కబడ్డీమే సవాల్!
►ప్రొ కబడ్డీ లీగ్‌కు రంగం సిద్ధం
►నేటి నుంచి ఐదో సీజన్
►బరిలో 12 జట్లు
►తొలి మ్యాచ్‌లో తలైవాస్‌తో టైటాన్స్ ఢీ
12 జట్లు...13 వారాలు...138 మ్యాచ్‌లు... అభిమానులను అలరించేందుకు ప్రొ కబడ్డీ లీగ్ మళ్లీ వచ్చేసింది. నాలుగు సీజన్ల పాటు విజయవంతంగా వినిపించిన ఈ కూత మరోసారి వినిపించేం దుకు రంగం సిద్ధమైంది. కొన్ని స్వల్ప మార్పులు, కొత్త హంగులతో కబడ్డీ ఐదో సీజన్‌కు నగారా మోగింది. హైదరాబాద్‌లోనే నేడు జరిగే ఆరంభోత్సవం తర్వాత దాదాపు మూడు నెలల పాటు కబడ్డీ అభిమానులకు ఫుల్ వినోదం లభించడం ఖాయం. మరోవైపు తెలుగు ఆటగాడు ఒక్కడైనా లేని తెలుగు టైటాన్స్ జట్టును ఈసారైనా విజయం వరిస్తుందా చూడాలి.
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్ నేడు ప్రారంభం కానుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు తమిళ్ తలైవాస్‌తో తలపడుతుంది. గత నాలుగు సీజన్ల వరకు టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు ఉండగా ఈ సారి అదనంగా మరో నాలుగు జట్లను చేర్చారు. గతంతో పోలిస్తే ఫార్మాట్‌లో స్వల్ప మార్పులు చేశారు. జట్లను ఎ, బి జోన్‌లుగా విభజించి ఇంటర్ జోనల్ మ్యాచ్‌లు కూడా నిర్వహిస్తున్నారు. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు జోన్‌ల నుంచి ఆరు జట్లు సూపర్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 28న చెన్నైలో ఫైనల్ జరుగుతుంది.
గురువారం నగరంలో జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో 12 జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. ‘కబడ్డీ లీగ్ ఇప్పటికే బాగా ఆదరణ పొందింది. మరింత ఎక్కువ మందికి చేరువ చేసేందుకు జట్లు, మ్యాచ్‌ల సంఖ్యను పెంచారు. మూడు నెలల షెడ్యూల్ సుదీర్ఘంగా అనిపించవచ్చు. కానీ మేం ఆడేది 40 నిమిషాల మ్యాచ్ మాత్రమే. కాబట్టి అభిమానులకు బోర్ కొడుతుందనే ఆలోచన అనవసరం. ఎక్కువ మ్యాచ్‌ల నిర్వహణ కబడ్డీకి మరింత మేలు చేసేదే తప్ప నష్టపరచదు’ అని ఈ సందర్భంగా టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి అభిప్రాయపడ్డాడు. నేడు జరిగే ఆరంభ వేడుకలకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతాడు.
ఒక్కరూ లేరు...
తెలుగు టైటాన్స్ జట్టులోనే కాదు ఈ సారి ప్రొ కబడ్డీ లీగ్ మొత్తంలోనే ఒక్క తెలుగు ఆటగాడు కూడా లేడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీ కూడా తీసుకోలేదు. వివిధ రాష్ట్ర జట్ల తరఫున జాతీయ స్థాయిలో ప్రదర్శనను బట్టి భారత కబడ్డీ ఫెడరేషన్ ఆటగాళ్ల పూల్‌ను సిద్ధం చేసి ఉంచుతుంది. అందులోనుంచే 12 జట్లు తమ ఆటగాళ్లను ఎంచుకున్నాయి. మన టీమ్‌ల ప్రదర్శన అంతంత మాత్రమే కావడంతో ఎవరూ లీగ్ యజమానులను ఆకట్టుకోలేకపోయారు.
జట్ల వివరాలు
జోన్ ‘ఎ’: దబంగ్ ఢిల్లీ, గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్, హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరీ పల్టన్, యు ముంబా.
జోన్ ‘బి’: బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్, తెలుగు టైటాన్స్, యూపీ యోధ.
►మ్యాచ్ టికెట్లుeventsnow.com లో లభిస్తాయి. టికెట్ల ధరను రూ. 450, 800, 3000గా నిర్ణయించారు. తొలి రోజు మ్యాచ్‌ల టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.
►తొలి మ్యాచ్ రా. గం. 8 నుంచి, రెండో మ్యాచ్ గం. 9 నుంచి జరుగుతాయి
►మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం