Krishna Poonia
-
ఆట మొదలైంది
కృష్ణ పూనియా.. రాజస్థాన్ రాజకీయ చిత్రంలో ప్రముఖంగా కనిపిస్తున్న మహిళ. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో జైపూర్ రూరల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారామె. ఆమె క్రీడాకారిణి, ఆమె ప్రత్యర్థి కూడా క్రీడాకారుడే. వాళ్లిద్దరూ ఇంత వరకూ క్రీడాబరిలో ఒకరితో ఒకరు పోటీ పడలేదు. ఎవరి ఆట వాళ్లది. ఎవరి విజయం వాళ్లది. ఎవరి రికార్డు వాళ్లది. ఇప్పుడు వాళ్లు ఎన్నికల బరిలో ఒకరితో ఒకరు తలపడుతున్నారు. కృష్ణ పూనియా ప్రత్యర్థి ప్రముఖ రైఫిల్ షూటర్ కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. సిట్టింగ్ ఎంపీ. మోదీ ప్రభుత్వంలో మంత్రి కూడా. అతడితో ఒక సామాన్య క్రీడాకారిణి పోటీ పడి గెలవగలదా అని నుదురు చిట్లించే వాళ్లకు... నాలుగు నెలల కిందట ఎమ్మెల్యేగా గెలిచి, తను సాధించిన భారీ మెజారిటీని చూడమంటున్నారు కృష్ణ పూనియా. రాజ్యవర్ధన్‌కు పోటీగా కృష్ణ పూనియాను రంగంలోకి దించినప్పటి నుంచి ప్రత్యర్థుల బలాబలాల బేరీజు మొదలైంది. ఎవరూ ఎవరికీ తీసిపోవడం లేదు. విశ్లేషకులకు అంతుచిక్కడం లేదు. కృష్ణ పూనియా పుట్టింది, పెరిగింది హర్యానాలో. తొమ్మిదేళ్ల వయసులో తల్లి పోవడంతో నానమ్మ పెంచింది. తండ్రితోపాటు డైరీ ఫార్మ్‌లో, పొలంలో పని చేసేది కృష్ణ. ఎనభై గేదెల ఫార్మ్ అది. చిన్నప్పుడు చేసిన కాయకష్టమే ఆమె క్రీడాకారిణి కావడానికి దోహదం అయింది. తల్లి లేని కుటుంబంలో ఆడపిల్ల పెద్దవుతుంటే అభద్రతకు లోనవుతుంటారు పెద్దవాళ్లు. ఆమె బాధ్యతను ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే అంత మేలు అనుకునే అత్యంత సామాన్యమైన కుటుంబం వాళ్లది. నానమ్మ పోరు కావచ్చు, నాన్న ముచ్చట కావచ్చు.. కృష్ణకు పదిహేనేళ్లకే పెళ్లయింది. భర్త వీరేందర్ పూనియా రైల్వే ఉద్యోగి. 2000లో పెళ్లయింది, మరుసటి ఏడాది ఓ కొడుకు పుట్టాడు. ఆశ్చర్యంగా ఆమె క్రీడాకారిణిగా టర్న్ తీసుకున్నది పెళ్లయిన తర్వాతనే. వీరేందర్ డిస్కస్ థ్రో క్రీడాకారుడు. అతడు సరదాగా భార్యకు డిస్కస్ థ్రో నేర్పించాడు. పెళ్లి తర్వాత ఆమె గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశారు. ఆ తర్వాత రైల్వేలో ఉద్యోగంలో చేరారామె. ఇదంతా ఒక ఎత్తయితే సరదాగా నేర్చుకున్న డిస్కస్ థ్రోని వదల్లేదు. వీరేందర్ ఆమెను ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా తీర్చిదిద్దారు. ఇండియాకి తొలి రికార్డు 2010 లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో డిస్కస్ థ్రో ఈవెంట్లో బంగారు పతకాన్ని, దోహాలో కాంస్యాన్ని సాధించారు కృష్ణ పూనియా. అంతకు ముందే 2006 ఏషియన్ గేమ్స్‌లో కాంస్యంతో విజయాలకు ఆరంభం పలికారామె. మూడుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారిణి. అర్జున, పద్మశ్రీ అవార్డుల గ్రహీత. మనదేశం నుంచి కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి మహిళ కృష్ణ పూనియా. ఆమె వ్యక్తిగత రికార్డు 64.76 మీటర్లు. ఉమెన్స్ డిస్కస్ త్రో విభాగంలో ఆమెది నేషనల్ రికార్డు. పొలిటికల్ ట్రాక్ లండన్‌లో 2012 ఒలింపిక్స్‌లో పాల్గొన్న తర్వాత ఆమె హటాత్తుగా ఇలాంటి టర్న్ తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. రాజస్థాన్‌లోని ‘చురు’ జిల్లాకు చెందిన వీరేందర్‌ని పెళ్లి చేసుకుని ఆ జిల్లాకు కోడలిగా వెళ్లేటప్పుడు అది తన రాజకీయ వేదికగా మారుతుందని ఆమె కూడా ఊహించలేదు. 2013లో రాహుల్ గాంధీ... చురులో ఎన్నికల పర్యటనకు వచ్చినప్పుడు ఆ వేదిక మీద కనిపించారామె. మరుసటి రోజు పేపర్లలో ‘క్రీడాకారిణి కృష్ణ పూనియా రాజకీయ రంగ ప్రవేశం’ అని పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. అదే ఎన్నికల్లో ఆమె చురు జిల్లాలోని సదుల్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ అప్పుడామె గెలవలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అదే సదుల్పూర్ నుంచి 18 వేల భారీ మెజారిటీతో గెలిచారామె. ఇప్పుడు కృష్ణ పూనియా సదుల్పూర్ ఎమ్మెల్యే. జైపూర్ వాళ్లకీ ఆశ్చర్యమే ఈ ఏప్రిల్ ఒకటవ తేదీన ఆశ్చర్యకరంగా జైపూర్ రూరల్ పార్లమెంటరీ నియోజకవర్గం తెర మీదకొచ్చారు పూనియా. ‘ఈ సంగతి నాక్కూడా రాత్రే తెలిసింది’ అని ఏప్రిల్ రెండవ తేదీన మీడియాతో చెప్పారామె. ‘‘ఆ స్థానం నుంచి నేను పోటీ చేయాల్సిన అవసరం ఉన్నట్లు పార్టీ భావించింది... అని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ చెప్పారు. నేను పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తున్నాను’’ అన్నారామె. ‘‘ఇది నాకు గొప్ప అవకాశం. చాలెంజింగ్ జాబ్’’ అని కూడా అన్నారు. ఈ మాటతో మరోసారి పార్టీ పెద్దల గుడ్‌లుక్స్‌లో పడిపోయారు కృష్ణ. ఇక ఆమె జైపూర్ ప్రజల గుడ్‌లుక్స్‌లో పడాలి. రాథోడ్ మీద పోటీ చేస్తున్నట్లు ప్రకటన వెలువడగానే ఆమె అతడి మీద పదునైన వాగ్బాణాన్ని సంధించారు. ‘‘నేను రైతు బిడ్డను. గ్రామీణ ప్రజల కష్టాలు తెలుసు. వాళ్ల జీవనశైలి తెలుసు. గ్రామాల్లో యువతీయువకులు ఆడుకునేటట్లు ఎండలో ఆడే ఆటనే (డిస్కస్ థ్రో) ఎంచుకున్నాను. ఏసీ హాల్లో ప్రదర్శించే ఆట కాదు నాది’’ అంటూ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ రైఫిల్ షూటింగ్‌ని సంపన్నుల క్రీడగా అభివర్ణించారామె. ఇద్దరి పరుగూ ఒకేసారి కృష్ణ పూనియాతోపాటు ఆమె ప్రత్యర్థి రాథోడ్ రాజకీయ జీవితం కూడా 2013లోనే మొదలైంది. అదే ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పూనియా గెలుపును అందుకోలేకపోయారు. మరుసటి ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జైపూర్ రూరల్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రాథోడ్ గెలిచారు. కేంద్రంలో క్రీడాశాఖ మంత్రి అయ్యారు. ఇది ఐదేళ్ల నాటి పరిస్థితి. ఇప్పుడు సీన్ ఇందుకు భిన్నం. రాథోడ్ పార్లమెంటు మెంబరుగా గెలిచినప్పుడు రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండింది. అధికార పార్టీ అతడికి వెన్నుదన్నుగా నిలిచింది. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. పూనియాకి కూడా పార్టీ నుంచి సహాయసహకారాలు పుష్కలంగా అందుతున్నాయి. పూనియా జాట్ మహిళ, ఓటర్లలో జాట్లు 23 శాతం. రాథోడ్‌ది రాజపుత్ర కుటుంబం, నియోజకవర్గంలో వారి జనాభా పదిశాతం మాత్రమే ఉంది. రాథోడ్ గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీద మూడు లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు పూనియా అతడికి గట్టి పోటీ ఇవ్వడంతోపాటు గెలుపు తీరాన్ని చేరే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కుర్చీలాట మామూలే రాజస్థాన్‌లో ఒకసారి బీజేపీ గెలిస్తే మరోసారి కాంగ్రెస్ పార్టీ గెలవడం ఆనవాయితీ. ఆ క్రమంలోనే వసుంధర రాజె, అశోక్ గహ్లోత్‌లు కుర్చీలాట ఆడుకున్నట్లు సీట్లు మార్చుకుంటూ ఉండేవారు. జైపూర్ లోక్‌సభ పరిధిలో ఎనిమిది అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఎనిమిదింటిలో ఐదింట కాంగ్రెస్ గెలిచింది. రెండు బీజేపీ, ఒకటి ఇండిపెండెంట్ ఖాతాలో పడ్డాయి. ఈ కొద్ది నెలల్లో ఓటర్ల మూడ్ ఆమాంతం మారిపోవడానికి అవకాశం తక్కువ. అది కూడా కృష్ణ పూనియాకు కలసి వచ్చే అంశమే. అయితే చురు జిల్లా కు చెందిన వ్యక్తి తమకు అభ్యర్థిగా వస్తే జైపూర్ ఓటర్లు స్వాగతిస్తారా లేదా అనేది కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయమే. సదుల్పూర్... జైపూర్‌కు సమీపంలో ఏమీ లేదు. రెండిటి మధ్య రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉంది. మహిళా ప్రతినిధిగా కృష్ణపూనియా సమర్థంగా రాణిస్తుందనడంలో ఎవరికీ సందేహాల్లేవు. కానీ ‘ఒక ఊరి పాలెగాడు మరో ఊరికి పోలిగాడు’ అనే సామెత రాజకీయాల్లో తరచూ నిజమవుతూనే ఉంటుంది. జైపూర్ ఓటర్లు ఆమెను జైపూర్ వాసిగా అక్కున చేర్చుకుంటారా లేక చురు అమ్మాయి కదా అని నొసలు చిట్లిస్తారా అనేది మే నెల ఆరున ఈవీఎంకి తెలుస్తుంది. మనం మే 23 వరకు ఆగాలి. వాకా మంజులారెడ్డి ప్రత్యర్థి ట్రాక్ రికార్డు కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ రైఫిల్ షూటింగ్ చాంపియన్, 2004 ఏథెన్స్ గేమ్స్‌లో డబుల్ ట్రాప్‌లో సిల్వర్ మెడల్, 2002, 2006లో కామన్వెల్త్ గేమ్స్‌లో వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్ విభాగంలో బంగారు పతకాలు సాధించారు. అంతకంటే ముందు ఆర్మీలో కల్నల్‌గా దేశానికి అందించిన సేవలకు గాను సైన్య సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, స్పెషల్ సర్వీస్ మెడల్ అందుకున్నారు. భారత ప్రభుత్వం అతడిని రాజీవ్ ఖేల్‌రత్న, అర్జున, పద్మశ్రీ పురస్కారాలతో గౌరవించింది. 2014లో జైపూర్ రూరల్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మోదీ ప్రభుత్వంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, క్రీడాశాఖల మంత్రిగా విధులు నిర్వహించారు. మహిళా చైతన్యం జైపూర్‌లో జరిగిన ఒక సంఘటన కృష్ణ పూనియాలో ఒక ఉద్యమకారిణిని బయటకు తెచ్చింది. 2017 జనవరిలో ఓ రోజు సాయంత్రం ఆమె చురు జిల్లాలో సొంతూరుకెళ్లినప్పుడు జరిగిందా సంఘటన. ఇద్దరమ్మాయిలు నడిచి వెళ్తున్నారు, వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు. అక్క టెన్త్ క్లాస్, చెల్లెలు నైన్త్ క్లాస్. ముగ్గురబ్బాయిలు బైక్ మీద వెళ్తూ వాళ్లను ఏడిపిస్తున్నారు. తన కారులో చేజ్ చేస్తూ ముందుకెళ్లి బైక్‌ను ఆపేసి ఆ ముగ్గురు ఆకతాయిలనూ కాలర్ పట్టుకుని లాగి పెట్టి చెంప మీద కొట్టారామె. ముగ్గురు కుర్రాళ్లు ఒక మహిళకు భయపడడానికి ఇదేమైనా సినిమా సన్నివేశమా అనిపిస్తుంది. కానీ కృష్ణ పూనియా ఎత్తు ఆరడుగుల ఒక అంగుళం. క్రీడాకారిణి కావడంతో దేహదారుఢ్యం బాగుంటుంది. దానికితోడు నలభై ఏళ్ల మహిళలో కనిపించే పరిణతి, కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి స్పందించిన ఆ క్షణంలో ఆమెలో కనిపించిన ధర్మాగ్రహం ఆ కుర్రాళ్లను భయపెట్టింది. కృష్ణ వాళ్లను చెంపదెబ్బలు కొట్టి అంతటితో సరిపెట్టలేదు, స్థానిక పోలీస్‌కు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. రెండు నిమిషాల నడకదూరంలో ఉంది పోలీస్ స్టేషన్. అయినా సమాచారం అందుకున్న తర్వాత ఎంత సేపటికీ రాలేదు పోలీసులు. రెండోసారి ఫోన్ చేసి మీరు వచ్చే వరకు కదిలేది లేదని చెప్పడంతో నెమ్మదిగా వచ్చారు. పోలీస్ అనగానే బెదిరిపోయారు ఆ ఇద్దరమ్మాయిలు. ‘పోలీస్ కేసు పెడితే మా అమ్మానాన్నలు మమ్మల్ని ఇల్లు కదలనివ్వరు. స్కూలు కూడా మాన్పించేస్తార’ని ఏడుపందుకున్నారు. అప్పటికి ఆ అమ్మాయిలను ఇంటికి పంపించేసి, పోకిరీ పిల్లలను పోలీసులకు అప్పగించి ఇంటికి వెళ్లిపోయారు కృష్ణ పూనియా. మనదేశంలో ఆడపిల్లలు ఎంతటి అభద్రత స్థితిలో జీవిస్తున్నారో చెప్పడానికి ఒక సందర్భంలో ఈ సంగతిని ప్రస్తావించారామె. ‘‘బేటీ బచావో, బేటీ పఢావో... అని నినాదాలివ్వడం కాదు. ఆడపిల్ల... తనకు అన్యాయం జరిగితే న్యాయం కోసం పోరాడడానికి గొంతెత్త గలగాలి. అది లేనప్పుడు ఎన్ని పథకాలున్నా వృథా’’ అన్నారు. ఆ మాటకు రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ ‘ఆడపిల్లకు న్యాయం కోసం పోరాడగలిగిన ధైర్యం రావాలంటే ముందు ఆ బిడ్డ బతికి బట్టకట్టాలి, ఆ తరవాత చదువుకుని ధైర్యం తెచ్చుకోవాలి. ఆడపిల్లలు తమ కోసం తాము పోరాడగలిగే వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశం’ అని ఆమె ఎత్తిపొడుపుకు వివరణలు ఇస్తూనే... ‘ఆపదలో ఉన్న అమ్మాయిలను కాపాడడానికి కృష్ణ పూనియా చూపించిన చొరవను అభినందించారు. -
‘అథ్లెట్ల మధ్య యుద్ధం కాదు ఇది’
జైపూర్ : లోక్‌సభ ఎన్నికల వేళ జైపూర్ రూరల్ పార్లమెంట్ స్థానం ఒలంపియన్ల మధ్య ‘యుద్ధాని’కి వేదిక అయ్యింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున కేంద్ర మంత్రి రాజ్‌వర్థన్ సింగ్ పోటీ చేస్తుండగా.. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ క్రిష్ణ పునియాను బరిలో దింపింది. దీంతో ఒలంపిక్ క్రీడల్లో భారత దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఇద్దరు అథ్లెట్లు.. ప్రస్తుతం వేర్వేరు పార్టీల నుంచి బరిలో దిగడంతో అక్కడ ఆసక్తికర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో వీరి పోటీని ‘ఇద్దరు ఒలంపియన్ల మధ్య యుద్ధం’ గా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ విషయం గురించి సదులాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్రిష్ణ పునియా మాట్లాడుతూ.. ‘ ఇది అథ్లెట్ల మధ్య యుద్ధం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మా పార్టీ కృషి చేస్తోంది. యువత, మహిళలు, రైతు సంక్షేమం పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. కానీ చౌకీదార్లుగా చెప్పుకుంటున్న వ్యక్తులు జాతి సంపదను దళారులు దోచుకుంటుంటే ఏం చేస్తున్నారో. బహుశా వాళ్లు నిద్రపోతూ ఉంటారు’ అని ఎద్దేవా చేశారు. కాగా 2004 ఏథెన్స్ ఒలంపిక్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్(49) 2013లో బీజేపీలో చేరారు. కామన్వెల్త్ క్రీడలు, పలు అంతర్జాతీయ చాంపియన్ షిప్లో అనేక పతకాలు సాధించిన ఆయన ప్రస్తుతం కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. జైపూర్ రూరల్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న రాథోడ్ మరోసారి విజయం సాధించాలనే నిశ్చయంతో ఉన్నారు. ఇక హర్యానాకు చెందిన క్రిష్ణ పునియా(36).. కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణం సాధించిన భారత మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించారు. మూడు సార్లు ఒలంపిక్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆమె.. 2011లో పద్మశ్రీ పొందారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన పునియా ఇటీవల జరిగిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సదులాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం పార్టీ అధిష్టానం మేరకు ఆమె జైపూర్ పార్లమెంట్ స్థానం నుంచి రాథోడ్‌పై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఇద్దరు క్రీడాకారులు ఒకే ఏడాదిలో అంటే 2013లోనే రాజకీయాల్లో ప్రవేశించడం విశేషం. -
ఈవ్ టీజర్లను వెంటాడి.. రఫాడిన లేడీ ప్లేయర్!
