జులన్‌... ‘పేస్‌’ గన్‌! | Jhulan Goswami becomes the leading wicket-taker in Women's ODIs | Sakshi
Sakshi News home page

జులన్‌... ‘పేస్‌’ గన్‌!

Published Wed, May 10 2017 12:46 AM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

జులన్‌... ‘పేస్‌’ గన్‌!

జులన్‌... ‘పేస్‌’ గన్‌!

స్ఫూర్తిదాయకం బౌలర్‌ జులన్‌ గోస్వామి ప్రస్థానం   

దాదాపు ఇరవై ఏళ్ల క్రితం... 1997లో మహిళల క్రికెట్‌ వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు తలపడ్డాయి. కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్‌ చూసేందుకు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థినులకు ఉచిత కాంప్లిమెంటరీ పాస్‌లు పంపించారు. అలా ఆ మ్యాచ్‌ చూసే అవకాశం దక్కించుకున్న 15 ఏళ్ల జులన్‌ గోస్వామి... తాను కూడా క్రికెట్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకోవాలని, భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని గట్టిగా నిర్ణయించుకుంది.

సరిగ్గా పదేళ్ల తర్వాత 2007లో ఐసీసీ ఉమన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును అందుకొని శిఖరాన నిలిచిన ఈ పేస్‌ బౌలర్, మరో పదేళ్లకు ఇప్పుడు వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రలో తన పేరును లిఖించుకోగలిగింది. మహిళా క్రికెట్‌కు పెద్దగా గుర్తింపు లేని సమయంలో, మీడియం పేస్‌ వేస్తే చాలనుకునే స్థితిలో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్‌ ఉమన్‌ బౌలర్‌గా జులన్‌ ఎదగడంలో ఎంతో శ్రమ, పట్టుదల ఉన్నాయి.

సాక్షి క్రీడా విభాగం :కోల్‌కతాకు దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న చక్‌దహా పట్టణం జులన్‌ స్వస్థలం. చాలా మందిలాగే సరదాగా టీనేజ్‌లో టెన్నిస్‌ బాల్‌తో ఆమె బౌలింగ్‌ చేసేందుకు ఆసక్తి చూపించింది. అయితే అక్కడి కుర్రాళ్లు ఆమె నెమ్మదైన బౌలింగ్‌ను చితక్కొట్టి నువ్వు బౌలింగ్‌ చేయడం మానేస్తే మంచిదని వ్యంగ్యంగా అన్నారు. దాంతో పట్టుదల పెరిగిన జులన్, ఫాస్ట్‌ బౌలింగ్‌పై దృష్టి పెట్టింది. కోల్‌కతాలో ప్రత్యేకంగా అమ్మాయిలకు క్రికెట్‌ కోచింగ్‌ ఇచ్చే స్వపన్‌ సాధు, జులన్‌ తల్లిదండ్రులను ఒప్పించి ఆమెకు తగిన మార్గనిర్దేశనం చేశాడు. అయితే రోజూ చక్‌దహా నుంచి కోల్‌కతా వరకు కిక్కిరిసిన ట్రైన్‌లలో ప్రయాణించడం, శిక్షణ పూర్తి చేసుకొని తిరిగి రావడం... ఇలా ఆట కోసం జులన్‌ తీవ్రంగా కష్టపడింది. ‘ఆ ప్రయాణం అంత సులువుగా ఉండేది కాదు. టీనేజ్‌ అమ్మాయిలు సహజంగానే ఎదుర్కొనే సమస్యలు నాకు కూడా వచ్చాయి. అయితే రానురానూ మానసికంగా దృఢంగా మారి వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాను’ అని జులన్‌ చెప్పుకుంది.

వేగంగా దూసుకెళ్లి...
బౌలింగ్‌లో మెళకువలు నేర్చుకున్న కొద్ది రోజులకే జులన్‌ కెరీర్‌ వేగంగా దూసుకుపోయింది. జూనియర్‌ స్థాయిలో మంచి ప్రదర్శన కనబర్చిన తర్వాత ఆమె బెంగాల్‌ రాష్ట్ర జట్టుకు ఎంపికైంది. ఆ తర్వాత ఈస్ట్‌జోన్‌ తరఫున ఒక మ్యాచ్‌లో ఆమె ప్రదర్శన (3/13) ఎయిరిండియా అధికారులను ఆకట్టుకుంది. దాంతో ఎయిరిండియాలో ఆమె రెగ్యులర్‌ సభ్యురాలిగా మారింది. ఆ తర్వాత రెండేళ్లకే తొలిసారి భారత జట్టులో అవకాశం లభించింది. ఇంగ్లండ్‌తో ఆడిన తొలి వన్డేలోనే జులన్‌ (2/15) రాణించింది. ఆ తర్వాత ఆమెకు ఎలాంటి అడ్డంకీ ఎదురు కాలేదు. ఆరంభంలో జూనియర్‌గా, ఆ తర్వాత సీనియర్‌ సభ్యురాలిగా కూడా భారత జట్టులో కీలకంగా ఎదిగి జులన్‌ పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమైంది. 2006లో టాంటన్‌లో అద్భుత బౌలింగ్‌ ప్రదర్శన (10/78)తో ఇంగ్లండ్‌పై భారత్‌ చారిత్రక టెస్టు విజయం సాధించడంలో జులన్‌దే ప్రధాన పాత్ర. 2006, 2008 ఆస్ట్రేలియా పర్యటనలో వన్డేల్లో విశేషంగా రాణించిన ఈ పేసర్, 2007లో నాలుగు దేశాల టోర్నీలో 20.99 సగటుతో 11 వికెట్లు తీసి సత్తా చాటింది. అదే ఏడాది ఐసీసీ ఉమన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును అందుకుంది. అర్జున, పద్మశ్రీ పురస్కారాలు కూడా ఆమెకు లభించాయి.

ఇప్పటికీ అదే జోరు...
చాలా కాలంగా మహిళల క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ బౌలర్‌గా జులన్‌కు గుర్తింపు ఉంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఆమె నిలకడగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేసింది. 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉన్న జులన్, పేసర్‌గా ఎదిగే క్రమంలో ఎంఆర్‌ఎఫ్‌ పేస్‌ ఫౌండేషన్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ ఆమెలో కొన్ని లోపాలు సరిదిద్ది మరింతగా తీర్చిదిద్దారు. దిగ్గజం గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ను ఆరాధించే జులన్, అతని వీడియోలను రెగ్యులర్‌గా చూస్తుంది. తన బౌలింగ్‌కు సంబంధించి గ్లెన్‌ నుంచి కూడా సూచనలు తీసుకుంది. చాలా కాలంగా భారత జట్టులో జులన్‌కు రెండో ఎండ్‌ నుంచి సరైన మద్దతు లేదు. 34 ఏళ్ల వయసులో కూడా దాదాపు సింగిల్‌ హ్యాండ్‌తో ఆమె జట్టు పేస్‌ బౌలింగ్‌ భారం మోస్తోంది. ఇప్పుడు తాజా రికార్డు జులన్‌ ఇన్నేళ్ల శ్రమకు దక్కిన గుర్తింపుగా చెప్పవచ్చు.

భారత మహిళల మరో గెలుపు 7 వికెట్లతో దక్షిణాఫ్రికా చిత్తు
181 వికెట్లతో జులన్‌ ప్రపంచ రికార్డు   

పోష్‌స్ట్రూమ్‌: నాలుగు దేశాల వన్డే టోర్నీలో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. ముందుగా దక్షిణాఫ్రికా 39.3 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. డు ప్రీజ్‌ (31), త్రిషా చెట్టి (28) రాణించారు. జులన్‌ గోస్వామి (3/20), శిఖా పాండే (3/22) ప్రత్యర్థిని కుప్పకూల్చారు. అనంతరం భారత్‌ 41.2 ఓవర్లలో 3 వికెట్లకు 121 పరుగులు చేసింది. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (66 బంతుల్లో 51 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా, మోనా మేశ్రమ్‌ (38) అండగా నిలిచింది.  

వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జులన్‌ గోస్వామి ప్రపంచ రికార్డు సృష్టించింది. 153 మ్యాచ్‌లలో 181 వికెట్లు పడగొట్టిన జులన్‌... దాదాపు దశాబ్ద కాలంగా క్యాథరీన్‌ ఫిట్జ్‌ ప్యాట్రిక్‌ (ఆస్ట్రేలియా–180) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement