మోడిపై సుప్రీంకు బీసీసీఐ
చెన్నై: జీవిత కాల నిషేధాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన లలిత్ మోడి వ్యవహారాన్ని సుప్రీం కోర్టులో తేల్చుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. శనివారం జరిగిన బోర్డు అత్యవసర వర్కింగ్ కమిటీ సమావేశం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
రాజస్థాన్ క్రీడా చట్టంపై ఇదివరకే సవాయ్‌మధోపూర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు కిశోర్ రుంగ్తా అపెక్స్ కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)లో తాము కూడా భాగస్వాములం కావాలని కమిటీ నిర్ణయించింది. ఆర్‌సీఏ అనేది రాజస్థాన్ క్రీడా చట్టం ప్రకారమే నడుస్తుందని, అందుకే ఈ ఎన్నికల్లో బీసీసీఐ నిషేధం మోడిపై వర్తించదని అతడి మద్దతుదారులు వాదిస్తున్నారు. దీనికి తోడు ఈ ఎన్నికల కోసం సుప్రీం కోర్టు నియమించిన పరిశీలకుడు కూడా మోడి పోటీకి అనుమతిచ్చారు. మరోవైపు అవినీతి వ్యతిరేక యూనిట్ కార్యకలాపాల గురించి, ఇన్‌కమ్‌ట్యాక్స్ అంశంపై కూడా సభ్యులు చర్చించారు.
అబ్దికి ప్రవేశం నిరాకరణ
ఎలాంటి పరిస్థితిలో తాము లలిత్ మోడిని ఎన్నికల బరిలోకి అనుమతించిందీ వివరించేందుకు ఆర్‌సీఏ తమ ప్రతినిధిగా లాయర్ మెహమూద్ అబ్దిని వర్కింగ్ కమిటీకి పంపించింది. అయితే అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడి భద్రతా సిబ్బంది లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ విషయంలో తమ నిరసనను తెలుపుతూ బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్‌కు ఆర్‌సీఏ కార్యదర్శి కేకే శర్మ ఈ మెయిల్ పంపారు. తమ ప్రతినిధికి జరిగిన అవమానంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. వర్కింగ్ కమిటీ ముందు తమ వాదనను అనుమతించేదీ.. లేనిదీ తెలపాల్సిన కనీస సంప్రదాయాన్ని బోర్డు పాటించాల్సిందని అన్నారు.
మోడిని దెబ్బతీయలేరు: అబ్ది
బోర్డు వైఖరి ఇతర సభ్యులకు కనువిప్పు కావాలని ఆర్‌సీఏ ప్రతినిధి అబ్ది చెప్పారు. మోడి పోటీపై తమ వాదనేమిటో బోర్డు వినాల్సిందని అన్నారు. లలిత్ మోడిపై బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ ఎలాంటి చర్యలకు దిగరాదని సూచించారు. ఎందుకంటే ఇదివరకే వారిద్దరి మధ్య శతృత్వం ఉన్న కారణంగా సరైన నిర్ణయం తీసుకోలేరని చెప్పారు. శ్రీనివాసన్, ఆయన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలైం దని, అందుకే మోడిపై నిర్ణయం తీసుకునే బాధ్యతల నుంచి ఆయన్ని తప్పించాలని డిమాండ్ చేశారు.