రాజస్తాన్‌లోని జైపూర్ రూరల్ లోక్‌సభ స్థానంలో ఇద్దరు అంతర్జాతీయ క్రీడాకారులు రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఎన్నికల మైదానంలోకి దిగుతుండడంతో ‘పోల్ గేమ్’ రసకందాయంలో పడింది. మాజీ ఒలింపిక్ క్రీడాకారుడూ, కేంద్ర క్రీడా మంత్రి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ 49 ఏళ్ల రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌ని జైపూర్ రూరల్ లోక్‌సభ స్థానానికి పోటీ చేయించాలని బీజేపీ ఎప్పుడో నిర్ణయించేసింది. అయితే ఈ స్థానంలో రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్‌తో తలపడేందుకు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, డిస్కస్ త్రో క్రీడాకారిణి కృష్ణా పూనియా పేరుని తెరపైకి తెచ్చింది. 2004 ఒలంపిక్స్‌లో రాథోడ్ డబుల్ ట్రాప్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. 2012లో లండన్ గేమ్స్‌లో పూనియా డిస్కస్ త్రోలో ఆరవ స్థానాన్ని పొందారు.
బీజేపీ నుంచి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ పేరు ముందే ఖరారైనా, కాంగ్రెస్ మాత్రం పూనియా పేరుని ఈ స్థానానికి ఆలస్యంగా నిర్ధారించింది. 41 ఏళ్ల పూనియా బరిలోకి దిగడంతోనే తొలిపంచ్ రాథోడ్‌పై పడింది. ‘నేను రైతు బిడ్డని. గ్రామీణ ప్రజల సమస్యలను అర్థం చేసుకోగలను’ అనీ, ‘నేను ఏసీ గదుల్లో నా ఆటను ఆడి మెడల్స్ సంపాదించుకోలేదు. గ్రామీణ యువకులు ఆడే ఆటనే నేను ఎంపిక చేసుకున్నాను’ అని పంచ్ డైలాగ్‌తో ప్రచారాన్ని ప్రారంభించారు పూనియా. ఈ ఇరువురికీ చాలా సారూప్యత ఉంది. ఇద్దరూ క్రీడాకారులే, ఇరువురూ రాజకీయ అరంగేట్రం చేసింది 2013లోనే. నరేంద్రమోదీ ప్రభంజనం సందర్భంగా 2014లో రాథోడ్ ఈ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకున్నారు. అయితే పూనియా 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. అయితే ఐదేళ్ల తరువాత గేమ్ మారింది. బీఎస్పీ ఎమ్మెల్యే మనోజ్ న్యాంగ్లీ, బీజేపీ సీనియర్ నాయకుడు రామ్ సింఘ్ కాశ్వాన్‌నీ 2018లో ఓడించి సాదులాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పూనియా గెలుపు కైవసం చేసుకున్నారు. మూడుసార్లు ఒలంపిక్ క్రీడల్లో పాల్గొన్న అనుభవం పూనియా సొంతమైతే, కామన్‌వెల్త్ గేమ్స్‌లో రెండు గోల్డ్‌మెడల్స్ సొంతం చేసుకున్న చరిత్ర రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌ది. పూనియా సామాజిక వర్గం జాట్ కాగా, రాథోడ్ రాజ్‌పుత్ర. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో జాట్‌లు 23 శాతం ఉంటే, రాజ్‌పుత్రుల జనాభా 10 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment