వెటెల్ ‘హ్యాట్రిక్ పోల్’
ప్రధాన రేసు ఉదయం గం. 11.15 నుంచి
ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం
యోన్‌గామ్ (దక్షిణ కొరియా): రెండు వారాల క్రితం ‘హ్యాట్రిక్’ విజయాలను నమోదు చేసిన రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్... క్వాలిఫయింగ్‌లోనూ హ్యాట్రిక్ ఘనత సాధించాడు. శనివారం జరిగిన కొరియా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో ఈ డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ ‘పోల్ పొజిషన్’ దక్కించుకున్నాడు. ఈ జర్మన్ డ్రైవర్ క్వాలిఫయింగ్‌లో అందరికంటే వేగంగా ఒక నిమిషం 37.202 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి వరుసగా మూడోసారి ‘పోల్ పొజిషన్’ను సంపాదించాడు. గత ఏడాది కూడా ఈ రేసులో విజేతగా నిలిచిన ‘హ్యాట్రిక్ వరల్డ్ చాంపియన్’ వెటెల్ ఈ సీజన్‌లో వరుసగా నాలుగో విజయంపై దృష్టి పెట్టాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ఆరంభించనున్న వెటెల్ ఒకవేళ విజేతగా నిలిస్తే మాత్రం వరుసగా నాలుగో ఏడాది అతనికే ప్రపంచ టైటిల్ దక్కే అవకాశాలు మెరుగవుతాయి.
ఇప్పటికే 247 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న వెటెల్‌కు, రెండో స్థానంలో ఉన్న అలోన్సో (187 పాయింట్లు)కు మధ్య ఏకంగా 60 పాయింట్ల వ్యత్యాసం ఉంది. వెటెల్ ఖాతాలో మరో విజయం చేరితే ఈ తేడా మరింతగా పెరిగే అవకాశముంది. కొరియా రేసు తర్వాత ఈ సీజన్‌లో మరో ఐదు రేసులు మిగిలి ఉంటాయి.
ఇక భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లకు కొరియా గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్‌లోనూ నిరాశ మిగిలింది. సుటిల్, పాల్ డి రెస్టా వరుసగా 14వ, 15వ స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు. హామిల్టన్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. వెటెల్ సహచరుడు వెబెర్ క్వాలిఫయింగ్‌లో మూడో స్థానం పొందినా... స్టీవార్డ్ మూడు హెచ్చరికలను ఉల్లంఘించినందుకు అతనిపై 10 గ్రిడ్‌ల పెనాల్టీని విధించారు. ఫలితంగా వెబెర్ రేసును 13వ స్థానం నుంచి ఆరంభిస్తాడు.