Rajastan cricket association
-
ఆర్సీఏ ఫలితాల వెల్లడి మరోసారి వాయిదా
న్యూఢిల్లీ: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) అధ్యక్ష ఎన్నికల ఫలితాల వెల్లడిని సుప్రీం కోర్టు ఐదోసారి వాయిదా వేసింది. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఎన్నిక లాంఛనమే అయినప్పటికీ ఫలితాలు వెల్లడించకుండా ఉండేందుకు బీసీసీఐ విశ్వప్రయత్నాలు చేస్తోంది. తాజాగా సుప్రీం ఈ ఫలితాలను ఈనెల 25కు వాయిదా వేసింది. అదే రోజు ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఉదంతాలపై ముద్గల్ కమిటీ అందించిన నివేదికపై కూడా సుప్రీం కోర్టు మరో బెంచ్ విచారించనుంది. డిసెంబర్లో జరిగిన ఆర్సీఏ ఎన్నిక ల్లో 33 ఓట్లకు గాను 26 ఓట్లు మోడికి పడినట్టు తమకు తెలుసని గత జనవరిలో బీసీసీఐ లాయర్లు కోర్టుకు తెలిపారు. మోడిపై తాము జీవితకాల నిషేధం విధించామని, ఈ ఎన్నికల్లో పాల్గొనే అర్హత లేదని బోర్డు వాది స్తోంది. అయితే ఆర్సీఏ అనేది రాజస్థాన్ క్రీడా చట్టం పరిధిలో ఉంటుందని మోడి వర్గం తిప్పికొడుతోంది. -
మోడి ‘ఎన్నిక’ 11కు వాయిదా
న్యూఢిల్లీ: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల ఫలితాల వెల్లడిని సుప్రీం కోర్టు ఈనెల 11కు వాయిదా వేసింది. ఈ పదవికి ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే మోడి ఎన్నిక లాంఛనమే అయినప్పటికీ బీసీసీఐ ఆ ఫలితాలను ఇప్పుడే ప్రకటించవద్దని, తమ వాదనలను వినాల్సిందిగా ఇదివరకే సుప్రీం కోర్టును కోరింది. మంగళవారమే విచారణ జరగాల్సి ఉన్నా బోర్డు మరింత సమయం కోరడంతో వచ్చే వారానికి కేసు వాయిదా వేసింది. చండిలాకు బీసీసీఐ సమన్లు ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌లో ఇరుక్కున్న రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు అజిత్ చండిలాకు బీసీసీఐ సమన్లు పంపింది. నేడు (బుధవారం) తమ ముందు విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. దోషిగా తేలితే చండిలాపై బోర్డు 5 ఏళ్లు లేదా జీవితకాల నిషేధం విధించే అవకాశాలున్నాయి. -
27న ఆర్సీఏ ఎన్నికల ఫలితాల వెల్లడి
న్యూఢిల్లీ: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ)కు జరిగిన ఎన్నికల ఫలితాల వెల్లడి మరోసారి వాయిదా పడింది. తొలుత వీటిని ఈనెల 6న ప్రకటించాల్సి ఉండగా సుప్రీం కోర్టు 17కు వాయిదా వేసింది. తాజాగా ఈ ఫలితాలు 27కు వాయిదా పడ్డాయి. 23నబీసీసీఐ అత్యవసర సమావేశం: ఈనెల 23న చెన్నైలో బీసీసీఐ అత్యవసర సమావేశం జరుగనుంది. ఈమేరకు తమ సభ్యులకు బోర్డు ఈమెయిల్ పంపింది. అయితే సమావేశ అజెండా ఏమిటనేది ప్రకటించలేదు. -
మోడిపై సుప్రీంకు వెళ్లిన బోర్డు
ముంబై: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) అధ్యక్షుడిగా ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి నియామకాన్ని అడ్డుకునేందుకు బీసీసీఐ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈమేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. క్రికెట్ బోర్డు నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్నప్పటికీ లెక్కచేయకుండా గత నెల 19న జరిగిన ఆర్సీఏ ఎన్నికల్లో మోడి అధ్యక్ష బరిలోకి దిగారు. వచ్చే వారం సుప్రీం కోర్టు ప్రకటించే ఈ ఫలితాల్లో మోడి దాదాపుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఆర్సీఏ అనేది రాజస్థాన్ క్రీడా చట్టం కిందికి వస్తుందని, ఈ ఎన్నికల్లో బోర్డు నిషేధం పనిచేయదని మోడి మద్దతుదారులు వాదిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చట్టంపై ఆర్సీఏ మాజీ కార్యదర్శి కిశోర్ రుంగ్తా సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు బీసీసీఐ కూడా దీంట్లో ఇంప్లీడ్ అయ్యింది. ఈనెల 6న ఇది విచారణకు రానుంది. ఆర్సీఏలో మోడి తిరిగి క్రియాశీలకంగా మారితే బోర్డు ప్రతిష్ట దెబ్బతింటుందని, మోడి అభ్యర్థిత్వంపై బీసీసీఐ అభ్యంతరాలను ఆర్సీఏ పట్టించుకోకపోవడంతో అతడి నామినేషన్‌ను పరిగణనలోకి తీసుకోకూడదని తమ పిటిషన్లో పేర్కొంది. -
మోడిపై సుప్రీంకు బీసీసీఐ
చెన్నై: జీవిత కాల నిషేధాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన లలిత్ మోడి వ్యవహారాన్ని సుప్రీం కోర్టులో తేల్చుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. శనివారం జరిగిన బోర్డు అత్యవసర వర్కింగ్ కమిటీ సమావేశం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ క్రీడా చట్టంపై ఇదివరకే సవాయ్మధోపూర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు కిశోర్ రుంగ్తా అపెక్స్ కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)లో తాము కూడా భాగస్వాములం కావాలని కమిటీ నిర్ణయించింది. ఆర్సీఏ అనేది రాజస్థాన్ క్రీడా చట్టం ప్రకారమే నడుస్తుందని, అందుకే ఈ ఎన్నికల్లో బీసీసీఐ నిషేధం మోడిపై వర్తించదని అతడి మద్దతుదారులు వాదిస్తున్నారు. దీనికి తోడు ఈ ఎన్నికల కోసం సుప్రీం కోర్టు నియమించిన పరిశీలకుడు కూడా మోడి పోటీకి అనుమతిచ్చారు. మరోవైపు అవినీతి వ్యతిరేక యూనిట్ కార్యకలాపాల గురించి, ఇన్‌కమ్‌ట్యాక్స్ అంశంపై కూడా సభ్యులు చర్చించారు. అబ్దికి ప్రవేశం నిరాకరణ ఎలాంటి పరిస్థితిలో తాము లలిత్ మోడిని ఎన్నికల బరిలోకి అనుమతించిందీ వివరించేందుకు ఆర్సీఏ తమ ప్రతినిధిగా లాయర్ మెహమూద్ అబ్దిని వర్కింగ్ కమిటీకి పంపించింది. అయితే అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడి భద్రతా సిబ్బంది లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ విషయంలో తమ నిరసనను తెలుపుతూ బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్‌కు ఆర్సీఏ కార్యదర్శి కేకే శర్మ ఈ మెయిల్ పంపారు. తమ ప్రతినిధికి జరిగిన అవమానంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. వర్కింగ్ కమిటీ ముందు తమ వాదనను అనుమతించేదీ.. లేనిదీ తెలపాల్సిన కనీస సంప్రదాయాన్ని బోర్డు పాటించాల్సిందని అన్నారు. మోడిని దెబ్బతీయలేరు: అబ్ది బోర్డు వైఖరి ఇతర సభ్యులకు కనువిప్పు కావాలని ఆర్సీఏ ప్రతినిధి అబ్ది చెప్పారు. మోడి పోటీపై తమ వాదనేమిటో బోర్డు వినాల్సిందని అన్నారు. లలిత్ మోడిపై బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ ఎలాంటి చర్యలకు దిగరాదని సూచించారు. ఎందుకంటే ఇదివరకే వారిద్దరి మధ్య శతృత్వం ఉన్న కారణంగా సరైన నిర్ణయం తీసుకోలేరని చెప్పారు. శ్రీనివాసన్, ఆయన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్‌పై ఎఫ్ఐఆర్ దాఖలైం దని, అందుకే మోడిపై నిర్ణయం తీసుకునే బాధ్యతల నుంచి ఆయన్ని తప్పించాలని డిమాండ్ చేశారు. -
6న ఆర్సీఏ ఎన్నికల ఫలితాలు
జైపూర్: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి పోటీ చేసిన రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) ఎన్నికలు గురువారం జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 6న వెల్లడి కానున్నాయి. సుప్రీం కోర్టు నియమించిన పరిశీలకులు జస్టిస్ ఎన్ఎమ్ కస్లీవాల్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఓటింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి పూర్తి నివేదికతో ఆయన సుప్రీం కోర్టుకు పంపించారు. జనవరి 6న విచారణ అనంతరం ఫలితాలు రానున్నాయి. మరోవైపు... తమ ఎన్నికల్లో నిషేధిత లలిత్ మోడిని అనుమతిస్తే వేటు తప్పదని బీసీసీఐ హెచ్చరించిన నేపథ్యంలో ఆర్సీఏ స్పందించింది. ‘రాజస్థాన్ క్రీడా చట్టం-2005 ప్రకారమే ఆర్సీఏ తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అలాగే సుప్రీం కోర్టులో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ ఆధారంగా ఈ ఎన్నికలు జరిగాయి’ అని బోర్డుకు లేఖ రాసింది. -
ఆర్సీఏ అధ్యక్షుడిగా మోడి?
