తొలిరోజు జహీర్ విఫలం
తొలిరోజు జహీర్ విఫలం
Published Thu, Oct 3 2013 1:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
షిమోగా: తొమ్మిది నెలలుగా గాయంతో బాధపడుతూ... ఫిట్‌నెస్ కోసం పాకులాడుతున్న భారత స్టార్ పేసర్ జహీర్ ఖాన్ ఎట్టకేలకు బరిలోకి దిగాడు. వెస్టిండీస్‌తో బుధవారం ప్రారంభమైన రెండో అనధికార టెస్టులో భారత్ ‘ఎ’ తరఫున బరిలోకి దిగిన జహీర్ (1/44) ఆకట్టుకోలేకపోయాడు. మిగిలిన బౌలర్లు కూడా అంతంత మాత్రంగానే రాణించడంతో.... వెస్టిండీస్ ‘ఎ’ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. బ్రాత్‌వైట్ (82), ఫుదాదిన్ (63) అర్ధసెంచరీలు చేయడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్‌సలో 90 ఓవర్లలో 6 వికెట్లకు 283 పరుగులు చేసింది. జాన్సన్ (36 నాటౌట్), మిల్లర్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. జవహర్‌లాల్ నెహ్రు స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఓపెనర్లలో పావెల్ (33) విఫలమైనా... బ్రాత్‌వైట్ నిలకడగా ఆడాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించారు. ఎడ్వర్‌డ్స (18), డియోనరైన్ (12) వెంటవెంటనే అవుట్‌కావడంతో కరీబియన్ జట్టు 98 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. బ్రాత్‌వైట్‌తో జత కలిసిన ఫుదాదిన్ మెరుగ్గా ఆడాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్న ఈ జోడి వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరింది. తర్వాత జాన్సన్ నిలకడను కనబర్చినా... వాల్టన్ (30) ఆట చివర్లో అవుటయ్యాడు. మిల్లర్ పరుగులు చేయకున్నా వికెట్‌ను కాపాడుకుంటూ రోజును ముగించాడు. జహీర్ ఖాన్, షమీ, రసూల్ తలా ఓ వికెట్ తీయగా.. భార్గవ్ భట్‌కు మూడు వికెట్లు దక్కాయి.
Advertisement
Advertisement