జైపూర్ సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ రికార్డు అద్భుతం...బుధవారం మ్యాచ్‌కు ముందు ఆ టీమ్ తమ సొంత మైదానంలో వరుసగా తొమ్మిది మ్యాచ్‌లు గెలిచింది. ఇప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్ దానికి ముగింపు పలికింది. ముందుగా స్పిన్‌తో రాయల్స్‌ను కట్టి పడేసిన కార్తీక్ సేన, ఆ తర్వాత చక్కటి బ్యాటింగ్‌తో సునాయాసంగా లక్ష్యం చేరింది. చావ్లా, కుల్దీప్, నితీశ్ రాణా స్పిన్ ముందు రాజస్తాన్ బ్యాటింగ్‌తడబడగా... బౌలింగ్‌లో విఫలమైన నరైన్ బ్యాటింగ్‌లో ఆకట్టుకోగా, ఇతర ప్రధాన బ్యాట్స్‌మెన్ కూడా చెలరేగడంతో రైడర్స్‌కు కీలక విజయం దక్కింది. వరుసగా నాలుగో మ్యాచ్‌లో కూడా మార్పులు లేకుండా ఒకే జట్టును కొనసాగించిన రాజస్తాన్ చివరకు ఫలితం సాధించడంలో మాత్రం విఫలమైంది.
జైపూర్: గత మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చిత్తుగా ఓడించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) అదే జోరు ను కొనసాగిస్తూ మరో విజయాన్ని అందుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధిం చింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. డి ఆర్కీ షార్ట్ (43 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ అజింక్య రహానే (19 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. రాణా, కరన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం కోల్‌కతా 18.5 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రాబిన్ ఉతప్ప (36 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), నరైన్ (25 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ నితీశ్ రాణా (27 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
రాణించిన రహానే...
తొలి మూడు ఓవర్లలో కలిపి రాజస్తాన్ స్కోరు 9 పరుగులు... అనంతరం నరైన్ వేసిన నాలుగో ఓవర్లో రహానే తొలి నాలుగు బంతులను వరుసగా ఫోర్లు బాది జోరు పెంచగా, మావి వేసిన తర్వాతి ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. అయితే కార్తీక్ చురుకుదనానికి రహానే రనౌట్ కావడంతో రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. రాణా వేసిన బంతిని ఆడేందుకు రహానే ముందుకు రాగా, అతని బ్యాట్ అంచుకు తగిలిన బంతి దగ్గర్లోనే పడింది. అనూహ్యంగా దూసుకొచ్చిన కార్తీక్ నేరుగా వికెట్లపైకి త్రో విసరడంతో రహానే వెనుదిరిగాడు. గత మ్యాచ్ హీరో సంజూ శామ్సన్ (7) ఈ సారి ఎక్కువ సేపు నిలవలేకపోగా, మరో ఎండ్‌లో షార్ట్ దూకుడుగా ఆడటంలో విఫలమయ్యాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో తీవ్రంగా తడబడ్డ అతడు ఎదుర్కొన్న 28 స్పిన్ బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. చివరకు రాణా చక్కటి బంతితో క్లీన్‌బౌల్డ్ చేయడంతో షార్ట్ ఆట ముగిసింది. తర్వాతి ఓవర్లో త్రిపాఠి (15) అవుటయ్యాడు. చావ్లా బౌలింగ్‌ను ఆడలేక స్టోక్స్ (14) కూడా డగౌట్ చేరడంతో రాజస్తాన్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారైంది. నరైన్ వేసిన 18వ ఓవర్లో 14 పరుగులు రాబట్టిన రాయల్స్... కరన్ వేసిన మరుసటి ఓవర్లో గౌతమ్ (12), గోపాల్ (0) వికెట్లు చేజార్చుకుంది. మావి వేసిన ఆఖరి ఓవర్లో కూడా 9 పరుగులే చేయగలిగింది. నరైన్ తన ఐపీఎల్ కెరీర్‌లో అతి చెత్త (4–0–48–0) బౌలింగ్ గణాంకాలు నమోదు చేసినా... మరో ముగ్గురు స్పిన్నర్లు చావ్లా, కుల్దీప్, రాణా కలిపి 10 ఓవర్లలో 52 పరుగులు మాత్రమే ఇచ్చి రాజస్తాన్‌ను కట్టడి చేశారు.
కీలక భాగస్వామ్యాలు...
ఇన్నింగ్స్ మూడో బంతికే లిన్ (0)ను బౌల్డ్ చేసి గౌతమ్ రాయల్స్‌కు శుభారంభం అందించాడు. అయితే ఆ తర్వాత నైట్‌రైడర్స్ దూకుడు ప్రదర్శించింది. ధావల్ కులకర్ణి ఓవర్లో నరైన్ వరుసగా మూడు ఫోర్లు కొట్టగా, ఉనాద్కట్ వేసిన తర్వాతి ఓవర్లో ఉతప్ప మరో మూడు బౌండరీలు బాదాడు. ఇదే జోరు కొనసాగిన అనంతరం ఎట్టకేలకు నరైన్ రనౌట్‌తో ఈ భాగస్వామ్యం ముగిసింది. గోపాల్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించిన నరైన్ అది విఫలం కావడంతో లెగ్‌బై కోసం ముందుకు వెళ్లాడు. ఉనాద్కట్ బంతిని బట్లర్‌కు అందించగా, నరైన్ వెనక్కి రాలేక రనౌటయ్యాడు. వీరు రెండో వికెట్‌కు 48 బంతుల్లోనే 70 పరుగులు జోడించారు. కొద్ది సేపటికి ఉతప్ప ఇన్నింగ్స్ కూడా ముగిసింది. బౌండరీ వద్ద స్టోక్స్ అద్భుత ఫీల్డింగ్ ఇందుకు కారణమైం ది. గౌతమ్ బౌలింగ్‌లో ఉతప్ప భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి నేరుగా లాంగాన్ బౌండరీ వద్ద స్టోక్స్ చేతుల్లోకి వెళ్లింది. క్యాచ్ పట్టే క్రమంలో నియంత్రణ కోల్పోయిన స్టోక్స్ బౌండరీ కుషన్స్‌ను తాకాడు కూడా. అయితే ఆలోపే బంతిని లోపలికి విసిరిన అతను మళ్లీ వచ్చి దానిని అందుకోవడం విశేషం. కానీ కోల్‌కతాపై ఈ వికెట్ ప్రభావం ఏమీ పడలేదు. రాణా, కార్తీక్ కలిసి చకచకా పరుగులు సాధించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 38 బంతుల్లోనే అభేద్యంగా 61 పరుగులు జోడించి గెలిపించారు.
Comments
Please login to add a commentAdd a comment