జైపూర్: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి.. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు రంగం సిద్ధమైంది. గురువారం జరగనున్న సంఘం ఎన్నికల్లో 33 జిల్లా సంఘాలకు గాను అతనికి 28 జిల్లాలు మద్దతు ఇవ్వనున్నాయి. దీంతో ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ పరిణామం మొత్తాన్ని చూస్తే బీసీసీఐకి ఇది పెద్ద ఎదురుదెబ్బ కానుంది. జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న మోడి... ఎన్నికల్లో పాల్గొనకుండా మొదట్నించీ బోర్డు చేసిన ప్రయత్నాలన్నీ ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నాయి. అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న రాంపాల్ శర్మ (బిల్వారా సంఘం కార్యదర్శి)పై మోడిదే పైచేయిగా కనిపిస్తోంది. ఉపాధ్యక్ష పదవి కోసం మోడి తరఫున న్యాయవాది ఆబ్ది, కరుణేశ్ల మధ్య పోటీ నెలకొంది. మరోవైపు అధ్యక్ష పదవి కోసం మోడి దాఖలు చేసిన నామినేషన్‌కు సుప్రీం కోర్టు నియమించిన ఎన్నికల ముఖ్య పరిశీలకుడు రిటైర్డ్ జస్టిస్ నరేంద్ర మోహన్ కస్లివాల్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శర్మ తరఫు లాయర్ మూడు పాయింట్లపై చేసిన వాదనలను జడ్జి తోసిపుచ్చారు. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ ఆదేశాల మేరకు ముంబై రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్... మోడి పాస్‌పోర్ట్‌ని రద్దు చేసిందని, దీనివల్ల అతను లండన్‌లో ఉండి ఇక్కడ ఆర్సీఏ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడం సాధ్యం కాదని వాదించడంతో పాటు క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న వ్యక్తి బీసీసీఐ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడని లాయర్ స్పష్టం చేశారు. దీనికి మోడి తరఫు లాయర్ అభినవ్ శర్మ ప్రతివాదనలు వినిపిస్తూ... రాజస్థాన్ క్రీడా చట్టాలు-2005 ప్రకారం అధ్యక్షుడు తన కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్రతీసారి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేదని తెలిపారు. -
ఆర్సీఏ ఎన్నికల బరిలో లలిత్ మోడి
జైపూర్: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన లీగల్ కౌన్సిల్ మెహమూద్ అబ్ది ధృవీకరించారు. ఈనెల 19న ఆర్సీఏ ఎన్నికలు జరుగనున్నాయి. ఐపీఎల్లో ఆర్థిక అవకతవకల కారణంగా మోడిపై బీసీసీఐ ఇప్పటికే జీవితకాల బహిష్కరణ విధించింది. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. ‘ఆర్సీఏ మాజీ అధ్యక్షుడు లలిత్ మోడి ఈనెల 19న జరిగే ఎన్నికల్లో పోటీపడనున్నారు. తనపై జీవితకాల వేటు వేసిన బీసీసీఐని ఆయన సవాల్ చేయనున్నారు. పోటీ విషయంలో ఆయనకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం లేదు. ఎందుకంటే నాగ్‌పూర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇప్పటికే ఆయన అర్హులైన జాబితాలో ఉన్నారు. అంతేకాకుండా రాజస్థాన్ తమ స్పోర్ట్స్ యాక్ట్-2005 ప్రకారం క్రీడలను నిర్వహిస్తుంది. ఆయా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ల నుంచి మాకు మద్దతు లభిస్తోంది. కచ్చితంగా మా గ్రూపు విజయం సాధిస్తుంది’ అని అబ్ది అన్నారు. ఈ ఎన్నికల పరిశీలకులుగా జస్టిస్ కస్లివాల్ను సుప్రీం కోర్టు నియమించింది.