
కోహిమా: ఒక క్రికెట్ మ్యాచ్‌లో ఆటగాడు సెంచరీ సాధిస్తే ఆ సంతోషమే వేరు. సెంచరీ చేసినా తన జట్టు ఓటమి పాలైతే ఆ బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి సెంచరీ వర్షార్పణం అయితే ఆవేదన మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు అదే ఆవేదనతో రగిలిపోతున్నాడు నాగాలాండ్ కెప్టెన్ రోంగ్‌సేన్ జోనాథన్. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రౌండ్-1లో మణిపూర్ జట్టుతో సెప్టెంబర్ 24వ తేదీన జరిగిన తొలి మ్యాచ్‌లో జోనాథన్ శతకం సాధించాడు. ఇది లిస్ట్-ఏ క్రికెట్‌లో జోనాథన్‌కు తొలి సెంచరీ.
అయితే కుండపోతగా కురిసిన వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయ్యింది. నాగాలాండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మణిపూర్ 8.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 44 పరుగుల వద్ద ఉండగా భారీ వర్షం కురిసింది. దాంతో మ్యాచ్‌ను కొనసాగించడం సాధ్యం కాలేదు.అదే సమయంలో ఆ మ్యాచ్‌తో పాటు వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్‌లను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రీ షెడ్యూల్ చేసింది. ఈ క్రమంలోనే తన సెంచరీ లెక్కల్లోకి రాకపోవడంతో జోనాథన్ తీవ‍్రంగా మధనపడుతున్నాడు.
‘ఇది నన్ను తీవ్రంగా వేధిస్తుంది. నా మనసుకు గాయం చేసింది. నా సెంచరీని దోచుకున్నారు’ అంటూ ఉద్వేగభరితమయ్యాడు. ‘ దాదాపు 60 శాతం మ్యాచ్ పూర్తయిన తరుణంలో మ్యాచ్‌ను రీ షెడ్యూల్ ఎలా చేస్తారు. రీ షెడ్యూల్‌పై నా అవగాహన అవగాహన ఉంది. కానీ మ్యాచ్‌లో ఫలితం రానప్పుడు ఆటగాళ్ల రికార్డులను రీ షెడ్యూల్ పేరుతో ఎలా దోచుకుంటారు. ప్లేయర్స్‌గా మేము చాలా కష్టపడతాం. కఠినంగా శ్రమిస్తాం. సీజన్‌లో తొలి మ్యాచ్‌లో సాధించిన రికార్డు ఇలా వృథా కావాల్సిందేనా. ఈ విషయం నన్ను కలిచి వేస్తోంది. నేను దీనిపై బీసీసీఐకి లేఖ రాశా. బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్‌కు జనరల్ మేనేజర్‌గా ఉన్న సాబా కరీంను వివరణ అడిగా. కానీ ఇంతవరకూ ఎటువంటి స్పందనా లేదు. మా వ్యక్తిగత రికార్డులు ప్రయోజనం లేకుండా మిగిలి పోవడం బాధిస్తోంది. నార్త్-ఈస్ట్ నుంచి వచ్చిన క్రికెటర్లపై చులకన భావం ఉంది. అందుచేతే నేను రాసిన లేఖకు వివరణ ఇవ్వలేదు’ అని జోనాథన్ తన ఆవేదనను మీడియాకు తెలిపాడు.