జ్యోతి చేరింది... ఆట మిగిలింది
ఇంచియాన్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల రిలే టార్చ్ ఆతిథ్య నగరం ఇంచియాన్‌కు బుధవారం చేరుకుంది. శుక్రవారం రాత్రి జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరో రోజు మిగిలి ఉండగానే
దాదాపుగా ముగిసిన ఆసియా క్రీడల కౌంట్‌డౌన్
ఇంచియాన్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల రిలే టార్చ్ ఆతిథ్య నగరం ఇంచియాన్‌కు బుధవారం చేరుకుంది. శుక్రవారం రాత్రి జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరో రోజు మిగిలి ఉండగానే ఇక్కడికి తీసుకురావడంతో గేమ్స్ కౌంట్‌డౌన్ దాదాపుగా ముగిసింది. దక్షిణ కొరియా అంతటా సుమారు ఆరు వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ జ్యోతిని రాజధాని సియోల్‌లో భద్రపర్చనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గంగ్నమ్ స్టైల్ సింగర్ పీఎస్‌వై, చైనీస్ పియానిస్ట్ లాంగ్ లాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నా ఉత్తర కొరియా ఫుట్‌బాల్ జట్టును దక్షిణ కొరియా అభిమానులు బాగా ప్రోత్సహిస్తున్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో ఉత్తర కొరియా జాతీయ జెండాను ఎగురవేయడంపై దక్షిణ కొరియా నిషేధం విధించింది. కేవలం ఆసియా గేమ్స్ అధికారిక వేదికల్లో మాత్రమే ఈ జెండాను ఎగరవేస్తున్నారు. రియో ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా మేటి అథ్లెట్లు ఈ క్రీడల్లో బరిలోకి దిగుతున్నారు. మొత్తం 42 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. చైనా అత్యధిక సంఖ్యలో 900 మంది అథ్లెట్ల బృందాన్ని పంపించగా, టినీ బ్రూనై కేవలం 11 మందినే పోటీలకు పంపింది.
జపాన్ గెలుపు
ఆసియా గేమ్స్‌లో ఫుట్‌బాల్ పోటీలు ఆదివారమే మొదలయ్యాయి. పురుషుల డిఫెండింగ్ చాంపియన్ జపాన్... కువైట్‌పై గెలిచి తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తర్వాతి మ్యాచ్‌లో జపాన్... ఇరాక్‌తో తలపడుతుంది. ఇరాక్ 4-0తో నేపాల్‌పై గెలిచి ఈ టోర్నీలో శుభారంభం చేసింది.