కృష్ణ పూనియా.. రాజస్థాన్ రాజకీయ చిత్రంలో ప్రముఖంగా కనిపిస్తున్న మహిళ. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో జైపూర్ రూరల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారామె. ఆమె క్రీడాకారిణి, ఆమె ప్రత్యర్థి కూడా క్రీడాకారుడే. వాళ్లిద్దరూ ఇంత వరకూ క్రీడాబరిలో ఒకరితో ఒకరు పోటీ పడలేదు. ఎవరి ఆట వాళ్లది. ఎవరి విజయం వాళ్లది. ఎవరి రికార్డు వాళ్లది. ఇప్పుడు వాళ్లు ఎన్నికల బరిలో ఒకరితో ఒకరు తలపడుతున్నారు. కృష్ణ పూనియా ప్రత్యర్థి ప్రముఖ రైఫిల్ షూటర్ కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. సిట్టింగ్ ఎంపీ. మోదీ ప్రభుత్వంలో మంత్రి కూడా.
అతడితో ఒక సామాన్య క్రీడాకారిణి పోటీ పడి గెలవగలదా అని నుదురు చిట్లించే వాళ్లకు... నాలుగు నెలల కిందట ఎమ్మెల్యేగా గెలిచి, తను సాధించిన భారీ మెజారిటీని చూడమంటున్నారు కృష్ణ పూనియా. రాజ్యవర్ధన్‌కు పోటీగా కృష్ణ పూనియాను రంగంలోకి దించినప్పటి నుంచి ప్రత్యర్థుల బలాబలాల బేరీజు మొదలైంది. ఎవరూ ఎవరికీ తీసిపోవడం లేదు. విశ్లేషకులకు అంతుచిక్కడం లేదు.
కృష్ణ పూనియా పుట్టింది, పెరిగింది హర్యానాలో. తొమ్మిదేళ్ల వయసులో తల్లి పోవడంతో నానమ్మ పెంచింది. తండ్రితోపాటు డైరీ ఫార్మ్‌లో, పొలంలో పని చేసేది కృష్ణ. ఎనభై గేదెల ఫార్మ్ అది. చిన్నప్పుడు చేసిన కాయకష్టమే ఆమె క్రీడాకారిణి కావడానికి దోహదం అయింది. తల్లి లేని కుటుంబంలో ఆడపిల్ల పెద్దవుతుంటే అభద్రతకు లోనవుతుంటారు పెద్దవాళ్లు. ఆమె బాధ్యతను ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే అంత మేలు అనుకునే అత్యంత సామాన్యమైన కుటుంబం వాళ్లది. నానమ్మ పోరు కావచ్చు, నాన్న ముచ్చట కావచ్చు.. కృష్ణకు పదిహేనేళ్లకే పెళ్లయింది. భర్త వీరేందర్ పూనియా రైల్వే ఉద్యోగి.
2000లో పెళ్లయింది, మరుసటి ఏడాది ఓ కొడుకు పుట్టాడు. ఆశ్చర్యంగా ఆమె క్రీడాకారిణిగా టర్న్ తీసుకున్నది పెళ్లయిన తర్వాతనే. వీరేందర్ డిస్కస్ థ్రో క్రీడాకారుడు. అతడు సరదాగా భార్యకు డిస్కస్ థ్రో నేర్పించాడు. పెళ్లి తర్వాత ఆమె గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశారు. ఆ తర్వాత రైల్వేలో ఉద్యోగంలో చేరారామె. ఇదంతా ఒక ఎత్తయితే సరదాగా నేర్చుకున్న డిస్కస్ థ్రోని వదల్లేదు. వీరేందర్ ఆమెను ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా తీర్చిదిద్దారు.
ఇండియాకి తొలి రికార్డు
2010 లో ఢిల్లీలో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో డిస్కస్ థ్రో ఈవెంట్‌లో బంగారు పతకాన్ని, దోహాలో కాంస్యాన్ని సాధించారు కృష్ణ పూనియా. అంతకు ముందే 2006 ఏషియన్ గేమ్స్‌లో కాంస్యంతో విజయాలకు ఆరంభం పలికారామె. మూడుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారిణి. అర్జున, పద్మశ్రీ అవార్డుల గ్రహీత. మనదేశం నుంచి కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి మహిళ కృష్ణ పూనియా. ఆమె వ్యక్తిగత రికార్డు 64.76 మీటర్లు. ఉమెన్స్ డిస్కస్ త్రో విభాగంలో ఆమెది నేషనల్ రికార్డు.
పొలిటికల్ ట్రాక్
లండన్‌లో 2012 ఒలింపిక్స్‌లో పాల్గొన్న తర్వాత ఆమె హటాత్తుగా ఇలాంటి టర్న్ తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. రాజస్థాన్‌లోని ‘చురు’ జిల్లాకు చెందిన వీరేందర్‌ని పెళ్లి చేసుకుని ఆ జిల్లాకు కోడలిగా వెళ్లేటప్పుడు అది తన రాజకీయ వేదికగా మారుతుందని ఆమె కూడా ఊహించలేదు. 2013లో రాహుల్ గాంధీ... చురులో ఎన్నికల పర్యటనకు వచ్చినప్పుడు ఆ వేదిక మీద కనిపించారామె. మరుసటి రోజు పేపర్లలో ‘క్రీడాకారిణి కృష్ణ పూనియా రాజకీయ రంగ ప్రవేశం’ అని పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. అదే ఎన్నికల్లో ఆమె చురు జిల్లాలోని సదుల్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ అప్పుడామె గెలవలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అదే సదుల్‌పూర్ నుంచి 18 వేల భారీ మెజారిటీతో గెలిచారామె. ఇప్పుడు కృష్ణ పూనియా సదుల్‌పూర్ ఎమ్మెల్యే.
జైపూర్ వాళ్లకీ ఆశ్చర్యమే
ఈ ఏప్రిల్ ఒకటవ తేదీన ఆశ్చర్యకరంగా జైపూర్ రూరల్ పార్లమెంటరీ నియోజకవర్గం తెర మీదకొచ్చారు పూనియా. ‘ఈ సంగతి నాక్కూడా రాత్రే తెలిసింది’ అని ఏప్రిల్ రెండవ తేదీన మీడియాతో చెప్పారామె. ‘‘ఆ స్థానం నుంచి నేను పోటీ చేయాల్సిన అవసరం ఉన్నట్లు పార్టీ భావించింది... అని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ చెప్పారు. నేను పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తున్నాను’’ అన్నారామె. ‘‘ఇది నాకు గొప్ప అవకాశం. చాలెంజింగ్ జాబ్’’ అని కూడా అన్నారు.
ఈ మాటతో మరోసారి పార్టీ పెద్దల గుడ్‌లుక్స్‌లో పడిపోయారు కృష్ణ. ఇక ఆమె జైపూర్ ప్రజల గుడ్‌లుక్స్‌లో పడాలి. రాథోడ్ మీద పోటీ చేస్తున్నట్లు ప్రకటన వెలువడగానే ఆమె అతడి మీద పదునైన వాగ్బాణాన్ని సంధించారు. ‘‘నేను రైతు బిడ్డను. గ్రామీణ ప్రజల కష్టాలు తెలుసు. వాళ్ల జీవనశైలి తెలుసు. గ్రామాల్లో యువతీయువకులు ఆడుకునేటట్లు ఎండలో ఆడే ఆటనే (డిస్కస్ థ్రో) ఎంచుకున్నాను. ఏసీ హాల్‌లో ప్రదర్శించే ఆట కాదు నాది’’ అంటూ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ రైఫిల్ షూటింగ్‌ని సంపన్నుల క్రీడగా అభివర్ణించారామె.
ఇద్దరి పరుగూ ఒకేసారి
కృష్ణ పూనియాతోపాటు ఆమె ప్రత్యర్థి రాథోడ్ రాజకీయ జీవితం కూడా 2013లోనే మొదలైంది. అదే ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పూనియా గెలుపును అందుకోలేకపోయారు. మరుసటి ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జైపూర్ రూరల్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రాథోడ్ గెలిచారు. కేంద్రంలో క్రీడాశాఖ మంత్రి అయ్యారు. ఇది ఐదేళ్ల నాటి పరిస్థితి. ఇప్పుడు సీన్ ఇందుకు భిన్నం.
రాథోడ్ పార్లమెంటు మెంబరుగా గెలిచినప్పుడు రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండింది. అధికార పార్టీ అతడికి వెన్నుదన్నుగా నిలిచింది. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. పూనియాకి కూడా పార్టీ నుంచి సహాయసహకారాలు పుష్కలంగా అందుతున్నాయి. పూనియా జాట్ మహిళ, ఓటర్లలో జాట్‌లు 23 శాతం. రాథోడ్‌ది రాజపుత్ర కుటుంబం, నియోజకవర్గంలో వారి జనాభా పదిశాతం మాత్రమే ఉంది. రాథోడ్ గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీద మూడు లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు పూనియా అతడికి గట్టి పోటీ ఇవ్వడంతోపాటు గెలుపు తీరాన్ని చేరే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
కుర్చీలాట మామూలే
రాజస్థాన్‌లో ఒకసారి బీజేపీ గెలిస్తే మరోసారి కాంగ్రెస్ పార్టీ గెలవడం ఆనవాయితీ. ఆ క్రమంలోనే వసుంధర రాజె, అశోక్ గహ్లోత్‌లు కుర్చీలాట ఆడుకున్నట్లు సీట్లు మార్చుకుంటూ ఉండేవారు. జైపూర్ లోక్‌సభ పరిధిలో ఎనిమిది అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఎనిమిదింటిలో ఐదింట కాంగ్రెస్ గెలిచింది. రెండు బీజేపీ, ఒకటి ఇండిపెండెంట్ ఖాతాలో పడ్డాయి. ఈ కొద్ది నెలల్లో ఓటర్ల మూడ్ ఆమాంతం మారిపోవడానికి అవకాశం తక్కువ. అది కూడా కృష్ణ పూనియాకు కలసి వచ్చే అంశమే. అయితే చురు జిల్లా కు చెందిన వ్యక్తి తమకు అభ్యర్థిగా వస్తే జైపూర్ ఓటర్లు స్వాగతిస్తారా లేదా అనేది కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయమే.
సదుల్‌పూర్... జైపూర్‌కు సమీపంలో ఏమీ లేదు. రెండిటి మధ్య రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉంది. మహిళా ప్రతినిధిగా కృష్ణపూనియా సమర్థంగా రాణిస్తుందనడంలో ఎవరికీ సందేహాల్లేవు. కానీ ‘ఒక ఊరి పాలెగాడు మరో ఊరికి పోలిగాడు’ అనే సామెత రాజకీయాల్లో తరచూ నిజమవుతూనే ఉంటుంది. జైపూర్ ఓటర్లు ఆమెను జైపూర్ వాసిగా అక్కున చేర్చుకుంటారా లేక చురు అమ్మాయి కదా అని నొసలు చిట్లిస్తారా అనేది మే నెల ఆరున ఈవీఎంకి తెలుస్తుంది. మనం మే 23 వరకు ఆగాలి.
వాకా మంజులారెడ్డి
ప్రత్యర్థి ట్రాక్ రికార్డు
కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ రైఫిల్ షూటింగ్ చాంపియన్, 2004 ఏథెన్స్ గేమ్స్‌లో డబుల్ ట్రాప్‌లో సిల్వర్ మెడల్, 2002, 2006లో కామన్‌వెల్త్ గేమ్స్‌లో వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్ విభాగంలో బంగారు పతకాలు సాధించారు. అంతకంటే ముందు ఆర్మీలో కల్నల్‌గా దేశానికి అందించిన సేవలకు గాను సైన్య సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, స్పెషల్ సర్వీస్ మెడల్ అందుకున్నారు. భారత ప్రభుత్వం అతడిని రాజీవ్ ఖేల్‌రత్న, అర్జున, పద్మశ్రీ పురస్కారాలతో గౌరవించింది. 2014లో జైపూర్ రూరల్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మోదీ ప్రభుత్వంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, క్రీడాశాఖల మంత్రిగా విధులు నిర్వహించారు.
మహిళా చైతన్యం
జైపూర్‌లో జరిగిన ఒక సంఘటన కృష్ణ పూనియాలో ఒక ఉద్యమకారిణిని బయటకు తెచ్చింది. 2017 జనవరిలో ఓ రోజు సాయంత్రం ఆమె చురు జిల్లాలో సొంతూరుకెళ్లినప్పుడు జరిగిందా సంఘటన. ఇద్దరమ్మాయిలు నడిచి వెళ్తున్నారు, వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు. అక్క టెన్త్ క్లాస్, చెల్లెలు నైన్త్ క్లాస్. ముగ్గురబ్బాయిలు బైక్ మీద వెళ్తూ వాళ్లను ఏడిపిస్తున్నారు. తన కారులో చేజ్ చేస్తూ ముందుకెళ్లి బైక్‌ను ఆపేసి ఆ ముగ్గురు ఆకతాయిలనూ కాలర్ పట్టుకుని లాగి పెట్టి చెంప మీద కొట్టారామె. ముగ్గురు కుర్రాళ్లు ఒక మహిళకు భయపడడానికి ఇదేమైనా సినిమా సన్నివేశమా అనిపిస్తుంది. కానీ కృష్ణ పూనియా ఎత్తు ఆరడుగుల ఒక అంగుళం. క్రీడాకారిణి కావడంతో దేహదారుఢ్యం బాగుంటుంది.
దానికితోడు నలభై ఏళ్ల మహిళలో కనిపించే పరిణతి, కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి స్పందించిన ఆ క్షణంలో ఆమెలో కనిపించిన ధర్మాగ్రహం ఆ కుర్రాళ్లను భయపెట్టింది. కృష్ణ వాళ్లను చెంపదెబ్బలు కొట్టి అంతటితో సరిపెట్టలేదు, స్థానిక పోలీస్‌కు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. రెండు నిమిషాల నడకదూరంలో ఉంది పోలీస్ స్టేషన్. అయినా సమాచారం అందుకున్న తర్వాత ఎంత సేపటికీ రాలేదు పోలీసులు. రెండోసారి ఫోన్ చేసి మీరు వచ్చే వరకు కదిలేది లేదని చెప్పడంతో నెమ్మదిగా వచ్చారు. పోలీస్ అనగానే బెదిరిపోయారు ఆ ఇద్దరమ్మాయిలు. ‘పోలీస్ కేసు పెడితే మా అమ్మానాన్నలు మమ్మల్ని ఇల్లు కదలనివ్వరు. స్కూలు కూడా మాన్పించేస్తార’ని ఏడుపందుకున్నారు. అప్పటికి ఆ అమ్మాయిలను ఇంటికి పంపించేసి, పోకిరీ పిల్లలను పోలీసులకు అప్పగించి ఇంటికి వెళ్లిపోయారు కృష్ణ పూనియా.
మనదేశంలో ఆడపిల్లలు ఎంతటి అభద్రత స్థితిలో జీవిస్తున్నారో చెప్పడానికి ఒక సందర్భంలో ఈ సంగతిని ప్రస్తావించారామె. ‘‘బేటీ బచావో, బేటీ పఢావో... అని నినాదాలివ్వడం కాదు. ఆడపిల్ల... తనకు అన్యాయం జరిగితే న్యాయం కోసం పోరాడడానికి గొంతెత్త గలగాలి. అది లేనప్పుడు ఎన్ని పథకాలున్నా వృథా’’ అన్నారు. ఆ మాటకు రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ ‘ఆడపిల్లకు న్యాయం కోసం పోరాడగలిగిన ధైర్యం రావాలంటే ముందు ఆ బిడ్డ బతికి బట్టకట్టాలి, ఆ తరవాత చదువుకుని ధైర్యం తెచ్చుకోవాలి. ఆడపిల్లలు తమ కోసం తాము పోరాడగలిగే వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశం’ అని ఆమె ఎత్తిపొడుపుకు వివరణలు ఇస్తూనే... ‘ఆపదలో ఉన్న అమ్మాయిలను కాపాడడానికి కృష్ణ పూనియా చూపించిన చొరవను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment