మ్యాచ్‌కు ముందు ఇరు జట్లదీ దాదాపు ఒకే స్థితి. సమాన సంఖ్యలో విజయాలు, పాయింట్లు. నెట్‌రన్‌రేట్ కూడా సుమారుగా సమమే. ఎవరు గెలిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు అంత చేరువవుతుంది. ఇలాంటి సమయంలో సొంతగడ్డపై కోల్‌కతా సత్తా చాటుతూ రాజస్తాన్‌ను మట్టికరిపించింది. ముందు బౌలింగ్‌లో సత్తా చాటి రాయల్స్‌ను కట్టడి చేసిన నైట్‌రైడర్స్, ఆ తర్వాత సమష్టి బ్యాటింగ్ ప్రదర్శనతో విజయాన్ని అందుకుంది. కుల్దీప్ తెలివైన బౌలింగ్‌కు తోడు తమ స్వయంకృతం కలిపి రాయల్స్ లీగ్‌లో ముందుకెళ్లే అవకాశాలను క్లిష్టం చేసుకుంది.
కోల్‌కతా: ఐపీఎల్ మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్లేఆఫ్స్ దిశగా కీలక విజయం దక్కింది. మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 19 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. బట్లర్ (22 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, రాహుల్ త్రిపాఠి (15 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్), ఉనాద్కట్ (18 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. కుల్దీప్ యాదవ్ (4/20) ప్రత్యర్థిని పడగొట్టాడు. అనంతరం కోల్‌కతా 18 ఓవర్లలో 4 వికెట్లకు 145 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ కార్తీక్ (31 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
బట్లర్ ‘సిక్సర్’ మిస్...
కోల్‌కతా బౌలర్ మావి ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను కట్టుదిట్టంగా వేయడంతో రాజస్తాన్ 2 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇందులో తొలి బంతికే స్లిప్‌లో త్రిపాఠి ఇచ్చిన క్యాచ్‌ను రాణా వదిలేశాడు కూడా. రెండో ఓవర్ వేసిన ప్రసి«ద్ కూడా తొలి రెండు బంతుల్లో ఒకటే పరుగిచ్చాడు. అయితే ఆ తర్వాతి పది బంతులు రాయల్స్ పరుగుల తుఫాన్‌ను ప్రదర్శించింది. అనంతరం నరైన్ వేసిన ఓవర్లో కూడా రెండు బౌండరీలతో 10 పరుగులు వచ్చాయి. అయితే రసెల్ బౌలింగ్‌తో రాజస్తాన్ ఇన్నింగ్స్ మలుపు తిరిగింది. పుల్ షాట్ ఆడబోయి త్రిపాఠి, కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో 63 పరుగుల (29 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం కుల్దీప్ అద్భుత స్పెల్ రాయల్స్ పతనాన్ని శాసించింది. కుల్దీప్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించి రహానే (11) క్లీన్ బౌల్డ్ కాగా... అతని తర్వాతి ఓవర్లో మరో రివర్స్ స్వీప్‌కు బట్లర్ కూడా వెనుదిరిగాడు. జోరుగా ఆడే ప్రయత్నంలో థర్డ్‌మాన్‌లో క్యాచ్ ఇచ్చి ఔటైన బట్లర్, టి20ల్లో వరుసగా ఆరు ఇన్నింగ్స్‌లలో అర్ధసెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచే అవకాశం చేజార్చుకున్నాడు. బట్లర్ ఆట ముగిశాక రాజస్తాన్ టపటపా వికెట్లు కోల్పోయింది.
అలవోకగా...
క్రీజ్‌లో ఉన్నంత కొద్ది సేపు సునీల్ నరైన్ (7 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దడదడలాడించాడు. గౌతమ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో వరుసగా 6, 4, 6, 4 కొట్టి అతను కోల్‌కతాకు శుభారంభం అందించాడు. అయితే స్టోక్స్ తన రెండో బంతికే నరైన్‌ను వెనక్కి పంపించాడు. ఉతప్ప (4) విఫలం కాగా, మరో ఎండ్‌లో లిన్ సమయోచితంగా ఆడుతూ గెలిపించే బాధ్యతను తీసుకున్నాడు. అతనికి నితీశ్ రాణా (17 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) సహకరించాడు. లిన్‌ను స్టోక్స్ అవుట్ చేసినా... కార్తీక్, రసెల్ (5 బంతుల్లో 11 నాటౌట్; 2 ఫోర్లు) భాగస్వామ్యంతో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే కోల్‌కతా లక్ష్యం చేరుకుంది. ఆర్చర్ వేసిన 18వ ఓవర్లో కార్తీక్ ఫోర్, సిక్స్ బాది మ్యాచ్ ముగించాడు.
ఆ పది బంతులు...
6, 4, 4, 4, 4, 6, 4, 4, 6, 4... ఒక దశలో వరుసగా 10 బంతుల్లో రాయల్స్ సాగించిన వీర విధ్వంసం ఇది. జట్టు ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ మూడో బంతి నుంచి మూడో ఓవర్ చివరి బంతి వరకు సాగిన ఈ జోరే హైలైట్‌గా నిలిచింది. ఈ పది బంతుల్లో ఆ జట్టు 7 ఫోర్లు, 3 సిక్సర్లతో ఏకంగా 46 పరుగులు రాబట్టింది. ఇందులో ముందుగా రాహుల్ త్రిపాఠి చెలరేగితే, ఆ తర్వాత బట్లర్ తన మెరుపులు చూపించాడు. ప్రసి«ద్ కృష్ణ ఓవర్లో త్రిపాఠి వరుసగా సిక్స్, 3 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత మావి ఓవర్లో బట్లర్ 2 సిక్సర్లు, 4 ఫోర్లతో తనదైన శైలిలో ఆడుకున్నాడు. షార్ట్ థర్డ్‌మాన్, ఫైన్‌లెగ్, పాయింట్, మిడ్‌వికెట్, ఫైన్‌లెగ్, బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆరు షాట్లను బట్లర్ బౌండరీ దాటించడంతో ఆ ఓవర్లో మొత్తం 28 పరుగులు వచ్చాయి.
బట్లర్, స్టోక్స్ ఇంటికి...
రాజస్తాన్ రాయల్స్ ప్రధాన ఆటగాళ్లు బట్లర్, బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ తిరిగి వెళ్లనున్నారు. పాక్‌తో తొలి టెస్టులో తలపడే జట్టులో సభ్యులైన వీరిద్దరు 17లోగా తమ జట్టుకు రిపోర్ట్ చేయాల్సి ఉంది. వీరిద్దరు రాయల్స్ బరిలోకి దిగిన 13 మ్యాచ్‌లు కూడా ఆడారు. వేలంలో రూ.4.4 కోట్లకు రాయల్స్ సొంతమైన బట్లర్... వరుసగా ఐదు అర్ధ సెంచరీలు సహా 155.24 స్ట్రయిక్ రేట్‌తో 548 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి తన విలువకు న్యాయం చేశాడు. అయితే 2017లో ‘అత్యంత విలువైన ఆటగాడి’గా నిలిచిన స్టోక్స్ ఈసారి పూర్తిగా నిరాశపర్చాడు. కేవలం 16.33 సగటుతో మొత్తం 196 పరుగులు మాత్రమే చేసిన అతను, 43 సగటుతో 7 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. వేలంలో రాజస్తాన్ స్టోక్స్ కోసం రూ. 12.5 వెచ్చించినా అది ప్రదర్శనలో ప్రతిబింబించలేదు.
Comments
Please login to add a commentAdd a comment