'కోహ్లి గొప్ప ఆటగాడు, అతడిని ఆరాధిస్తా'
ముంబై: భారత స్టార్ క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిపై న్యూజిలాండ్ కెప్టెన్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు కానే విలియమ్సన్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లి గొప్ప ఆటగాడని, అతడిని ఆరాధిస్తానని చెప్పాడు. అన్ని ఫార్మాట్లలోనూ అతడు అద్భుతంగా ఆడుతున్నాడని కొనియాడాడు.
'కోహ్లి గ్రేట్ ప్లేయర్. నేను ఆరాధించే ఆటగాళ్లలో అతడు ఒకడు. మిగతా క్రీడాకారులను నేను అభిమానిస్తాను. అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లి అద్భుతంగా ఆడడం సాధారణ విషయం కాద'ని విలియమ్సన్ అన్నాడు. మైదానంలో దూకుడు ప్రదర్శించడం కోహ్లికి కలిస్తొందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ లో కోహ్లితో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా బాగా ఆడుతున్నాడని అన్నాడు. యువరాజ్ సింగ్ తో కలిసి ఐపీఎల్ లో ఆడడం పట్ల విలియమ్సన్ సంతోషం వ్యక్తం చేశాడు.