సాక్షి, పుణే: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనిని టీ20ల నుంచి తప్పుకోవాలనే వ్యాఖ్యలను మాజీ కెప్టన్ కపిల్‌దేవ్ తప్పుబట్టాడు. ధోని తప్పుకుంటే అతని స్థానం ఎవరు భర్తీ చేయగలరని విమర్శకులను ప్రశ్నించారు. పుణేలో జరిగిన ఓ స్పోర్ట్స్ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ దేవ్ 2020 టీ20 వరల్డ్ కప్‌లో ధోని కీలక పాత్ర పోషిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
‘కొన్నిమ్యాచ్‌ల ధోని బ్యాటింగ్ యావరేజ్‌ను ప్రస్తావిస్తు కొందరూ ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్ధం కావట్లేదు. ఈ విమర్శలకు వయసు ఎంత మాత్రం కారణం కాదు. సచిన్ 38వ ఏట భారత్ ప్రపంచకప్ గెలిచింది. దీనిపై ఎవరూ మాట్లాడరూ.. ఒకవేళ ధోనిపై వేటు వేస్తే అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు? ధోని ఓ అద్బుత ఆటగాడని అతని స్థానం ఎవరు భర్తీ చేయలేరని కపిల్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. కొన్ని మ్యాచ్‌ల్లో ధోని రాణించలేకపోయినా కెప్టెన్ కోహ్లిని వెనుకుండి నడిపించాడన్నాడు.
ఇక హర్దీక్‌పాండ్యాను అతని టాలెంటే నాకన్న గొప్ప క్రికెటర్‌ను చేస్తుందని కితాబిచ్చాడు. అశ్విన్, జడేజాల గురించి ప్రస్తావిస్తూ.. భారత జట్టులో సీనియారిటీకి ప్రాధాన్యత లేదు. ప్రదర్శనను బట్టే జట్టు ఎంపిక ఉంటుంది. కుల్‌దీప్, చాహల్ విషయంలో కూడా అదే జరిగింది. లిమిటెడ్ ఫార్మట్‌లో ఈ ఇద్దరూ అద్బుతంగా రాణిస్తున్నారని కపిల్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి, సీనియర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌లు ధోనికి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment