
కేఎల్ రాహుల్ రికార్డుల మోత!
మూడు వన్డేల సిరీస్లో భాగంగా జింబాబ్వేతో శనివారం జరిగిన తొలి వన్డేలో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ రికార్డులు మోతెక్కించాడు.
హరారే: మూడు వన్డేల సిరీస్లో భాగంగా జింబాబ్వేతో శనివారం జరిగిన తొలి వన్డేలో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ రికార్డులు మోతెక్కించాడు. తన అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీ సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రాహుల్ సరికొత్త ఫీట్ను నమోదు చేశాడు. తొలుత 58 బంతుల్లో అర్థశతకాన్ని సాధించిన కేఎల్ రాహుల్.. మొత్తం 115 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తిచేశాడు.
ఆద్యంతం నిలకడను ప్రదర్శించిన రాహుల్.. అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు. టీమిండియా విజయానికి కేవలం రెండు పరుగులు మాత్రమే అవసరమైన తరుణంలో సిక్సర్ కొట్టి రాహుల్ సెంచరీ సాధించాడు. తద్వారా తన మొదటి వన్డేలో సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రాహుల్ రికార్డును నమోదు చేశాడు. అంతకుముందు 2006 లో ఇండోర్ లో ఇంగ్లండ్ తో జరిగిన వన్డేలో రాబిన్ ఊతప్ప తన తొలి వన్డేలో నమోదుచేసిన రికార్డు తెరమరుగైంది. ఆ మ్యాచ్లో ఉతప్ప ఓపెనర్ గా వచ్చి 86 పరుగులు చేశాడు. ఆ ఘనతను దాదాపు పదేళ్ల తర్వాత కేఎల్ రాహుల్ సవరించడమే కాకుండా, అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన ఓపెనర్ గా, బ్యాట్స్ మెన్ గా రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేఎల్ రాహుల్ (100 నాటౌట్;115 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్స్) శతకంతో రాణించగా, అంబటి రాయుడు (62 నాటౌట్;120 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.