పంజాబ్ కింగ్స్ బోణీ
ఐపీఎల్ తాజా సీజన్‌లో తొలి రెండు పరాజయాల అనంతరం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ విజయాల బోణీ చేసింది. పటిష్ట రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌పై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మొదట పైచేయి సాధించిన కింగ్స్... ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ పవర్ చూపెట్టడంతో జట్టుకు తొలి విజయం దక్కింది. అటు ధోని సేన వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది.
* రైజింగ్ పుణేపై విజయం
* విజయ్, వోహ్రా అర్ధ సెంచరీలు
* డు ప్లెసిస్ శ్రమ వృథా
మొహాలీ: ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు మురళీ విజయ్ (49 బంతుల్లో 53; 5 ఫోర్లు; 2 సిక్సర్లు), మనన్ వోహ్రా (33 బంతుల్లో 51; 7 ఫోర్లు) సూపర్ అర్ధ సెంచరీలతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఐపీఎల్-9లో తొలి విజయాన్ని అందుకుంది. ఆదివారం ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌పై 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది.
డు ప్లెసిస్ (53 బంతుల్లో 67; 8 ఫోర్లు), స్టీవెన్ స్మిత్ (26 బంతుల్లో 38; 5 ఫోర్లు) మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. మోహిత్ శర్మకు మూడు, సందీప్ శర్మకు రెండు వికెట్లు పడ్డాయి. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. మురుగన్ అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కాయి.
డు ప్లెసిస్ ఒంటరి పోరాటం
టాస్ నెగ్గి బ్యాటింగ్ తీసుకున్న రైజింగ్ పుణేకు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ రహానే (9) మూడో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. ఈ దశలో డు ప్లెసిస్, పీటర్సన్ (15 బంతుల్లో 15; 2 ఫోర్లు) కొద్దిసేపు ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. నాలుగో ఓవర్‌లో పీటర్సన్ రెండు ఫోర్లు, డు ప్లెసిస్ ఓ ఫోర్ బాదడంతో 14 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో పీటర్సన్ ఐపీఎల్‌లో వెయ్యిపరుగులు పూర్తి చేసిన కొద్ది సేపటికే అవుటయ్యాడు. రెండో వికెట్‌కు వీరి మధ్య 55 పరుగులు జత చేరాయి.
అనంతరం మధ్య ఓవర్లను పంజాబ్ బౌలర్లు నియంత్రించడంతో పుణేకు పరుగులు తీయడం కష్టమైంది. డు ప్లెసిస్ 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 17వ ఓవర్‌లో స్మిత్ మూడు ఫోర్లు బాదడంతో స్కోరు బోర్డులో కాస్త కదలిక వచ్చింది. ఆ తర్వాత ఓవర్‌లోనే అతను అవుట్‌కాగా చివరి ఓవర్‌ను మోహిత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి వరుస బంతుల్లో డు ప్లెసిస్, ధోని (1)ని అవుట్ చేశాడు. ఈ ఓవర్‌లో అతను కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. పుణే ఇన్నింగ్స్ మొత్తంలో ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు. ఇది ఐపీఎల్ రికార్డు.
ఓపెనింగ్ అదుర్స్
పంజాబ్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు విజయ్, వోహ్రా వేగంగా ఆరంభించారు. రెండో ఓవర్‌లో రెండు ఫోర్లతో పాటు 3వ ఓవర్‌లో మ్యాచ్‌లో తొలి సిక్స్‌ను విజయ్ బాదాడు. ఇక ఐదో ఓవర్‌లో వోహ్రా హ్యాట్రిక్ ఫోర్లతో రెచ్చిపోయాడు. దీంతో పవర్‌ప్లేలో 50 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత నాలుగు ఓవర్ల పాటు పుణే బౌలర్లు బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టగా ఆచితూచి ఆడారు. దీంతో ఇందులో ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. అయితే 11వ ఓవర్‌లో వోహ్రా విజృంభించి వరుసగా మూడు ఫోర్లు బాదాడు.
ఈ జోరుతో తను 31 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. అంకిత్ శర్మ బౌలింగ్‌లో అనవసర స్వీప్ షాట్‌కు యత్నించి బౌల్డయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 97 పరుగులు భారీ భాగస్వామ్యం ముగిసింది. కొద్దిసేపటికే మురుగన్ అశ్విన్ తన ఓవర్‌లో మార్ష్, విజయ్‌ను అవుట్ చేశాడు. అయితే చివర్లో మ్యాక్స్‌వెల్ (14 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు; 2 సిక్సర్లు)ధాటిగా ఆడడంతో పంజాబ్ ఇబ్బందిపడకుండా మ్యాచ్‌ను ముగించింది.
స్కోరు వివరాలు
రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (బి) సందీప్ శర్మ 9; డు ప్లెసిస్ (సి అండ్ బి) మోహిత్ 67; పీటర్సన్ (సి) వోహ్రా (బి) అబాట్ 15; పెరీరా (సి) మోహిత్ (బి) సందీప్ శర్మ 8; స్మిత్ (సి) మిల్లర్ (బి) మోహిత్ 38; ధోని (సి) మ్యాక్స్‌వెల్ (బి) సందీప్ శర్మ 1; ఇర్ఫాన్ నాటౌట్ 1; అశ్విన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 11; మొత ్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 152.
వికెట్ల పతనం: 1-10, 2-65, 3-76, 4-139, 5-149, 6-149, 7-152.
బౌలింగ్: సందీప్ శర్మ 4-0-23-2; అబాట్ 4-0-38-1; అక్షర్ 3-0-26-0; సాహు 4-0-31-0; మోహిత్ శర్మ 4-0-23-3; మ్యాక్స్‌వెల్ 1-0-3-0.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ (సి) ధోని (బి) ఎం.అశ్విన్ 53; వోహ్రా ఎల్బీడబ్ల్యు (బి) అంకిత్ 51; షాన్ మార్ష్ (బి) ఎం.అశ్విన్ 4; మిల్లర్ (సి) పీటర్సన్ (బి) ఎం.అశ్వి న్ 7; మ్యాక్స్‌వెల్ నాటౌట్ 32; సాహా నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్త్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 153.
వికెట్ల పతనం: 1-97, 2-103, 3-112, 4-119.
బౌలింగ్: ఇషాంత్ 3-0-26-0; అంకిత్ 4-0-27-1; అశ్విన్ 4-0-27-0; ఎం.అశ్విన్ 4-0-36-3; ఇర్ఫాన్ 1-0-7-0; పెరీరా 2.4-0-30-0.