
వెల్లింగ్టన్: సాధారణంగా ఫీల్డ్‌లో ‘అతి’గా ప్రవర్తించిన సందర్భాల్లో క్రికెటర్లు నిషేధానికి గురవడం చూస్తూ ఉంటాం. అయితే కాస్త చిత్రంగా అనిపించినా ఒక క్రికెట్ అభిమానిపై రెండేళ్ల నిషేధం పడింది. న్యూజిలాండ్‌కు చెందిన క్రికెట్ అభిమాని ఇంగ్లండ్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్‌పై అసభ్యకర రీతిలో దూషించడంతో అతనిపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు ఆఖరి రోజు ఆటలో ఆర్చర్‌పై ఆక్లాండ్‌కు చెందిన ఒక అభిమాని వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశాడు.
అంతటితో ఆగకుండా మరింత అవమానించేలా మాట్లాడాడు. దీనిపై అప్పట్లోనే పెద్ద దుమారం లేచినా అతన్ని పట్టుకుని పనిలో పడింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. ఎట్టకేలకు ఆక్లాండ్ చెందిన 28 ఏళ్ల వ్యక్తిగా గుర్తించిన న్యూజిలాండ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ క‍్రమంలోనే అతనిపై రెండేళ్ల పాటు క్రికెట్ మ్యాచ్‌లు చూడటానికి స్టేడియాలకు రాకుండా నిషేధం విధించినట్లు న్యూజిలాండ్ క్రికెట్ ప్రతినిధి ఆంటోని క్రుమ్మీ తెలిపాడు. 2022 వరకూ అతనిపై నిషేధం అమల్లో ఉంటుందన్నారు. ఇక్కడ న్యూజిలాండ్‌లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లు చూడటానికి కానీ, దేశవాళీ మ్యాచ్‌లు చూడటానికి కానీ అతనికి అనుమతి ఉండదు. ఒకవేళ ఈ నిషేధ సమయంలో అతను మ్యాచ్‌లు చూడటానికి యత్నిస్తే యాక్షన్ తీవ్రంగా ఉంటుందని క్రుమ్మీ స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment