పఠాన్ విధ్వంసం: సన్ రైజర్స్ ఆశలు గల్లంతు
కోల్ కతా: విధ్వంసకరమైన ఆట ఎలా ఉంటుందో యూసఫ్ పఠాన్ మరోమారు రుచి చూపించాడు. ఆదిలోనే ఇచ్చిన అవకాశాన్ని సన్ రైజర్స్ ఆటగాళ్లు నేలపాలు చేయడంతో.. పఠాన్ రెచ్చిపోయాడు. అవతలి ఎండ్ నుంచి బౌలింగ్ ఎవరు చేస్తున్నారన్న సంగతిని పక్కను పెట్టిన యూసఫ్.. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఐపీఎల్ రికార్డులను తిరగరాశాడు. యూసఫ్ పఠాన్ తనదైన శైలిలో ప్రత్యర్థిపై విరుచుకుపడటంతో ఈ మ్యాచ్ కూడా 14.2 ఓవర్లలోనే ముగిసింది. కేవలం 22 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పఠాన్ 7 సిక్స్ లు, 5 ఫోర్లు సాయంతో 72 పరుగులు చేశాడు. దీని ఫలితంగా మూడో స్థానంలో ఉన్నకోల్ కతా రెండో స్థానానికి చేరుకుంది.
సొంతగడ్డపై జరిగిన లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఘన విజయాన్ని సాధించింది. ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ సన్ రైజర్స్ తో తలపడిన కోల్ కతా 4 వికెట్ల తేడాతో గెలుపుని సొంతం చేసుకుంది. దీంతో సన్ రైజర్స్ పెట్టుకన్న ప్లే ఆఫ్ ఆశలకు చుక్కెదురైంది. సన్ రైజర్స్ విసిరిన 161 పరుగుల లక్ష్యంతోబ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతాకు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. గౌతం గంభీర్ (28), రాబిన్ ఉతప్ప (41) పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులెత్తించారు.అనంతరం కాస్త తడబడినట్లు కనిపించిన కోల్ కతా తరువాత తేరుకుని అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. సన్ రైజర్స్ బౌలర్లలో కరణ్ శర్మ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
అంతకుముందు టాస్ ఓడిన హైదరాబాద్ బ్యాటింగ్ చేపట్టింది. హైదరాబాద్ కు ఆదిలోనే డేవిడ్ వార్నర్(4) ను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తో జతకలిసిన నమాన్ ఓజా స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ధావన్(29), ఓజా(26) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. అనంతరం వేణు గోపాలరావు(27), సమీ (29), హోల్డర్( 16) పరుగులు చేయడంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.