కలర్ ఫుల్ షో
► ఆకట్టుకున్న ఐపీఎల్ ప్రారంభ వేడుకలు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొమ్మిదో సీజన్‌కు అట్టహాసంగా తెర లేచింది. నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌సీఐ)లో లేజర్ కాంతుల మధ్య ఐపీఎల్ ప్రారంభ కార్యక్రమం శుక్రవారం జరిగింది. బాలీవుడ్ అందాల తారలు కత్రినా కైఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తమ నృత్యాలతో జోష్‌ను నింపగా.. పంజాబీ ర్యాప్ సింగర్ యోయో హనీ సింగ్‌తో పాటు వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ డ్వేన్ బ్రేవో తన చాంపియన్ పాటను మరోసారి ప్రేక్షకులకు వినిపించాడు. ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలోనే అభిమానులు హాజరుకాగా ఎనిమిది జట్లకు చెందిన ఆటగాళ్లు, సిబ్బంది, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు.
ఇక నేటి (శనివారం) నుంచి 51 రోజుల పాటు జరిగే ధనాధన్ సందడికి అభిమానులు సిద్ధం కావడమే తరువాయి..
►ముందుగా సింహాసనంలాంటి కుర్చీపై ఆసీనురాలైన జాక్వెలిన్ ఫెర్నాండె జ్ రాకతో కార్యక్రమం ప్రారంభమైంది. మెటాలిక్ మాస్క్‌లు వేసుకున్న డ్యాన్సర్లతో కలిసి తను పలు హిందీ పాటలకు నృత్యం చేసింది.
►ఆ తర్వాత డప్పు వాయిద్య కళాకారులు తమ ప్రతిభ చూపగా.. ప్రపంచ హిప్ హాప్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన కింగ్స్ యునెటైడ్ బృందం తమ ఆక్రోబాట్ విన్యాసాలతో ఓహో అనిపించింది.
►అనంతరం రవిశాస్త్రి ఐపీఎల్‌లోని ఎనిమిది జట్ల కెప్టెన్లను వేదికపైకి ఆహ్వానించారు. ఆయా రాష్ట్ర కళాకారులు తమ ప్రదర్శనతో ఒక్కో కెప్టెన్‌ను వెంటతీసుకుని వచ్చారు.
►చివర్లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ రాగానే పైనుంచి తాడుతో ఐపీఎల్ ట్రోఫీని కిందికి పంపారు. వెంటనే దాన్ని అందుకున్న తను ఆవిష్కరించాడు.
►లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా పరిచయ ఉపన్యాసం చేశారు. ఐపీఎల్ ఎంతగా విజయవంతమైందో తెలుపుతూ ఈసారి కూడా అందరినీ అలరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
►ఎంసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్‌లో భాగంగా ఆటగాళ్లు డిజిటల్ వైట్ బోర్డుపై సంతకాలు చేశారు. జహీర్ ఖాన్ ముందుగా వెళ్లగా తర్వాత మిగిలిన వారు వరుసగా చేశారు.
►అనంతరం మరోసారి ఆరంభమైన వినోద కార్యక్రమాల్లో.. ఓ పెద్ద వాటర్‌మెలన్ ఆకారంపై వేదిక చుట్టూ తిరుగుతూ ఒక్కసారిగా ప్రత్యక్షమైన కత్రినా కైఫ్ రాకతో జోష్ పెరిగింది. ధూమ్ సినిమా టైటిల్ సాంగ్‌తో పాటు ఇతర బాలీవుడ్ నంబర్స్‌కు తనదైన శైలిలో చిందులు వేసింది.
►కత్రినా షో తర్వాత విండీస్ బ్యాట్స్‌మన్ డ్వేన్ బ్రేవో తన చాంపియన్ పాటతో పాటు చిన్నపాటి స్టెప్పులేస్తూ పాప్ సింగర్ అవతారమెత్తాడు. తనకు జతగా సింగర్ అంకిత్ తివారి కూడా పాల్గొన్నాడు.
►యోయో హనీ సింగ్ తన పాటలతో ఆకట్టుకున్నాడు.
►రూఫ్ నుంచి క్రికెట్ గ్లోవ్స్, ప్యాడ్లు, హెల్మెట్ ధరించి చేతిలో బ్యాట్‌తో కిందికి దిగిన బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్‌సింగ్ ఆకర్షించాడు. వేదికపైనే కాకుండా కిందికి దిగి ప్రేక్షకులతో కలిసి డ్యాన్స్ చేయడంతో పాటు బాజీరావు వేషధారణతో సింహనాదం చేశాడు.
►చివర్లో అమెరికన్ మ్యూజిక్ గ్రూప్ మేజర్ లేజర్ తమ ప్రపంచ ప్రఖ్యాత ‘లీన్ ఆన్’ సాంగ్‌ను పాడి హోరెత్తించారు.