
జస్టిన్ లాంగర్
మెల్‌బోర్న్ : టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి పలు అవకాశాలు ఇవ్వడం వల్లే తాము ఓడిపోయామని ఆస్ట్రేలియా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘ఆసీస్ ఆటగాళ్లు సాయశక్తుల పోరాడారు. కానీ 2-1తో సిరీస్ కోల్పోయాం. టెస్ట్ సిరీస్‌లానే ఈ సిరీస్‌ను గెలిచే అవకాశాలను చేతులారా చేజార్చుకుని ఓడిపోయాం. గొప్ప ఆటగాళ్లకు ఎప్పుడూ అవకాశం ఇవ్వద్దు. కానీ మా ఆటగాళ్లు అదే చేశారు. రెండు సార్లు ధోనిని ఔట్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఇదే మా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ సిరీస్‌లో మాకు కొన్ని సానుకూల అంశాలు కనిపించాయి. స్టోయినిస్ అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్ ద్వారా రిచర్డ్సన్ వెలుగులోకి వచ్చాడు. అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మిడిలార్డర్‌లో హ్యాండ్‌స్కోంబ్ ఆసాధారణ ప్రదర్శన కనబర్చాడు. షాన్ మార్ష్ సిరీస్ ఆసాంతం ఆకట్టుకున్నాడు. మాకు లభించిన అవకాశాలను అందుకోలేక ఓటమి పాలయ్యాం. మరోసారి ధోని అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతని ప్రదర్శన బ్యాటర్స్ అందరికి ఓ మార్గదర్శకత్వంలాంటింది.’ అని చెప్పుకొచ్చాడు.
ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిలో తనకు సచిన్ టెండూల్కర్ కనిపిస్తున్నాడని, అతను మైదానంలో 360 కోణంలో ఆడే షాట్స్ అద్భుతమని జస్టిన్ లాంగర్ కితాబిచ్చాడు. సచిన్ ఆటను ఎప్పుడూ ఆస్వాదించేవాడినని, ఈ సిరీస్‌లో విరాట్ ఆట చూస్తే అలానే అనిపించిందని ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లి, ధోని, రోహిత్ శర్మలు ఆల్‌టైం గ్రేట్ క్రికెటర్స్ అని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచి.. 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ధోని(87 నాటౌట్: 114 బంతులు,6 ఫోర్లు)కి ఆసీస్ ఆటగాళ్లు రెండు సార్లు అవకాశం ఇచ్చారు. తొలి బంతికే ధోని ఇచ్చిన సునాయస క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్ జారవిడచగా.. మరోసారి అప్పిల్ చేయకుండా తగిన మూల్యం చెల్లించుకున్నారు. సిడిల్ వేసిన 39వ ఓవర్‌లో బంతి ధోని బ్యాట్‌కు ఎడ్జై కీపర్ అలెక్స్ క్యారీ చేతిలో పడింది. కానీ ఆసీస్ ఫీల్డర్లు పెద్దగా అప్పీల్ చేయకపోవడంతో ధోని బతికిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment