపడనుంది. సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. లీగ్ దశలో ఈ రెండు జట్లు రెండు సార్లు తలపడగా చెరో విజయంతో సమానంగా ఉన్నాయి. 2015 సీజన్లో మాత్రమే సెమీస్‌కు చేరిన టైటాన్స్ అందులో ఒక్క పాయింట్ తేడాతో బెంగళూరుపై ఓడింది. అనంతరం తాజాగా మరోసారి సెమీస్‌కు రాగా ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావీయకూడదనే ఆలోచనతో ఉంది. లీగ్ ఆరంభంలో టైటాన్స్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. కానీ తర్వాత పుంజుకుని తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓటమనేదే లేకుండా 50 పాయింట్లతో లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే రాహుల్ ప్రతీ మ్యాచ్‌లోనూ భీకర ఫామ్‌తో జట్టుకు పాయింట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఓవరాల్‌గా లీగ్ చరిత్రలో రాహుల్ అత్యధికంగా 455 రైడింగ్ పాయింట్లు సాధించి చరిత్ర సృష్టించాడు. తనపై జట్టు పెట్టుకున్న ఆశలకు అనుగుణంగానే రాణించి టైటాన్స్‌ను తొలిసారి ఫైనల్‌కు చేర్చాలని భావిస్తున్నాడు. రైడింగ్‌లో సుకేశ్, అతుల్, నీలేశ్ కూడా కీలకం కానున్నారు. ఇక ఆల్‌రౌండర్ సందీప్ నర్వాల్ ప్రత్యర్థికి తన పట్టు పవర్ చూపిస్తే విజయం సులభమే. మరోవైపు మాజీ చాంపియన్ పింక్ పాంథర్స్‌ను తక్కువ అంచనా వేయలేం. టైటాన్స్లా కాకుండా ఈ జట్టు సమష్టి కృషితో రాణిస్తోంది. కెప్టెన్ జస్వీర్ సింగ్, అజయ్ కుమార్, షబీర్ రైడింగ్‌లో మెరుపులు మెరిపించేవారే. ఈ సీజన్లో కొన్ని రోజులు టాప్ పొజిషన్లో కొనసాగిన జైపూర్‌ను ఓడించాలంటే టైటాన్స్ పూర్తి స్థాయిలో రాణించాల్సిన అవసరం ఉంది. పట్నాతో పుణెరి ఢీ శుక్రవారం జరిగే తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ జట్టు పుణెరి పల్టన్‌తో తలపడుతుంది. ఇప్పటిదాకా ప్రతీ సీజన్లో సెమీస్ వరకు చేరిన టేబుల్ టాపర్ పట్నాను ఓడించాలంటే మంజీత్ చిల్లర్ సారథ్యంలోని పుణెరి జట్టు చెమటోడ్చాల్సిందే. -
తెలుగు టైటాన్స్ తడాఖా
* బెంగళూరు బుల్స్‌పై విజయం * ప్రొ కబడ్డీ లీగ్ బెంగళూరు: రైడింగ్‌తోపాటు డిఫెన్స్‌లోనూ రాణించిన తెలుగు టైటాన్స్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్‌లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు బుల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు 32-24 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రాహుల్ చౌదరి తొమ్మిది రైడింగ్ పాయింట్లు సంపాదించగా... సందీప్ నర్వాల్ ఐదు ట్యాకిల్ పాయింట్లు సాధించి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్‌లో జరిగిన పోటీలో బెంగళూరు చేతిలో ఓడిన టైటాన్స్ జట్టు... బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును ఓడించి లెక్క సరిచేసింది. ప్రస్తుతం టైటాన్స్ జట్టు 24 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మ్యాచ్ రెండో నిమిషంలో రాహుల్ చౌదరీ రైడింగ్‌కు వెళ్లి విజయవంతంగా తిరిగి రావడంతో టైటాన్స్ పాయింట్ల బోణీ చేసింది. నాలుగో నిమిషంలో తాడోపేడో తేల్చుకోవాల్సిన రైడింగ్‌లో నీలేశ్ సాలూంకే సఫలం కావడంతో టైటాన్స్ 4-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఏడు నిమిషాలు పూర్తయ్యే సమయానికి బెంగళూరు జట్టులో ఒక్కరే కోర్టులో నిలిచాడు. ఆ వెంటనే టైటాన్స్ ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంతో 10-1తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత టైటాన్స్ తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ నిలకడగా పాయింట్లు సాధించింది. విరామ సమయానికి టైటాన్స్ 16-10తో ముందంజలో ఉంది. రెండో అర్ధభాగంలోనూ టైటాన్స్ ఆటగాళ్ల జోరు కొనసాగడంతో బెంగళూరు బుల్స్ తేరుకోలేకపోయింది. బెంగాల్ వారియర్స్, పుణెరి పల్టన్ల మధ్య జరిగిన మ్యాచ్ 34-34 పాయింట్ల వద్ద టైగా ముగిసింది. బుధవారం జరిగే ఏకైక మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడుతుంది.