
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ పేరును కేంద్ర పౌర పురస్కారం ‘పద్మశ్రీ’కు సిఫారసు చేశారు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శ్రీకాంత్ నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలవడంతోపాటు మరో సూపర్ సిరీస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. ‘పద్మశ్రీ’ పురస్కారాల కోసం పేర్లు పంపించేందుకు గడువు సెప్టెంబరు 15వ తేదీతోనే ముగిసినప్పటికీ... కేంద్ర మాజీ క్రీడల మంత్రి విజయ్ గోయల్ ప్రత్యేక చొరవ తీసుకొని శ్రీకాంత్ పేరును పరిశీలించాలని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు.
‘దేశంలోని యువతరానికి శ్రీకాంత్ ఆదర్శప్రాయుడు. ఈ ఏడాది అతను సాధిస్తున్న విజయాలు ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తాయి. మాజీ క్రీడల మంత్రి హోదాలో నన్ను చాలా మంది సంప్రదించి శ్రీకాంత్ పేరును పద్మశ్రీకి నామినేట్ చేయాలని కోరారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని శ్రీకాంత్ పేరును నేను ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారానికి ప్రతిపాదించాను’ అని గోయల్ తెలిపారు.