సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ), చండీగఢ్ లాన్ టెన్నిస్ సంఘం (సీఎల్‌టీఏ) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వుటుకూరు లక్ష్మీసాహితిరెడ్డి చాంపియన్‌గా అవతరించింది. చండీగఢ్‌లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో లక్ష్మీసాహితి 7–5, 6–4తో సాల్సా అహిర్ (మహారాష్ట్ర)పై వరుస సెట్లలో విజయం సాధించింది. కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి చెందిన లక్ష్మీసాహితి క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టింది.
టైటిల్ గెలిచే క్రమంలో ఆమె ప్రత్యర్థులకు ఒక్కసెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. తొలి రౌండ్‌లో లక్ష్మీసాహితి 6–2, 6–2తో ఆర్తి మునియన్ (తమిళనాడు)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లో 7–6 (8/6), 6–1తో టాప్ సీడ్ యుబ్రాని బెనర్జీ (పశ్చిమ బెంగాల్)కి షాకిచ్చింది. క్వార్టర్ ఫైనల్లో 6–2, 6–4తో ఆరో సీడ్ ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ)పై, సెమీఫైనల్లో 6–4, 6–3తో నాలుగో సీడ్ శ్రావ్య శివాని (తెలంగాణ)పై విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment