నాకు అన్యాయం జరిగింది!
న్యూఢిల్లీ: రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేయకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని డిస్కస్ త్రోయర్ కృష్ణ పూనియా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఆమె బుధవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ను కలిసింది. రోజంతా ప్రయత్నించినా మంత్రి కార్యాలయాల్లో జితేంద్రను కలవలేకపోయిన పూనియాకు ఎట్టకేలకు ఆయన ఇంట్లో ఆ అవకాశం లభించింది.
ఆమె అభ్యర్థనకు సంబంధించి వివరాలు తెలుసుకొని తగిన చర్య తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు పూనియా వెల్లడించింది. ‘15 నిమిషాల పాటు ఆయన ఓపిగ్గా నా మాటలు విన్నారు. ఎంపికలో ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుతామని మంత్రి చెప్పారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకుంది’ అని పూనియా వెల్లడించింది. రెజ్లర్ సుశీల్ కుమార్... పూనియాకు మద్దతుగా నిలిచాడు. సోధితో పాటు సంయుక్తంగా పూనియాకు అవార్డు ఇవ్వాలన్నాడు.
ద్వంద్వ ప్రమాణాలు...
లండన్ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన అందరికీ అవార్డులు దక్కాయని, తనకు మాత్రం ఇవ్వకుండా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని పారాలింపియన్ గిరీష విమర్శించాడు. గత ఏడాది విజయ్‌కుమార్‌కు ఇచ్చిన తరహాలో తననూ ఖేల్త్న్రకు ఎంపిక చేయాలని కోరాడు. ఒక వేళ సాధ్యం కాకపోతే ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ కనీసం అర్జున అవార్డును ప్రకటించాలని విజ్ఞప్తి చేశాడు.
‘ఖేల్’ మార్చిన అంజలి...
వాస్తవానికి పెరీరా నేతృత్వంలోని కమిటీ ముందు ఖేల్త్న్ర అవార్డు కోసం పూనియా, గిరీష పేర్లే వచ్చాయి. చివరి నిమిషంలో సోధి పేరు చేర్చాల్సిందిగా మాజీ షూటర్ అంజలీ భగవత్ ఒత్తిడి తెచ్చి తన పంతం నెగ్గించుకున్నారు. గిరీషను తప్పించి పూనియా, సోధి మధ్య ఓటింగ్ జరపగా 12 మంది సభ్యులు 6-6తో ఇద్దరినీ సమర్ధించారు. ‘సాయ్’ డెరైక్టర్ థామ్సన్, సోధికి మద్దతు పలకడంతో ఎంపిక ఖరారైంది.