జైపూర్: భారత డిస్కస్ త్రో క్రీడాకారిణి కృష్ణ పూనియా నిజమైన హీరోగా నిలిచారు. రాజస్థాన్‌లోని చిరు పట్టణమైన చురులో ఆమె ముగ్గురు ఆకతాయిలను వెంటాడి.. ఒకడి భరతం పట్టారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఓ రైల్వే క్రాసింగ్ వద్ద తన కారులో పూనియా వేచి చూస్తుండగా.. ముగ్గురు యువకులు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలను వేధించడం ఆమె కంటపడింది. వెంటనే కారులోంచి దిగిన ఆమె ఆకతాయిలను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. దీంతో బెదిరిపోయిన ముగ్గురు యువకులు బైక్ మీద పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయినా, వారిని వదిలిపెట్టకుండా వెంటాడి మరీ బైక్ మీద ఒక ఆకతాయిని ఆమె పట్టుకొని పోలీసులకు అప్పగించారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు కృష్ణ పూనియా గోల్డ్ మెడల్ అందించిన సంగతి తెలిసిందే. 'అమ్మాయిలను ఆకతాయిలు వేధిస్తుండటం చూడగానే.. వారు నా కూతుళ్లయితే ఏం చేసేదాన్ని అన్న ఆలోచన వచ్చింది. వెంటనే కిందకు దిగాను. నేను ఎదురుపడటంతో వారు పరారయ్యారు' అని పూనియా 'హిందూస్తాన్ టైమ్స్'కు తెలిపింది. ఒక ఆకతాయిని పట్టుకొని పోలీసులకు ఫోన్ చేసినా వారు వెంటనే సంఘటనాస్థలానికి రాలేదని, ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే.. దేశంలో మహిళలకు భద్రత ఎలా లభిస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
కృష్ణ పూనియాకు దక్కని ‘రియో’ బెర్త్
న్యూఢిల్లీ: భారత మేటి డిస్కస్ త్రోయర్ కృష్ణ పూనియా రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఫ్లోరిడాలో జరిగిన క్వాలిఫయింగ్ మీట్లో ఆమె డిస్క్‌ను 57.10 మీటర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచింది. అయితే ఒలింపిక్స్ అర్హత ప్రమాణమైన 61 మీటర్లను అందుకోవడంలో మాత్రం విఫలమైంది. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు తుది గడువు సోమవారం కావడంతో ఇక ఈ మెగా ఈవెంట్లో పూనియా పాల్గొనే అవకాశాలు లేనట్లే. కేంద్ర క్రీడాశాఖ ప్రవేశపెట్టిన టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) కింద గత రెండు నెలలుగా పూనియా అమెరికాలో శిక్షణ తీసుకుంటోంది. 2004, 2008, 2012 ఒలింపిక్స్‌లో పాల్గొన్న పూనియా ఫైనల్ రౌండ్ వరకు వచ్చినా పతకం గెలవలేదు. లండన్ ఒలింపిక్స్‌లో మాత్రం ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ‘రియోకు అర్హత సాధించేందుకు చాలా కృషి చేశా. కానీ సాధ్యం కాలేకపోయింది. నా శిక్షణకు సహకరించిన క్రీడాశాఖ, సాయ్లకు కృతజ్ఞతలు. రియోలో పాల్గొనే నా సహచరులు విజయవంతం కావాలని ఆశిస్తున్నా’ అని పూనియా పేర్కొంది. -
కాంగ్రెస్‌లో చేరిన కృష్ణపూనియా
మహిళా డిస్కస్ త్రోయర్ కృష్ణపూనియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విషయాన్ని ఇదివరకే ప్రకటించిన పూనియా.. రాజస్థాన్‌లో బుధవారం జరిగిన ర్యాలీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో లాంఛనంగా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తదితరులు పాల్గొన్నారు. రాజస్థాన్‌కు చెందిన పూనియా త్వరలో జరిగే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయవచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. 'నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. క్రీడల్లో దేశం కోసం పతకాలు సాధించా. ప్రస్తుతం ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వచ్చా' అని పూనియా చెప్పారు. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం పతకం సాధించారు. ఇతర అంతర్జాతీయ వేదికలపైనా సత్తాచాటారు. -
సోధికి ఖేల్త్న్ర, కోహ్లికి అర్జున
ఘనంగా క్రీడా అవార్డుల ప్రదానం రాష్ర్టపతి చేతులమీదుగా అందజేత న్యూఢిల్లీ: ఆయా క్రీడల్లో తమ అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి వన్నె తెచ్చిన ఆటగాళ్లను కేంద్ర ప్రభుత్వం అవార్డులతో సత్కరించింది. రాష్ట్రపతి భవన్లో శనివారం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్త్న్రను షూటర్ రంజన్ సింగ్ సోధి అందుకున్నాడు. వరుసగా మూడోసారి కూడా ఈ అవార్డు ఓ షూటర్‌కే దక్కడం విశేషం. వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో స్వర్ణాలు నెగ్గిన ఏకైక భారత షూటర్‌గా రికార్డులకెక్కిన సోధికి ఈ అవార్డు కింద రూ.7.5 లక్షల నగదు, పతకం, మెమొంటో అందజేశారు. ఇక భారత క్రికెట్ భవిష్యత్ కెప్టెన్‌గా పిలువబడుతున్న విరాట్ కోహ్లి అర్జున అవార్డును అందుకున్నాడు. ఈ సమయంలో అక్కడున్న వారు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. కోహ్లితో పాటు మరో 13 మంది కూడా అర్జున అవార్డులు అందుకున్నారు. అర్జున దక్కించుకున్న వారికి రూ.5 లక్షల చొప్పున నగదు, మెమొంటో, విగ్రహం అందజేశారు. అవార్డీల జాబితా రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర: రంజన్ సింగ్ సోధి అర్జున అవార్డు: విరాట్ కోహ్లి (క్రికెట్), పీవీ సింధు (బ్యాడ్మింటన్), జ్యోత్స్న చినప్ప (స్క్వాష్), కవితా చాహల్ (బాక్సింగ్), సాబా అంజుమ్ (హాకీ), నేహా రాఠి (రెజ్లింగ్), రాజ్‌కుమారి రాథోడ్ (షూటింగ్), చెక్రవోలు సువురో (ఆర్చరీ), మౌమా దాస్ (టేబుల్ టెన్నిస్), రూపేశ్ షా (బిలియర్డ్స్ అండ్ స్నూకర్), అభిజిత్ గుప్తా (చెస్), గగన్ జీత్ భుల్లార్ (గోల్ఫ్), ధర్మేందర్ దలాల్ (రెజ్లింగ్), అమిత్ కుమార్ సరోహ (పారా అథ్లెటిక్స్). ద్రోణాచార్య అవార్డు: పూర్ణిమ మహతో (ఆర్చరీ), మహావీర్ సింగ్ (బాక్సింగ్), నరీందర్ సింగ్ సైనీ (హాకీ), రాజ్ సింగ్ (రెజ్లింగ్), కేపీ థామస్ (అథ్లెటిక్స్). ధ్యాన్‌చంద్ అవార్డు: మేరీ డి సౌజా సెక్వేరియా (అథ్లెటిక్స్), సయ్యద్ అలీ (హాకీ), అనిల్ మాన్ (రెజ్లింగ్), గిరిరాజ్ సింగ్ (పారా స్పోర్ట్స్). రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: పుల్లెల గోపీచంద్ - నిమ్మగడ్డ ఫౌండేషన్ అకాడమీ ఆఫ్ బ్యాడ్మింటన్, హైదరాబాద్. -
పూనియాకు మొండిచేయి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర అవార్డు కోసం పట్టు వదలకుండా ప్రయత్నించిన డిస్కస్ త్రోయర్ కృష్ణ పూనియాకు నిరాశే ఎదురైంది. మాజీ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ మైకేల్ ఫెరీరా నేతృత్వంలోని కమిటీ రూపొందించిన జాబితానే గురువారం క్రీడా మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. దీంతో డబుల్ ట్రాప్ షూటర్ రంజన్ సింగ్ సోధికి ఒక్కడికే ఖేల్త్న్ర దక్కనుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, క్రికెటర్ విరాట్ కోహ్లి సహా 15 మందికి అర్జున అవార్డు దక్కనుంది. ఖేల్ రత్న కోసం తన పేరును పరిగణలోకి తీసుకోవాలని పూనియా ఇంతకుముందే క్రీడల మంత్రిని కలుసుకుంది. దీంతో పూనియా పేరును మరోసారి పరిశీలించాలని అవార్డు కమిటీని మంత్రి జితేంద్ర సింగ్ కోరారు. ' ‘ఈ నెల ప్రారంభంలో కమిటీ రూపొందించిన జాబితాలో ఎలాంటి మార్పులు జరగలేదు. పూని యా, గిరీశ ఫిర్యాదులను పరిశీలించడంతోనే తుది ప్రకటనకు ఆలస్యమైంది. అయితే ఖేల్ రత్నను ఒక్కరికే ఇవ్వాలని నిర్ణయించారు’ అని క్రీడల కార్యదర్శి పీకే దేవ్ తెలిపారు. సోమవారం ఈ అవార్డులను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే మంత్రి బిజీ షెడ్యూల్ కారణంగా వీటిని జాతీయ క్రీడా దినోత్సవం (ఈనెల 29) రోజున కాకుండా 31న అందజేస్తారు. అవార్డుల జాబితా: ఖేల్ రత్న: రంజన్ సింగ్ సోధి (షూటర్); అర్జున: కోహ్లి (క్రికెట్), పి.వి.సింధు (బ్యాడ్మింటన్), చక్రవోల్ సువురో (ఆర్చరీ), రంజిత్ మహేశ్వరి (అథ్లెటిక్స్), కవితా చాహల్ (బాక్సింగ్), రూపేశ్ షా (స్నూకర్), గగన్జిత్ బుల్లర్ (గోల్ఫ్), సాబా అంజుమ్ (హాకీ), రాజ్‌కుమారీ రాథోర్ (షూటింగ్), జోత్స్న చినప్ప (స్క్వాష్), మౌమా దాస్ (టేబుల్ టెన్నిస్), నేహా రాతీ (రెజ్లింగ్), ధర్మేంద్ర (రెజ్లింగ్), అభిజిత్ (చెస్), అమిత్ (ప్యారా స్పోర్ట్స్). -
నాకు అన్యాయం జరిగింది!
న్యూఢిల్లీ: రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేయకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని డిస్కస్ త్రోయర్ కృష్ణ పూనియా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఆమె బుధవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ను కలిసింది. రోజంతా ప్రయత్నించినా మంత్రి కార్యాలయాల్లో జితేంద్రను కలవలేకపోయిన పూనియాకు ఎట్టకేలకు ఆయన ఇంట్లో ఆ అవకాశం లభించింది. ఆమె అభ్యర్థనకు సంబంధించి వివరాలు తెలుసుకొని తగిన చర్య తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు పూనియా వెల్లడించింది. ‘15 నిమిషాల పాటు ఆయన ఓపిగ్గా నా మాటలు విన్నారు. ఎంపికలో ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుతామని మంత్రి చెప్పారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకుంది’ అని పూనియా వెల్లడించింది. రెజ్లర్ సుశీల్ కుమార్... పూనియాకు మద్దతుగా నిలిచాడు. సోధితో పాటు సంయుక్తంగా పూనియాకు అవార్డు ఇవ్వాలన్నాడు. ద్వంద్వ ప్రమాణాలు... లండన్ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన అందరికీ అవార్డులు దక్కాయని, తనకు మాత్రం ఇవ్వకుండా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని పారాలింపియన్ గిరీష విమర్శించాడు. గత ఏడాది విజయ్‌కుమార్‌కు ఇచ్చిన తరహాలో తననూ ఖేల్త్న్రకు ఎంపిక చేయాలని కోరాడు. ఒక వేళ సాధ్యం కాకపోతే ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ కనీసం అర్జున అవార్డును ప్రకటించాలని విజ్ఞప్తి చేశాడు. ‘ఖేల్’ మార్చిన అంజలి... వాస్తవానికి పెరీరా నేతృత్వంలోని కమిటీ ముందు ఖేల్త్న్ర అవార్డు కోసం పూనియా, గిరీష పేర్లే వచ్చాయి. చివరి నిమిషంలో సోధి పేరు చేర్చాల్సిందిగా మాజీ షూటర్ అంజలీ భగవత్ ఒత్తిడి తెచ్చి తన పంతం నెగ్గించుకున్నారు. గిరీషను తప్పించి పూనియా, సోధి మధ్య ఓటింగ్ జరపగా 12 మంది సభ్యులు 6-6తో ఇద్దరినీ సమర్ధించారు. ‘సాయ్’ డెరైక్టర్ థామ్సన్, సోధికి మద్దతు పలకడంతో ఎంపిక ఖరారైంది.