మూడో స్థానంలో కోటేశ్వర్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఓపెన్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో రెండోరోజు రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు రాణించారు. హుస్సేన్ సాగర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన జూనియర్స్ లేజర్ 4.7 విభాగంలో నగరానికి చెందిన కోటేశ్వర్ రావు మూడో స్థానంలో నిలవగా, కె. గౌతమ్ ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ విభాగంలో సోమవారం నాటికి ఆరు రేసులు ముగిసేసరికి మధ్యప్రదేశ్‌కు చెందిన రామ్ మిలన్ యాదవ్ 21 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. తమిళనాడు సెయిలర్ మహేశ్ బాలచందర్ 31 పాయింట్లతో రెండో స్థానంలో, కోటేశ్వర్ రావు 40 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.
యూత్ లేజర్ రేడియల్ విభాగంలో మధ్యప్రదేశ్ సెయిలర్ శిఖర్ గార్గ్ (22 పాయింట్లు), గోవింద్ బైరాగి (28 పాయింట్లు, మహారాష్ట్ర), శేఖర్ సింగ్ యాదవ్ (29 పాయింట్లు, మహారాష్ట్ర) వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఈ విభాగంలో జరిగిన ఐదో రేసులో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి ఏ. సంజయ్ రెడ్డి విజేతగా నిలిచాడు. సీనియర్ లేజర్ స్టాండర్డ్ కేటగిరీలో అజయ్ సింగ్( 10పా. మహారాష్ట్ర) అగ్రస్థానంలో ఉండగా, అవినాశ్ యాదవ్ (17 పా., మహారాష్ట్ర), జీసీకే రెడ్డి (21 పా., ఆంధ్రప్రదేశ్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.