
'అతని వల్లే మా క్రికెట్ నాశనమైంది'
కొలంబో:పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లలో ఒకడైన వకార్ యూనిస్ పై ఆ దేశానికే చెందిన మరో క్రికెటర్ కమ్రాన్ అక్మాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ తిరోగమనంలో పయనించడానికి వకారే ప్రధాన కారణమంటూ అక్మాల్ ధ్వజమెత్తాడు. రెండుసార్లు పాకిస్తాన్ కోచ్ గా పని చేసిన వకార్ వల్ల తమ ఆటకు జరిగిన మేలు ఏమిలేకపోగా, సర్వనాశనం చేశాడంటూ అక్మల్ విమర్శలు గుప్పించాడు.
'వకార్ ఒక ఫెయిల్యూర్ కోచ్. అదే క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ నాశనం కావడానికి కూడా కారణమయ్యాడు. పాకిస్తాన్ క్రికెట్ ను మూడేళ్లు వెనక్కినెట్టాడు. అతనికి వేరే ఆటగాళ్లతో విభేదాల గురించి నాకైతే తెలీదు. అసలు పాకిస్తాన్ క్రికెట్ ను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై వకార్ కు ఎప్పుడూ ప్రణాళికలు లేవు. 2015 వరల్డ్ కప్ లో యూనిస్ ఖాన్ ను ఓపెనింగ్ చేయమనడమే వకార్ వద్ద ప్రణాళికలు లేవనడానికి ఒక ఉదాహరణ.
మరొకవైపు ఆసియా కప్ కు సంబంధించి ఒక మ్యాచ్ లో ఉమర్ అక్మల్ సెంచరీ చేస్తే, ఆ తరువా మ్యాచ్ లో అతన్ని బ్యాటింగ్ ఆర్డర్ ను మరింత కిందకి నెట్టాడు. ఎవరితో విభేదాల కారణంగా ఇలా చేసాడో నాకైతే తెలీదు...కానీ పాకిస్తాన్ క్రికెట్ ను మాత్రం వకార్ నాశనం చేశాడు. ఆటగాడిగా వకార్ గొప్పవాడు కావొచ్చు.. కోచ్ గా మాత్రం ఫెయిల్యూర్'అని కమ్రాన్ అక్మల్ విమర్శించాడు.పాకిస్తాన్ కోచ్ వకార్ యూనిస్ రెండుసార్లు పనిచేసిన సంగతి తెలిసిందే. 2010 నుంచి 2011 వరకూ, 2014 నుంచి 2016 వరకూ వకార్ కోచ్ గా పాక్ కు సేవలందించాడు.