కేదార్ మెరుపులు
64 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 113
ఢిల్లీపై మహారాష్ట్ర గెలుపు
కటక్: కెప్టెన్ కేదార్ జాదవ్ వీరవిహారం చేయడంతో... విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో భాగంగా ఢిల్లీతో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో మహా రాష్ట్ర 195 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 50 ఓవర్లలో 8 వికెట్లకు 367 పరుగులు చేసింది. భారత క్రికెటర్ కేదార్ జాదవ్ 64 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో చెలరేగి 113 పరుగులు సాధించాడు. అనంతరం ఢిల్లీ జట్టు 33.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. మహారాష్ట్ర స్పిన్నర్ జగదీశ్ 19 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి ఢిల్లీని దెబ్బతీశాడు.
సౌరభ్, ఇషాంక్ జగ్గీ సెంచరీలు...
మరోవైపు కోల్‌కతాలో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ధోని సారథ్యంలోని జార్ఖండ్ జట్టు ఏడు వికెట్లతో సర్వీసెస్‌ను ఓడించింది. తొలుత సర్వీసెస్ 9 వికెట్లకు 276 పరుగులు చేసింది. జార్ఖండ్ 46.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 279 పరుగలు చేసి నెగ్గింది. సౌరభ్ తివారి (102 నాటౌట్; 3 ఫోరుల, 6 సిక్స్‌లు), ఇషాంక్ జగ్గీ (116 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజే య సెంచరీలు చేశారు.
ముదస్సిర్, కమలేశ్ హ్యాట్రిక్...
గుజరాత్‌తో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ జట్టుకు చెందిన 17 ఏళ్ల మీడియం పేసర్ కమలేశ్ నాగర్‌కోటి ‘హ్యాట్రిక్’తో తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రాజస్తాన్ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 43.1 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. కమలేశ్ ఇన్నింగ్స్ 39వ ఓవర్‌లోని రెండు, మూడు, నాలుగు బంతులపై దహియా, పర్మార్, బుమ్రాలను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో జమ్ము కశ్మీర్ బౌలర్ ముదస్సిర్ (6/33) ‘హ్యాట్రిక్’ తీసుకున్నా ఆ జట్టు 4 పరుగుల తేడాతో ఓడింది. మొదట ఛత్తీస్‌గఢ్ తొమ్మిది వికెట్లకు 235 పరుగులు చేసింది. 48వ ఓవర్‌లో తొలి మూడు బంతులకు అశుతోష్ సింగ్, శుభమ్ అగర్వాల్, రోహిత్ ధ్రువ్‌లను అవుట్ చేసి ముదస్సిర్ హ్యాట్రిక్ నమోదు చేయడం విశేషం. అనంతరం జమ్ము కశ్మీర్ జట్టు 48.2 ఓవర్లలో 231 పరుగులవద్ద ఆలౌటై ఓడిపోయింది.