కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ ఈడెన్ గార్డెన్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్తాన్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ నాలుగు వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలో ఛేదించింది. కోల్‌కతా బ్యాటింగ్‌లో క్రిస్ లిన్(45), దినేశ్ కార్తీక్(41 నాటౌట్; 31 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్), సునీల్ నరైన్(21; 7బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), నితీశ్ రాణా(21; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్)లు మెరిసి జట్టుకు విజయాన్ని అందించారు. ఫలితంగా ఏడో విజయాన్ని నమోదు చేసిన కేకేఆర్ ప్లేఆఫ్‌కు చేరువగా వచ్చింది.
ఈ మ్యాచ్‌లో సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో కోల్‌కతా ఇన్నింగ్స్‌ను సునీల్ నరైన్ దూకుడుగా ఆరంభించాడు. తొలి ఓవర్‌లోనే 21 పరుగులు సాధించి కేకేఆర్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే రెండో ఓవర్‌లో నరైన్(21) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్‌లో వచ్చిన రాబిన్ ఉతప్ప(4) నిరాశపరిచాడు. ఆ తరుణంలో క్రిస్ లిన్‌తో జత కలిసిన నితీశ్ రాణా ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టాడు. ఈ జోడి మూడో వికెట్‌కు 33 పరుగులు జత చేసిన తర్వాత నితీశ్ రాణా ఔటయ‍్యాడు. ఆపై దినేశ్ కార్తీక్‌తో కలిసి 48 పరుగులు జత చేసిన తర్వాత లిన్ పెవిలియన్ చేరడంతో కేకేఆర్ 117 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను నష్టపోయింది. ఇక మ్యాచ్‌ను కార్తీక్-రస్సెల్(11 నాటౌట్; 5 బంతుల్లో 2 ఫోర్లు)లు మరో వికెట పడకుండా ఆడి ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగా జట్టుకు విజయాన్ని అందించారు.
అంతకుముందు రాజస్తాన్ రాయల్స్ 19 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ స్సిన్నర్ కుల్దీప్ యాదవ్ విజృంభించి బౌలింగ్ చేయడంతో రాజస్తాన్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. తన నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటాలో కుల్దీప్ 20 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లతో రాజస్తాన్‌ను దెబ్బ తీశాడు. అతనికి జతగా ఆండ్రీ రస్సెల్, ప్రసిధ్ కృష్ణలు చెరో రెండు వికెట్లు సాధించగా, మావి, సునీల్ నరైన్ తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి తొలుత బ‍్యాటింగ్ చేపట్టిన రాజస్తాన్‌కు శుభారంభం లభించింది. రాజస్తాన్ ఓపెనర్లు రాహుల్ త్రిపాఠి, జోస్ బట్లర్‌లు ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. వీరిద్దరూ కలిసి 4.5 ఓవర్లలో 63 పరుగులు జత చేసిన తర్వాత రాహుల్ త్రిపాఠి(27;15 బంతుల్లో4 ఫోర్లు, 1 సిక్సర్) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆపై మరో 13 పరుగుల వ్యవధిలో అజింక్యా రహానే(11) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. కాసేపటికి బట్లర్(39; 22 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) నిష్ర్కమించడంతో రాజస్తాన్ 85 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇక అటు తర్వాత రాజస్తాన్ రాయల్స్ ఏ దశలోనూ తేరుకోలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ అందివచ్చిన చక్కటి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. సంజూ శాంసన్(12), స్టువర్ట్ బిన్నీ(1), గౌతమ్(3), స్టోక్స్(11)లు ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరారు. ఇక చివర్లో ఉనాద్కత్(26;18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) ఫర‍్వాలేదనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment