కరీంనగర్‌లో కబడ్డీ కూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ (టీపీకే) పోటీలు నేటి (గురువారం) నుంచి కరీంనగర్‌లో జరుగనున్నాయి. జనవరి 21 నుంచి 30 వరకు వరంగల్‌లో జరిగిన తొలి అంచె పోటీలకు క్రీడాభిమానుల నుంచి మంచి స్పందన రావడంతో కరీంనగర్‌లో రెండో అంచె పోటీలను నిర్వహిస్తున్నారు. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లో రెండో అంచె కబడ్డీ జట్ల పరిచయ కార్యక్రమాన్ని కబడ్డీ లీగ్ యజమాని ప్రవీణ్ రెడ్డి నిర్వహించారు.
మొత్తం 8 జిల్లాలకు చెందిన జట్లు ఈ లీగ్‌లో తలపడనున్నాయి. కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయి. రెండో అంచె పోటీల్లో భాగంగా గద్వాల్ గ్లాడియేటర్స్, హైదరాబాద్ బుల్స్, కరీంనగర్ కింగ్‌స, ఖమ్మం చీతాస్, నల్గొండ ఈగల్స్, రంగారెడ్డి రైడర్స్, సిద్ధిపేట స్టాలిన్‌స, వరంగల్ వారియర్స్ జట్లు పాల్గొంటున్నారు.
ఈ జట్లకు వరుసగా పి. మల్లికార్జున్, మహేంద్ర రెడ్డి, జి. మల్లేశ్, లక్ష్మీనారాయణ, ఎన్. శివరామకృష్ణ, బి. విఘ్నయ్ యాదవ్, సతీశ్ కుమార్, మొహమ్మద్ అక్రమ్ ఖాన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా లీగ్ యజమాని, చింతల స్పోర్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ... కేవలం జిల్లా స్థాయిలోని ఆటగాళ్లను ప్రోత్సహించడమే కాకుండా ఈ ఆటను ఆస్వాదిస్తున్న అభిమానులను సంతృప్తిపరచడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రవీణ్ రెడ్డి యునెటైడ్ బాస్కెట్‌బాల్ లీగ్‌కు 2015 నుంచి డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో రంగారెడ్డి రైడర్స్‌తో గద్వాల్ గ్లాడియేటర్స్, కరీంనగర్ కింగ్స్ తో సిద్ధిపేట స్టాలిన్స్ తలపడతాయి.