సాక్షి, చెన్నై : తమిళనాడులో సంచలనం సృష్టించిన మైనర్‌పై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు దశ్వంత్‌కు ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మధ్యంతర స్టే విధిస్తూ సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. 2017 ఫిబ్రవరి 5న చెన్నై పోరూరు సమీపంలోని మౌళివాక్కం మదనందపురం మాతా నగర్‌లోని బహుళ అంతస్తుల భవనంలో నివాసం ఉంటున్న బాబు, శ్రీదేవి దంపతులు తమ కుమార్తె(7) కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించారు. నాలుగు రోజుల అనంతరం మదురవాయిల్ రహదారిలో సగం కాలిన స్థితిలో బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఏడేళ్ల బాలికపై లైంగికదాడి జరిపి హతమార్చినట్టు విచారణలో తేలింది. ఈ క్రమంలో ఆ కామాంధుడిని త్వరితగతిన అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు హోరెత్తాయి. విచారణ ముమ్మరం చేయగా బాధితురాలు నివాసం ఉంటున్న భవనం పై అంతస్తులో ఉన్న ఇంజినీరింగ్ పట్టభద్రుడు దశ్వంత్ నిందితుడిగా తేల్చారు. దీంతో అతడ్ని అరెస్టు చేసిన సమయంలో సామాజిక కార్యకర్తలు, యువతీ, యువకులు చితక్కొట్టేందుకు దూసుకెళ్లారు. నేరస్తుడిని ఉరి తీయాలన్న నినాదాన్ని హోరెత్తించారు. నిందితుడిపై గుండా చట్టం నమోదైంది. ఇక, అతడు బయటకు వచ్చే ప్రసక్తే లేదని సర్వత్రా భావించారు.
ఈ నేపథ్యంలో చట్టంలో ఉన్న లొసుగుల్ని తమకు అనుకూలంగా మలచుకుని నిందితుడి తండ్రి శేఖర్ తన పలుకుబడిని ప్రదర్శించారని చెప్పవచ్చు. దీంతో చట్టం ఆ నిందితుడికి చుట్టంగా మారిందా? అన్నట్టుగా పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నాలుగు గోడల మధ్య జైలులో మగ్గాల్సిన క్రూరుడు ఆర్నెళ్లకే బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఇదేం న్యాయం అని లోకాన్ని ప్రశ్నించిన వాళ్లు ఎక్కువే. అయితే ఇందుకు తగ్గ మూల్యం దశ్వంత్ రూపంలోనే ఆ కుటుంబం చెల్లించుకోక తప్పలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన దశ్వంత్ కన్న తల్లి సరళ (47)ను కడతేర్చి నరరూప రాక్షసుడయ్యాడు. పరారీలో ఉన్న అతడ్ని పోలీసులు ఎట్టకేలకు ముంబైలో అరెస్టు చేశారు.
సుప్రీంకోర్టుకు..:
ఈ కేసును విచారించిన చెంగల్పట్టు మహిళా కోర్టు దుశ్యంత్‌కు ఉరి శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ హైకోర్టును దశ్వంత్ ఆశ్రయించాడు. కేసు విచారణలో అనేక గందరగోళాలు ఉన్నాయని, ఉరి శిక్షను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు కాగా, హైకోర్టు తిరస్కరించింది. అలాగే, చెంగల్పట్టు మహిళా కోర్టు ఇచ్చిన తీర్పును «ధ్రువీకరిస్తూ, ఉరి శిక్ష అమలయ్యే రీతిలో ఆదేశాలిచ్చింది. దీంతో రాక్షసుడ్ని త్వరితగతిన ఉరి తీయాలన్న నినాదం మిన్నంటింది. ఈ పరిస్థితుల్లో కనీసం దశ్వంత్‌కు క్షమాభిక్ష పెట్టే విధంగా ఉరి శిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. పిటిషన్‌ను విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించడమే కాకుండా, ఉరి శిక్షను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల సమయంలో న్యాయమూర్తులు స్పందిస్తూ, యావజ్జీవ శిక్ష పడి ఉంటే, అస్సలు ఈ కేసును విచారణకు స్వీకరించే వాళ్లం కాదని వ్యాఖ్యానించారు. ఉరి శిక్ష విధించి ఉన్న దృష్ట్యా, కరుణా ధృక్పథంతో విచారణకు స్వీకరించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ కేసు విచారణ ముగిసే వరకు ఉరి శిక్ష అమలు చేయవద్దని ఆదేశిస్తూ, ఇందుకు తగ్గ మధ్యంతర స్టేను విధించారు. దీంతో ఉరి శిక్ష నుంచి దశ్వంత్ బయటపడ్డట్టే. దేశంలో ఉరి శిక్ష అమల్లో లేని దృష్ట్యా, కేసు తుది దశ చేరే నాటికి ఉరి యావజ్జీవంగా మారే అవకాశాలు ఎక్కువేనన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment