kabaddi tourny
-
కరీంనగర్లో కబడ్డీ కూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ (టీపీకే) పోటీలు నేటి (గురువారం) నుంచి కరీంనగర్లో జరుగనున్నాయి. జనవరి 21 నుంచి 30 వరకు వరంగల్‌లో జరిగిన తొలి అంచె పోటీలకు క్రీడాభిమానుల నుంచి మంచి స్పందన రావడంతో కరీంనగర్లో రెండో అంచె పోటీలను నిర్వహిస్తున్నారు. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లో రెండో అంచె కబడ్డీ జట్ల పరిచయ కార్యక్రమాన్ని కబడ్డీ లీగ్ యజమాని ప్రవీణ్ రెడ్డి నిర్వహించారు. మొత్తం 8 జిల్లాలకు చెందిన జట్లు ఈ లీగ్‌లో తలపడనున్నాయి. కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయి. రెండో అంచె పోటీల్లో భాగంగా గద్వాల్ గ్లాడియేటర్స్, హైదరాబాద్ బుల్స్, కరీంనగర్ కింగ్స, ఖమ్మం చీతాస్, నల్గొండ ఈగల్స్, రంగారెడ్డి రైడర్స్, సిద్ధిపేట స్టాలిన్స, వరంగల్ వారియర్స్ జట్లు పాల్గొంటున్నారు. ఈ జట్లకు వరుసగా పి. మల్లికార్జున్, మహేంద్ర రెడ్డి, జి. మల్లేశ్, లక్ష్మీనారాయణ, ఎన్. శివరామకృష్ణ, బి. విఘ్నయ్ యాదవ్, సతీశ్ కుమార్, మొహమ్మద్ అక్రమ్ ఖాన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా లీగ్ యజమాని, చింతల స్పోర్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ... కేవలం జిల్లా స్థాయిలోని ఆటగాళ్లను ప్రోత్సహించడమే కాకుండా ఈ ఆటను ఆస్వాదిస్తున్న అభిమానులను సంతృప్తిపరచడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రవీణ్ రెడ్డి యునెటైడ్ బాస్కెట్‌బాల్ లీగ్‌కు 2015 నుంచి డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో రంగారెడ్డి రైడర్స్‌తో గద్వాల్ గ్లాడియేటర్స్, కరీంనగర్ కింగ్స్ తో సిద్ధిపేట స్టాలిన్స్ తలపడతాయి. -
నార్తర్న్ రీజియన్‌కు టైటిల్
సాక్షి, హైదరాబాద్: సదరన్ రీజియన్ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ రీజియన్ కబడ్డీ టోర్నమెంట్లో నార్తర్న్ రీజియన్ సత్తా చాటింది. యూసుఫ్‌గూడలోని కేవీబీఆర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఫైనల్లో నార్నర్న్ రీజియన్-2 విజేతగా నిలిచింది. దేశవ్యాప్తంగా పలు రీజియన్లకు చెందిన 120 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో నార్తర్న్ రీజియన్-1 రన్నరప్‌గా నిలవగా... వెస్ట్రన్ రీజియన్ మూడో స్థానంతో సంతృప్తిపడింది. మొత్తం మూడు రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరిగింది. -
సెమీస్‌లో ఎస్సీఆర్, ఎస్బీఐ
ఇంటర్ డిపార్ట్మెంటల్ కబడ్డీ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: వార్షిక ఎ- లీగ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఎస్సీఆర్, ఎస్బీఐ, ఇన్కమ్ ట్యాక్స్, ‘సాయ్’ ఎస్టీసీ జట్లు సెమీస్‌లోకి ప్రవేశించాయి. ఎల్బీ స్టేడియంలోని కబడ్డీ గ్రౌండ్సలో శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఎస్సీఆర్ జట్టు 25-9 తో ఇన్కమ్ ట్యాక్స్ జట్టుపై అలవోకగా విజయాన్ని సాధించి సెమీఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో ఎస్సీఆర్ జట్టు తరఫున రైడింగ్‌లో మల్లికార్జున, ఎస్కే అమీర్ రైడింగ్‌లో సత్తా చాటగా... ఇన్కమ్ ట్యాక్స్ జట్టులో మల్లేశ్ రాణించాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఎస్బీఐ జట్టు 18-14తో ఆర్టిలరీ సెంటర్‌పై, ఇన్కమ్ ట్యాక్స్ జట్టు 40-15తో హెచ్ఏఎల్ జట్టుపై విజయం సాధించాయి. -
దక్షిణ మధ్య రైల్వేకే టైటిల్
బృహత్ బెంగళూరు మహానగర కబడ్డీ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: బృహత్ బెంగళూరు మహానగర ఆలిండియా ఏ- గ్రేడ్ కబడ్డీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్షిణ మధ్య రైల్వే మహిళల జట్టు కైవసం చేసుకుంది. అంతర్ రైల్వేస్ టోర్నమెంట్లో భాగంగా బెంగళూరులో ఆగస్టు 28న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) 23-13తో వెస్టర్న్ రైల్వేస్ జట్టుపై నెగ్గింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఎస్సీఆర్ 12-8తో ఎస్ఎంసీ జట్టుపై గెలుపొందింది. ఈ టోర్నీలో ఆద్యంతం రాణించిన తేజస్వినికి బెస్ట్ ఆల్‌రౌండర్ అవార్డు లభించగా... పింకీ రాయ్‌కి బెస్ట్ క్యాచర్ ప్రైజ్ లభించింది. టైటిల్ సాధించిన జట్టు క్రీడాకారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా అభినందించారు.