
నాకు అన్యాయం జరిగింది!
సాక్షి, హైదరాబాద్: ఆ అమ్మాయి ఆర్చరీలో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి... ప్రపంచ ర్యాంకింగ్స్‌లో (కాంపౌండ్ విభాగం) 22వ స్థానంలో ఉంది... కానీ ఇప్పుడు ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టులో కూడా చోటు దక్కలేదు. ప్రతిభను పట్టించుకోకుండా వ్యక్తిగత ద్వేషంతో తనను పోటీలకు దూరంగా ఉంచారని వెన్నం జ్యోతి సురేఖ ఆరోపించింది. తన తండ్రి సురేందర్ కుమార్‌తో కలిసి ఆమె గురువారం ఇక్కడ మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఆర్చరీ సంఘంపై ఆమె విమర్శలు చేసింది.
సురేఖ చెప్పిన వివరాల ప్రకారం...ఈ నెల 4న విజయవాడలో కృష్ణా జిల్లా ఆర్చరీ జట్టు సెలక్షన్స్ ఏర్పాటు చేశారు. జిల్లా ఒలింపిక్ సంఘం, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో పాటు కృష్ణా జిల్లా ఆర్చరీ సంఘం ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు. దీనికి జ్యోతి సురేఖ కూడా హాజరైంది. అయితే కృష్ణా జిల్లా ఆర్చరీ సంఘంలో సభ్యత్వం లేదని కారణంతో ఆమెను పరిశీలనలోకి తీసుకోలేదు. ‘అందులో సభ్యత్వం తీసుకునేందుకు ఒక అంగీకార పత్రంపై సంతకం చేయమని నన్ను కోరారు. నా వ్యక్తిగత, క్రీడా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా అందులో నిబంధనలు ఉన్నాయి.
వారు చెప్పిన చోటే శిక్షణ తీసుకోవాలని, వారి ద్వారానే పోటీల్లో పాల్గొనాలని, ఇతర ఆటగాళ్లతో మాట్లాడరాదంటూ అర్ధం లేని షరతులు ఉండటంతో సంతకం చేయలేదు. దాంతో నన్ను వేధిస్తూ టీమ్‌కు ఎంపిక చేయలేదు’ అని సురేఖ వెల్లడించింది. అయితే తన గత రికార్డును దృష్టిలో ఉంచుకొని గురువారం హైదరాబాద్‌లోని ఏపీ స్పోర్ట్స్ స్కూల్‌లో జరిగిన రాష్ట్ర జట్టు ఎంపికకు హాజరయ్యేందుకు వెళితే వారూ పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఈ నెల 22నుంచి జార్ఖండ్‌లో సీనియర్ నేషనల్స్‌లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిద్దామనుకున్నాను. అక్కడ ఆడకపోతే వచ్చే ఆసియా క్రీడల సెలక్షన్స్‌పై ప్రభావం పడుతుంది. అయితే జిల్లా జట్టులో పేరు లేదు కాబట్టి, ఇక్కడా నన్ను పరిశీలించలేదు’ అని ఆమె చెప్పింది. ఈ విషయాన్ని ‘శాప్’, ఏపీ ఒలింపిక్ సంఘం, ఏపీ ఆర్చరీ సంఘం దృష్టికి తెచ్చానని, తనకు న్యాయం చేయాలని సురేఖ కోరింది.
ఖండించిన కృష్ణాజిల్లా సంఘం
ఆర్చర్ జ్యోతి సురేఖ ఆరోపణలను కృష్ణా జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ తోసి పుచ్చారు. సాధారణంగా అన్ని క్రీడా సంఘాల్లో ఉండే నిబంధనలే సదరు పత్రంలో ఉన్నాయని, ఆమె పట్ల ఎలాంటి వివక్షా లేదని ఆయన అన్నారు. జిల్లా జట్టు సెలక్షన్స్‌కు ఆమె అసలు హాజరు కానే లేదని సత్యనారాయణ చెప్పారు. భారత నంబర్‌వన్ అయితే నేరుగా ఎంపిక చేయవచ్చనే నిబంధన ఎక్కడా లేదన్నారు.