ముందుగా బౌలింగ్‌లో జులన్ గోస్వామి, శిఖా పాండే పేస్‌తో హడలెత్తించారు. మధ్యలో స్పిన్నర్ పూనమ్ యాదవ్ ఓ చేయి వేసింది. తర్వాత స్మృతి మంధాన, కెప్టెన్ మిథాలీ బ్యాటింగ్‌లో అదరగొట్టారు! ఫలితం... ప్రత్యర్థి ఇంగ్లండ్‌కు అవకాశమే లేకుండా భారత మహిళల జట్టు రెండో వన్డేనూ వశం చేసుకుని... మరో రెండు ఐసీసీ చాంపియన్ షిప్ పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో శిఖా తన కెరీర్‌లో ఉత్తమ గణాంకాలను నమోదు చేయడం విశేషం. మ్యాచ్‌లో తనదైన హిట్టింగ్ చూపిన స్మృతి... డ్రైవ్‌లు, పుల్ షాట్లతో పరుగులు రాబట్టి ఆకట్టుకుంది. ఆమెకు మిథాలీ అనుభవం
తోడవడంతో టీమిండియా విజయం సులభమైంది.
ముంబై: ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన భారత మహిళలు వరుసగా రెండో వన్డేలోనూ ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించారు. మూడు వన్డేల ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమవారం ఇక్కడ జరిగిన ఈ మ్యాచ్‌లో మిథాలీ సేన ఏడు వికెట్ల తేడాతో సునాయాసంగా గెలుపొందింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్... పేస్ ద్వయం, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జులన్ గోస్వామి (4/30), శిఖా పాండే (4/18) ధాటికి 43.3 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు ఎలెన్ జోన్స్ (3), బ్యూమాంట్ (20)ను ఔట్ చేసి శిఖా శుభారంభమివ్వగా... సారా టేలర్ (1), కెప్టెన్ హీతెర్ నైట్ (2)లను జులన్ వెనక్కు పంపింది. జట్టు 44/4తో నిలిచిన ఈ దశలో నటాలీ సీవర్ (109 బంతుల్లో 85; 12 ఫోర్లు, 1 సిక్స్), విన్‌ఫీల్డ్ (49 బంతుల్లో 28; 4 ఫోర్లు) ఆదుకున్నారు.
ఐదో వికెట్‌కు 49 పరుగులు జోడించిన వీరిని... విన్‌ఫీల్డ్‌ను ఔట్ చేయడం ద్వారా స్పిన్నర్ పూనమ్ యాదవ్ (2/28) విడదీసింది. శిఖా దెబ్బకు ఎల్విస్ (0), బ్రంట్ (0) ఖాతా తెరవకుండానే బౌల్డయ్యారు. ష్రబ్‌సోల్ (1)ను పూనమ్, ఎకిల్‌స్టోన్ (5)ను జులన్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ (0) డకౌట్‌గా వెనుదిరిగినా, మరో ఓపెనర్ స్మృతి మంధాన (74 బంతుల్లో 63; 7 ఫోర్లు, 1 సిక్స్), వన్ డౌన్ బ్యాటర్ పూనమ్ రౌత్ (65 బంతుల్లో 32; 4 ఫోర్లు) నిలకడగా ఆడటంతో టీమిండియాకు ఇబ్బంది ఎదురవలేదు. రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించాక రౌత్ ఔటైంది. మంధాన, కెప్టెన్ మిథాలీ రాజ్ (69 బంతుల్లో 47; 8 ఫోర్లు) మరింత సాధికారికంగా ఆడి లక్ష్యాన్ని కరిగించారు. స్మృతి వెనుదిరిగాక మిథాలీ, దీప్తి శర్మ (6 నాటౌట్) పని పూర్తి చేశారు. భారత్ 41.1 ఓవర్లకే విజయాన్ని అందుకుంది.
► 589 గత ఏడాది కాలంలో భారత జట్టు ఛేజింగ్ చేసిన ఎనిమిది ఇన్నింగ్స్‌లలో స్మృతి మంధాన 117.8 సగటుతో మొత్తం 589 పరుగులు చేసింది. ఇందులో ఏడు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉండటం విశేషం.
► 1 ఒకే ఇన్నింగ్స్‌లో భారత మహిళల జట్టుకు చెందిన ఇద్దరు పేస్ బౌలర్లు నాలుగు చొప్పున వికెట్లు తీయడం ఇదే ప్రథమం.
Comments
Please login to add a commentAdd a comment