రిజిస్ట్రీని ఆదేశించిన సింగిల్ జడ్జి జస్టిస్ సంజయ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికల వివాదంలో దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ కలిపి హైకోర్టులో ఏ న్యాయమూర్తి విచారించాలన్న దానిపై పాలనాపరమైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా తన ముందున్న వ్యాజ్యాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ ముందుంచాలని రిజిస్ట్రీని సింగిల్ జడ్జి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఆదేశించారు. హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణ నిమిత్తం రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలు కొన్ని శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ముందు విచారణకు వచ్చాయి.
ఈ సందర్భంగా ఇదే అంశంపై మరో న్యాయమూర్తి ముందు కూడా వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఈ కేసులన్నింటినీ కలిపి ఏ న్యాయమూర్తి విచారించాలో పాలనాపరమైన నిర్ణయం తీసుకునేందుకు వ్యాజ్యాలను ఏసీజే ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కొందరు స్పందిస్తూ, ఫిబ్రవరిలో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పిటిషన్లపై వీలైనంత త్వరగా విచారణ జరపాలని న్యాయమూర్తిని కోరారు. విచారణ వేగవంతం చేయడానికే ఈ వ్యాజ్యాలను ఏసీజే ముందుంచాలని ఆదేశించినట్లు జస్టిస్ సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు.