లలిత్ మోడి
జైపూర్: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి.. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ) అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు రంగం సిద్ధమైంది. గురువారం జరగనున్న సంఘం ఎన్నికల్లో 33 జిల్లా సంఘాలకు గాను అతనికి 28 జిల్లాలు మద్దతు ఇవ్వనున్నాయి. దీంతో ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి.
ఈ పరిణామం మొత్తాన్ని చూస్తే బీసీసీఐకి ఇది పెద్ద ఎదురుదెబ్బ కానుంది. జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న మోడి... ఎన్నికల్లో పాల్గొనకుండా మొదట్నించీ బోర్డు చేసిన ప్రయత్నాలన్నీ ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నాయి. అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న రాంపాల్ శర్మ (బిల్వారా సంఘం కార్యదర్శి)పై మోడిదే పైచేయిగా కనిపిస్తోంది. ఉపాధ్యక్ష పదవి కోసం మోడి తరఫున న్యాయవాది ఆబ్ది, కరుణేశ్‌ల మధ్య పోటీ నెలకొంది.
మరోవైపు అధ్యక్ష పదవి కోసం మోడి దాఖలు చేసిన నామినేషన్‌కు సుప్రీం కోర్టు నియమించిన ఎన్నికల ముఖ్య పరిశీలకుడు రిటైర్డ్ జస్టిస్ నరేంద్ర మోహన్ కస్లివాల్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శర్మ తరఫు లాయర్ మూడు పాయింట్లపై చేసిన వాదనలను జడ్జి తోసిపుచ్చారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ఆదేశాల మేరకు ముంబై రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్... మోడి పాస్‌పోర్ట్‌ని రద్దు చేసిందని, దీనివల్ల అతను లండన్‌లో ఉండి ఇక్కడ ఆర్‌సీఏ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడం సాధ్యం కాదని వాదించడంతో పాటు క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న వ్యక్తి బీసీసీఐ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడని లాయర్ స్పష్టం చేశారు. దీనికి మోడి తరఫు లాయర్ అభినవ్ శర్మ ప్రతివాదనలు వినిపిస్తూ... రాజస్థాన్ క్రీడా చట్టాలు-2005 ప్రకారం అధ్యక్షుడు తన కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్రతీసారి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేదని తెలిపారు.